మాతపితరుల సేవే మానవ ధర్మం

ABN , First Publish Date - 2020-07-06T08:42:56+05:30 IST

‘‘వృద్ధులైన తల్లిదండ్రులను, అనుకూలవతియైున భార్యను, పసివాడైన కుమారుణ్ని, వేదవేత్తయైున విప్రుని, తననాశ్రయించిన వానిని, ఎవరైతే శక్తి కలిగి ఉన్నా పోషించరో, వారికి జీవిక కల్పించరో.. అటువంటి వారు

మాతపితరుల సేవే మానవ ధర్మం

  • మాతరం పితరం వృద్ధం, భార్యాం సాధ్వీం, సుతం శిశుమ్‌
  • గురుం విప్రం ప్రపన్నంచ కల్పో బిభ్రచ్ఛ్వసన్‌ మృతమ్‌!


‘‘వృద్ధులైన తల్లిదండ్రులను, అనుకూలవతియైున భార్యను, పసివాడైన కుమారుణ్ని, వేదవేత్తయైున విప్రుని, తననాశ్రయించిన వానిని, ఎవరైతే శక్తి కలిగి ఉన్నా పోషించరో, వారికి జీవిక కల్పించరో.. అటువంటి వారు బ్రతికి ఉన్నా చనిపోయినవారితో సమానం’’ అని దీని అర్థం. వేదవ్యాస మహర్షి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముని నోట పలికించిన పలుకులివి. కంసుని ఆహ్వానంపై నందగోకులం వదలి శ్రీకృష్ణ బలరాములిద్దరూ మధురానగరానికి వెళ్లే దారిలో పలు అవరోధాలను దాటుతారు. చాణూర ముష్టికుల వంటివారిని కరిపించి చివరిగా కంసవధతో తమ కార్యాన్ని పూర్తి చేస్తారు. కంసుడి చెరలో ఉన్న దేవకీవసుదేవులకు విముక్తిని కలిగిస్తారు. రాజ్యాన్ని కంసుని తండ్రియైున ఉగ్రసేనునికి అప్పగిస్తారు. తమ జననీ జనకులను కలుసుకున్నందుకు ఆనందపడి వారితో అనేకానేక విషయాలు చెబుతూ.. మనిషిగా పుట్టిన వాడి జీవితంలో చేయవలసిన కొన్ని మానవ ఽధర్మాలను గురించి చెబుతారు. ఆ క్రమంలో చెప్పిన మాటలే ఇవి.


సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ముద్దుమాటలు, చేష్టలను విని, చూసి ఆనందం పొందడం లోకధర్మం. పిల్లల బాల్యం, కౌమారం వారికి గొప్ప అనుభూతిని కలిగించే కాలం. కానీ దేవకీవసుదేవలకు ఆ భాగ్యం దక్కలేదని శ్రీకృష్ణుడు చింతించి వారిని ఓదార్చే మాటలు చెప్పాడు. అలాగే.. తల్లిదండ్రులను సేవించే భాగ్యం లేకుండానే తమ శైశవం, బాల్యం, కౌమారం గడిచాయని, అదొక భాగ్యహీనతగా భావించవచ్చునని కృష్ణుడు అనడం మాతాపితరుల పట్ల ఆ పరమాత్ముడికున్న పూజ్యభావానికి నిదర్శనం. లోకానికంతటికీ ఆదర్శం. అలాగే.. తమ మాతాపితరుల ఆకాంక్షలను అడ్డుకట్ట వేసిన కంసుని వధించడం పుత్ర ధర్మంగా భావించిన స్వామి.. ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి వారికి ఆనందం కలిగించాడు. తల్లిదండ్రులను కష్టాల నుంచి గట్టెక్కించాలన్న పుత్రధర్మాన్ని పోరాడైనా నెరవేర్చాలన్నది భాగవత సందేశం.


తల్లిదండ్రుల ద్వారా జన్మనంది ఈ లోకంలో జీవితాన్ని పండించుకుంటున్నవారు.. ఆ జననీ జనకులనే మరచి ప్రవర్తిస్తే, నూరేళ్లు బ్రతికినా వారి పితౄణము తీరదని భాగవతం స్పష్టంగా చెప్పింది.


యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ

వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయన్తి హి


సమర్థుడై ఉండీ.. మానవధర్మాన్ని మరచి జననీ జనకులను సేవించుకోని వాడు ఎవడైతే ఉంటాడో వాడికి నరకంలో తన మాంసాన్ని తానే తినే శిక్ష పడుతుంది. అలా శిక్ష పడుతుందన్న భయంతో కాకుండా.. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను నిజంగా ప్రేమతో, భక్తితో సేవించినవారి జన్మ ధన్యం. ఇహంలోనూ పరంలోనూ వారికి దేవతల ఆశీస్సులుంటాయి.

- గన్నమరాజు గిరిజామనోహరబాబు

Updated Date - 2020-07-06T08:42:56+05:30 IST