అదే.. ఆత్మ సాక్షాత్కారం

ABN , First Publish Date - 2020-05-26T10:06:00+05:30 IST

మనసును.. కనిపించే అన్ని వస్తువుల వెంట పడనీయక, దాన్ని ఆత్మ యందు (తనయందే) నిలిపి ఆత్మ స్వరూపాన్నే అనుసంధానం చేస్తూ.. తాను చిత్‌ (జ్ఞాన) స్వరూప ఆత్మను అని తెలుసుకున్నట్టయితే అదే తత్వ దర్శనం (ఆత్మసాక్షాత్కారం)

అదే.. ఆత్మ సాక్షాత్కారం

దృశ్య వారితం చిత్తమాత్మనః

చిత్వ దర్శనం తత్వ దర్శనం


మనసును.. కనిపించే అన్ని వస్తువుల వెంట పడనీయక, దాన్ని ఆత్మ యందు (తనయందే) నిలిపి ఆత్మ స్వరూపాన్నే అనుసంధానం చేస్తూ.. తాను చిత్‌ (జ్ఞాన) స్వరూప ఆత్మను అని తెలుసుకున్నట్టయితే అదే తత్వ దర్శనం (ఆత్మసాక్షాత్కారం) అని దీని భావం. భగవాన్‌ రమణులు రచించిన ‘ఉపదేశ సారం’లోని 16వ శ్లోకమిది. రాజ యోగానికి, జ్ఞాన యోగానికి సంధి శ్లోకమిది. మనం ఎలా విచారణ చేయాలో, ఏం విచారణ చేయాలో తెలియజేసే జ్ఞానయోగానికి రమణ మహర్షి పునాది వేస్తున్నారు. తత్వ దర్శనం (ఆత్మసాక్షాత్కారం) అంటే తత్వంలో నిలవడమే. అది ఎలా కలుగుతుంది? చిత్వ దర్శనం వల్ల. అదెలా కలుగుతుందంటే.. ‘దృశ్య వారితం చిత్తం ఆత్మనః’.. దృశ్యం వెంట పరుగులు తీసే మనసును వారించి తనయందే నిలపాలి. దృశ్యం ఉన్నంతవరకూ మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఏ వస్తువును చూసినా, ఎవరిని చూసినా ఏదో ఒక ఆలోచన వస్తుంది. దాని వెంట ఆలోచనల పరంపర కొనసాగుతుంది. ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన మనసు ఎంతదూరమైనా అలా పోతూనే ఉంటుంది. అలా పోకుండా కట్టడి చేయాలి. 


అదెలా అంటే.. రెండు ఉదాహరణలు చూద్దాం. ఒక గులాబీ పువ్వును మనం చూస్తాం. దాని అందాన్ని చూడగానే.. ఏ మహారాష్ట్రలోనో, పంజాబ్‌లోనో అంతకు ముందు చూసిన గులాబీలు గుర్తొస్తాయి. పంజాబ్‌ మాట గుర్తుకు రాగానే స్వర్ణదేవాలయం.. దాని వెనకే బ్లూస్టార్‌ ఆపరేషన్‌.. దాన్నుంచి ఇందిరాగాంధీ హత్య.. ఇలా మన ఆలోచనల పరంపర కొనసాగుతుంటుంది. ఎక్కడ గులాబీ పువ్వు.. ఎక్కడ ఇందిర హత్య? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఆలోచనా ధోరణి మార్చుకోవాలి. ‘ఈ గులాబీ చాలా బాగుంది. ఇంతకీ అది గులాబీ అని గ్రహించిన నేను ఎవరు? బుద్ధియే. మరి బుద్ధి ఆ విషయాన్ని తెలుసుకుంటోందని గ్రహించిన ఈ నేను ఎవరు?  బుద్ధిని కూడా చూస్తున్న ఆత్మను.’’ ఇలా ఆలోచించుకుంటూ పోతే మనసులోంచి గులాబీ మాయమై మనసు-బుద్ధి మీదుగా ‘నేను’ అంటే మార్పులు లేని ఆత్మను అనే విషయం దాకా మన ఆలోచన సాగుతుంది. 


ఇలా ఆలోచనలను నిరంతరం లోపలకు ప్రవహింపజేస్తుంటే మనసు తన స్వరూపమే అయిన ఆత్మలో (చిత్‌లో) నిలిచిపోతుంది. అలా నిలవడమే చిత్వ దర్శనం. అదే తత్వ దర్శనం. మనసు ఆలోచనారహితమైతే మిగిలేది ఆత్మయే. శుద్ధ జ్ఞాన స్వరూపమే. అదే జ్ఞాన నిష్ఠ. ఆత్మ నిష్ఠ. ఇక్కడ దర్శనమంటే అనుభవమే. ప్రత్యక్ష (నేరుగా చూడడం), పరోక్ష (చూసినవారు చెప్పడం) అనుభవం కాదు. అపరోక్షానుభవం (తాను తానుగా ఉండడం. చూసేందుకేమీ లేకపోవడం). ఆత్మ తాను తానుగానే ఉంటుంది. చూసేందుకు దృశ్యం ఉండదు. అదే తత్వ దర్శనం. ఎందుకంటే.. దృశ్యం ఉన్నదీ అంటే దాన్ని చూసి ఆలోచనలు చేసే మనసు ఉంటుంది. దృశ్యమే లేకుంటే ఇక మనసే ఉండదు. అయితే.. దృశ్యం లేకపోవడాన్ని, దృశ్యాన్ని చూసే మనసు కూడా లేకపోవడాన్ని తెలుసుకునే ప్రజ్ఞ (జ్ఞానం) ఉంది. అదే ఆత్మ. అదే నేను. మనసు కదిలింది ఆత్మ నుంచే. విలీనమయ్యేదీ ఆత్మలోనే. కాకపోతే.. కదిలిన మనసు బాహ్యంగా (బయటి ప్రపంచంలోకి) వెళ్తే దుఃఖం. ఆత్మలోనే లీనమైపోతే ఆనందం. బయటకు వెళ్తే చిత్తం. లోపల నిలిస్తే చిత్వం. సమస్య ఎక్కడో.. పరిష్కారమూ అక్కడే! 


- దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-05-26T10:06:00+05:30 IST