హృదయ వైద్యుడు

ABN , First Publish Date - 2022-05-06T05:12:49+05:30 IST

మానవ జీవన శైలి నేడు చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలజడులతో, ఆందోళనలతో, నెరవేరని గొంతెమ్మ కోరికలతో... దిశ తెలియని, గమ్యం లేని వేగంతో పయనిస్తోంది.

హృదయ వైద్యుడు

మానవ జీవన శైలి నేడు చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలజడులతో, ఆందోళనలతో, నెరవేరని గొంతెమ్మ కోరికలతో... దిశ తెలియని, గమ్యం లేని వేగంతో పయనిస్తోంది. దీనికంతటికీ కారణం మానవుల్లో పెరిగిన అనుచితమైన వాంఛలే. ఒక మంచి పని చేయాలనే కోరికలో ప్రశాంతత ఉంటుంది. అలాకాకుండా విలాసాలు, భోగాల కోసం తావత్రయపడితే మనసులో పెను తుపాను రేగుతుంది. దాన్ని ఆపడం సాధ్యం కాదు. లేనిపోని ఊహలతో కోరికలు పెంచుకుంటే మనసులో ఉప్పెనలు తపఁవు. అవీ ఇవీ కావాలనీ, ఎవరినో మెప్పించాలనీ, మనకు అవసరం లేనప్పటికీ లోకం కోసం ప్రదర్శించడానికి ఏవేవో సంపాదించాలనీ ఎప్పుడైతే అనుకుంటామో... అప్పుడు అసంతృప్తి మొదలవుతుంది. న్యాయంగా సాధించలేనప్పుడు తప్పుడు మార్గం ఎంచుకోవాల్సి వస్తుంది. అది కష్టాలవైపు మళ్ళిస్తుంది. ఒకదాని వెంట మరొకటి వెంటాడుతూనే ఉంటుంది. ఇక కోరికల పుట్ట అయిన మనసుకు విశ్రాంతి ఎక్కడ? ప్రశాంతత ఎలా లభిస్తుంది?


‘‘అలసి సొలసిన వారందరూ రండి. నా చెంత సేద తీర్చుకోండి’’ అని ప్రభువు మన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తప్పిపోయిన, ముళ్ళపొదల్లో చిక్కుకుపోయిన, లోయలో పడిపోయిన గొర్రెలను ఎలా రక్షించుకోవాలో, ఏ గాయానికి ఏ మందు వేసి సంరక్షించుకోవాలో  గొర్రెల కాపరికి తెలుసు. అలాగే అలసి సొలసిపోయిన విశ్వాసులకు ఓదార్పు అందించడానికి ప్రభువు సిద్దంగా ఉన్నాడు. మానని మనో రుగ్మతలను నయం చేసే హృదయ వైద్యుడు ఆయన. సంక్లిష్టమైన, భయానకమైన ధోరణులకు భిన్నంగా... అందరినీ అక్కున చేర్చుకొనే శాంత స్వరూపుడు క్రీస్తు. చిన్న వారి దగ్గరనుంచి, పెద్దవాళ్ళవరకూ తాము పొందే బాధలను ప్రభువు చెంత కూర్చొని మనసు విప్పి చెప్పుకోవాలనే చనువు గలది ఆయన ఒడి. అది విశ్వాసులకు చల్లటి ఆశ్రమం. సేదతీర్చి, దారిచూపే గొప్ప ఆశ్రయం. 

                                                                                                       డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు 

                                                                                                                     9866755024

Read more