దూత హిత వాక్యం

ABN , First Publish Date - 2020-05-25T08:50:34+05:30 IST

‘భారవి’ మహాకవి రచించిన 1030 శ్లోకాల, 18 సర్గల మహాకావ్యం ‘కిరాతార్జునీయం’లోని ప్రథమ సర్గలో కనిపించే శ్లోకమిది. ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు.. దుర్యోధనుడి పరిపాలన గురించి తెలుసుకొని రమ్మని వనేచరుణ్ని

దూత హిత వాక్యం

సకింసఖా సాధు న శాస్తియోధిపం

హితాన్నయస్సంశృణుతే సకిం ప్రభుః

సదానుకూలేషు హి కుర్వతే రతిం

నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః


‘భారవి’ మహాకవి రచించిన 1030 శ్లోకాల, 18 సర్గల మహాకావ్యం ‘కిరాతార్జునీయం’లోని ప్రథమ సర్గలో కనిపించే శ్లోకమిది. ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు.. దుర్యోధనుడి పరిపాలన గురించి తెలుసుకొని రమ్మని వనేచరుణ్ని పంపగా.. అతడు అక్కడికి వెళ్లి, చూసి, తిరిగి వచ్చి దుర్యోధనుడి రాజ్యపాలన విశేషాలను 25 శ్లోకాల్లో చెప్పాడు. అందులో ఒక శ్లోకమిది. రాజు, అతడి ఇష్టసఖుడు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో ఆసక్తికరంగా ఈ శ్లోకం ద్వారా భారవి మహాకవి తెలిపాడు. ‘‘ఓ రాజా, మంచి విషయాలను చెప్పి శాసించగలిగే సఖుడే నిజమైన సఖుడు. అలాగే.. తన యిష్టసఖుడు చెప్పిన మంచి మాటలను వినజాలని ప్రభువు ఒక ప్రభువా? మంత్రిగానీ, మిత్రుడుగానీ అప్రియవాక్యాలను పలికి ప్రభువుకు ఆగ్రహం కలిగించి.. తమకు బాధ కలిగించుకోవడం శ్రేయస్కరం గాదు. ఇది సన్మిత్ర పద్ధతిలో చేరదు. అలాగని.. తన ప్రభువునకు బాధ కలిగిస్తాయనే భావనతో నిజాలను దాచిపెట్టి.. రాజు మనసుకు నచ్చుతాయని అబద్ధాలను చెప్పేవాడు చెడ్డ మిత్రుడే అవుతాడుగానీ మంచి మిత్రుడు కాజాలడు. మిత్రుడు, సఖుడు, రాయబారి తెలిపిన నిజాలను కటువుగా భావించక.. సహృదయంతో గమనించి ప్రవర్తించిన వాడే ప్రభువు. అలా కాకుండా వేరే భావనతో ప్రవర్తించినవాడు ‘కుత్సిత’ ప్రభువే. కాబట్టి ప్రభువులు తన స్నేహితులతో బాగా కలిసిపోయి, పరస్పరానురక్తుడు కావాలి. అప్పుడే అతని సంపదలు నిలుస్తాయి. అలాగే.. అప్రియమైనవైనా సరే మంచిమాటలైతే వాటిని రాజుకు చెప్పవలసిందే! ప్రభువు కూడా ఈ రకమైన హితాహితజ్ఞాన విచక్షణ కలవాడై ఉండాలి’’ అని ఈ శ్లోక భావన.


ఆనాడు భారవి చెప్పిన ఈ వాక్య పద్ధతిని, హిత బోధలను మనవారు పాటించటం వల్లనే ‘‘వాగ్భూషణం భూషణం’ అనేది బాగా వ్యాప్తి చెందింది. ‘‘మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తుర’’ని ప్రసిద్ధమయింది. ఇవి ఆ కాలానికే కాదు.. ఈ కాలానికి కూడా వర్తిస్తాయి. ప్రస్తుత సమాజంలో రాజకీయ పదవుల్లో ఉన్న పెద్దలు, వారి ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు, రహస్య సమాచార విభాగంవారు ఈ విధమైన శ్లోక భావాలనే కాక.. మహాభారతంలో సంజయ, శ్రీకృష్ణ రాయబార సందర్భాల్లోని సమయోచిత సంభాషణ, అక్షర సంపద, పద ప్రయోగాలను కూడా గమనించి ప్రవర్తిస్తే అందరికీ మంచిది. అందుకే భారవి.. ‘నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః’


..అని హితవాక్యం విలువను తెల్పినాడు. ఇంకా సందర్భోచితంగా ఎన్నో విషయాలను రాజనీతికనుగుణంగా వివరిస్తూ ఒక శ్లోకంలో ‘‘ఓ ధర్మరాజా! దుర్యోధనుని కొలువు కూటంలో ఏ సందర్భంలోనైనా మీ ప్రసక్తి వస్తే.. భరించడానికి వీలుకాని సర్ప మంత్రాక్షరాలు పాము పడగను వంచినట్లే దుర్యోధన చక్రవర్తి కూడా ముఖం వాలుస్తున్నాడు మహారాజా’’ అంటాడు. ఆ శ్లోకంలో కవి ప్రవచించిన ‘‘తవాభిధానాత్‌ వ్యథ తే నతాననః సుదుస్సహాన్మంత్రపదాదివోరగః’’ అనే భాగంలోని ‘త’ ‘వ’ అనే అక్షరాలు గారుడ మంత్ర ప్రభావం గలవని ఒక వ్యాఖ్యాత అభిప్రాయం. ఇట్లా మనం అనేక ఉపపత్తులతో హితాహిత వాక్యవిశేషాలను ‘భారవి’ ద్వారా గ్రహించవచ్చు.


- శ్రీరంగాచార్య, 9299451266

Updated Date - 2020-05-25T08:50:34+05:30 IST