మధురాధిపతే అఖిలం మధురం

ABN , First Publish Date - 2020-03-05T09:42:19+05:30 IST

భూమ్మీద ఉన్న కోట్లాది పవిత్రమైన వస్తువులన్నింటినీ కలిపినా అవి శ్రీ కృష్ణనామ సంకీర్తనకు సాటిరావని కూర్మపురాణం చెబుతుంది. కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలో అవతరించాడు.

మధురాధిపతే అఖిలం మధురం

వస్తూని కోటి శస్సంతు పావనాని మహీతలే

నతాని తత్తులాం యాంతి కృష్ణ నామానుకీర్తనే

భూమ్మీద ఉన్న కోట్లాది పవిత్రమైన వస్తువులన్నింటినీ కలిపినా అవి శ్రీ కృష్ణనామ సంకీర్తనకు సాటిరావని కూర్మపురాణం చెబుతుంది. కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలో అవతరించాడు. నామం తప్ప కలికాలంలో వేరొక ధర్మం లేదని, నామం సర్వమంత్ర సారమని, ఇదే శాస్త్ర రహస్యమని ‘చైతన్య మహా ప్రభువు’ పలికారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలు మనకు ఉన్నాయి. వీటిలో ప్రాణమయ కోశాభిమానికి నామమే సాధనం. నామం మీద, నామి యందు కలిగిన శ్రద్ధకే ‘భక్తి’ అని పేరు. అదే భక్తి యోగం. ‘శ్రీకృష్ణునకు, ఆయన నామానికి అభేదం. శ్రీకృష్ణుని పేరు పలకడం వల్ల ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమయే శ్రీకృష్ణుని నీ వద్దకు తెస్తుంది’ అని ‘ఉపదేశామృతం’ గ్రంథం చెబుతోంది.

తత్కీర్తన ధ్వనింశ్రుత్వా సర్వాణి పాతకానిచ

దూరాదేవ పలాయంతే వైనతేయ మివోరగాః

గరుత్మంతునిగాంచి పాములు పారిపోయినట్లు.. శ్రీకృష్ణ కీర్తన శబ్దాన్ని వినగానే సమస్త పాపాలూ పారిపోతాయని ‘నారద పాంచరాత్రం’ బోధిస్తోంది. పరమాత్మను సదా స్మరించువానికి సకల పురుషార్థం హస్తగతం అవుతుంది. ‘నరుడిగా పుట్టి భూమిపై చరించిన నారాయణుడే శ్రీ కృష్ణుడు. ఆయనే పురుషోత్తముడు. నరులలో ఉత్తముడు. అట్టి నరోత్తముడైన శ్రీకృష్ణ దేవునికి నమస్కారం. నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషాన్ని హరిస్తుంది’ అని ‘నారసింహ పురాణ వచనం’. ఇంద్రియాలు శాశ్వత ముక్తిప్రదుడైన శ్రీకృష్ణుని వైపు మరలక.. అశుభ ప్రదములు, క్షణికములు అయిన ఇతర విషయాల వైపు మళ్లడం దురదృష్టకరమని ‘ప్రబోధ సుధాకరము’నందు శంకర భగవత్పాదులు తెలిపారు. 

‘అధరం మధురం వదనం మధురం, నయనం మధురం హసితం మధురం, హృదయం మధురం గమనం మధురం, మధురాధి పతే అఖిలం మధురం’ అని ఆ వల్లభాచార్యులు తన ‘మధురాష్టకమ్‌’లో శ్రీకృష్ణుని కీర్తించారు. కృష్ణుడంతా తియ్యదనమేనని కొనియాడారు. ‘అన్నిటికిది పరమౌషధము, వెన్నునినామమే విమలౌషధమ’ని.. శ్రీకృష్ణ నామామృత పానమే భవరోగమును రూపు మాపే దివ్యౌషధమని అన్నమాచార్యులు తన కీర్తనలో గానం చేశారు. సాధనలన్నింటిలోనూ నామసంకీర్తన అతి సులభమైనది. దాని వలన జన్మాంతర పాపాలు దహింపబడతాయి. కలియుగంలో ఎందరో భక్తులు నామ సంకీర్తనంతో తరించారు.

- మేఘశ్యామ (ఈమని) 8332931376

Updated Date - 2020-03-05T09:42:19+05:30 IST