మెతుకులోనే బతుకు

ABN , First Publish Date - 2020-03-18T09:48:15+05:30 IST

కృతయుగం అస్థిగతం. త్రేతాయుగం మాంసగతం. ద్వాపరయుగం రక్తగతం. కలియుగం అన్నగతం. ఇదంతా యుగలక్షణం. పరిణామక్రమాన్ని గమనించి నపుడు, కలియుగమే పుణ్యకాలంగా అనిపిస్తుంది. ఉన్నదంతా పరమాత్మేనన్న భావంతో

మెతుకులోనే బతుకు

కృతయుగం అస్థిగతం. త్రేతాయుగం మాంసగతం. ద్వాపరయుగం రక్తగతం. కలియుగం అన్నగతం. ఇదంతా యుగలక్షణం. పరిణామక్రమాన్ని గమనించి నపుడు, కలియుగమే పుణ్యకాలంగా అనిపిస్తుంది. ఉన్నదంతా పరమాత్మేనన్న భావంతో కృతయుగ మానవుడు, తాను ఉన్నంతకాలం తన మూలంతో తనను తాను అనుసంధానం చేసుకుని తపస్సు, ధ్యానం, యోగం వంటి స్వీయసాధనా బలిమితో పూర్ణాయుర్దాయంతో జీవించాడు. త్రేతాయుగంలో సాధకుడు, యజ్ఞయాగాదుల ద్వారా పరమాత్మను చేరుకోగల సాధనా మార్గాన్ని ఆశ్రయించాడు. మాంసగతమైన ఆహారాన్ని ఆలంబన చేసుకున్నాడు. ద్వాపరంలో భీమ ప్రతిజ్ఞ వంటి సందర్భాలు రక్తగత విషయాన్ని స్పష్టం చేస్తుంటయ్‌. కలియుగంలోనూ పై విధానాలున్నా, నాగరకతా ప్రభావంతో జీవుడు అన్నగతుడయ్యాడు. ఈ నేపథ్యంలో, (జిల్లెళ్లమూడి) అమ్మ వద్దకు ఎవరైనా వెళ్లినప్పుడు ఆ అమ్మ నోటి నుండి వెలువడే మొదటి మాట.. ‘‘భోజనం చేసి రా’’ అనే! ఎందుకంటే.. డొక్క నిండనివాడు వేదాంతం వినడు. నైతిక సిద్ధాంతాలు వాడికి అవసరం లేదు. ఆకలి తీర్చుకోవటం, ప్రాణం నిలబెట్టుకోవటం ప్రధానం. ఆ పైనే మిగిలినవన్నీ!


మానవుడికున్నవి పంచకోశాలు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. దేహం నిలబడాలంటే అన్నం కావాలి. ఆ మెతుకులు దయతో, ప్రేమతో, కరుణతో, అన్నింటినీ మించి వాత్సల్యంతో దొరికితే పదార్థ శుద్ధి కలిగి, పరమార్థ చింతన వైపు నడిపిస్తయ్‌. ఏ భావంతో అన్నం తయారైతే, ఆ భావమే ప్రాణం పోసుకుంటుంది. దైహిక, ప్రాణశక్తుల సమన్వయంగా ఏర్పడేవే అన్నమయ, ప్రాణమయ కోశాలు. నడిచే దేహం, అది నడవటానికి కావలసిన శక్తి కూడినపుడు మరొక ప్రశాంత, పరితృప్త, ప్రసన్న కోశం ఏర్పడుతుంది. అదే మనోమయ కోశం. మనసుకు పునాది, మూలం అన్నమయ కోశంలోనే ఉంది. బంధనకీ, మోక్షానికీ మనసే కారణం. కనుక మోక్షగామియైున సాధకుడు, ముందుగా అన్నమయ కోశాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అందువల్లనే అమ్మ ముందుగా అన్నం పెట్టి, ప్రాణం నిలబెట్టి, మనసును అరికట్టే ప్రయత్నం చేసింది. పైకి ఎంతో తేలికగా కనిపిస్తున్నా, ఆ వాత్సల్యం వెనుక ఒక గంభీరమైన ఆధ్యాత్మ బోధ ఉన్నది. కలిగిన వారంతా నలిగిన వారిని ఆదుకోవాలి. ఆకలిగొన్న మానవుడూ, అన్నం దొరకక మరణించే జీవులూ ఉంటే, అది నాగరిక సమాజం కాదు. సంస్కారానికి నోచుకోని జాతి ఎక్కువ కాలం మనలేదు. ఎట్టి మెతుకో, అట్టి భావం; ఎట్టి భావమో, అట్టి భాష; ఎట్టి భాషో, అట్టి జాతి! దేహమున్న, ప్రాణమున్న ప్రతి జీవీ అన్నగతమే. అందుకే అమ్మ మాటాడినా, సూచించినా ముందు అన్నం తినమనే! పంచకోశ స్థితులను ఉపనిషత్తులు వీక్షిస్తే, వర్ణ, వర్గ భేదం లేకుండా అమ్మవాటిని అతిసులువుగా ఆవిష్కరించింది. ‘అమ్మా! నీ యాభయ్యో పుట్టినరోజు, ఏం చెయ్యమంటావ్‌?’ అని అడిగినపుడు, ‘చేయటానికేముంటుంది. ఒక లక్ష మంది కలిసి భోజనం చేయటం చూడాలని ఉంది’ అన్నది. పట్టుమని పదిళ్లు లేని జిల్లెళ్లమూడిలో, పందిళ్లలో ఒక లక్షా అరవై వేల మంది భోజనం చేయటం మహిమా? అనుగ్రహమా? అమ్మ ప్రేమా? ‘‘నేను పెట్టేదేముంది? ఎవరన్నం వాళ్లు తిన్నారు’’ అన్న అమ్మది అకర్తృత్వ స్థితి. బువ్వపెట్టిన అవ్వలందరూ అమ్మలు కారు. ఆ పెట్టటం ఒక సహజ మాతృ లక్షణం కావాలి. అది నేర్పటమే మాతృబోధ! అందువల్లనే ఆమె మాతృశ్రీ!!


- వీఎస్‌ఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-03-18T09:48:15+05:30 IST