మనో నిర్మలతతోనే శాంతి

ABN , First Publish Date - 2022-07-22T08:13:52+05:30 IST

వెన్నెలను ప్రేమ, విరహం, మోహాలకు చిహ్నంగా ప్రబంధాలు వర్ణించాయి. కానీ వెన్నెలను ధర్మజ్యోత్న్సగా భావించిన సంఘటన ఇది.

మనో నిర్మలతతోనే శాంతి

వెన్నెలను ప్రేమ, విరహం, మోహాలకు చిహ్నంగా ప్రబంధాలు వర్ణించాయి. కానీ వెన్నెలను ధర్మజ్యోత్న్సగా భావించిన సంఘటన ఇది. 


మగధరాజు అజాతశత్రు చాలా చికాకుల్లో ఉన్నాడు. మంత్రులతో తన భవనంపైన సమావేశమయ్యాడు. వారితోపాటు... రాజు ఎంతో అభిమానించే ఆస్థాన వైద్యుడు జీవకుడు కూడా ఉన్నాడు. వారు అక్కడ చాలాసేపటి నుంచి చర్చించుకుంటూనే ఉన్నారు. కానీ సమాధానం దొరకలేదు. పొద్దెక్కింది. వెండిలాంటి పున్నమి వెన్నెల పరుచుకుంది. చల్లని గాలి వీస్తోంది. అజాతశత్రు దీర్ఘంగా నిట్టూర్చాడు.


ఒక మంత్రి ‘‘రాజా! మీరు ఈ రోజు అలసిపోయారు. ఏ రాణిగారినో, మీ ఇష్టసఖినో వెంట తీసుకొని... వెన్నెల విహారం చేయండి. మాకు సెలవిప్పించండి’’ అన్నాడు.


రాజు లేచాడు. గంభీరంగా చేతులు వెనుకకు కట్టుకొని నిలబడ్డాడు. ‘‘జీవకా! ఈ వెన్నెల ఎంత ప్రకాశంగా ఉందో చూడు. ఈ చల్లని గాలి ఎంత పరిమళాన్ని మోసుకొస్తోందో... ఇలాంటి ప్రశాంతమైన సమయంలో నాకు ఒక కోరిక పుట్టింది’’ అన్నాడు.


‘‘సెలవియ్యండి మహారాజా!’’ అన్నాడు జీవకుడు. 

‘‘ఇప్పుడు నాకు ధర్మ ప్రబోధం వినాలని ఉంది. ఈ వెన్నెలలో ధర్మవిహారిని కావాలనుకుంటున్నాను’’ అన్నాడు.


ఆయన అలా అన్నదే తడవుగా మంత్రులందరూ తమకు ఇష్టమైన తాత్వ్తిక గురువుల పేర్లు చెప్పి, ‘‘మహారాజా! ఇప్పుడే వారిని తమ వద్దకు పిలిపించమంటారా?’’ అని అడిగారు. 

‘‘జీవకా! మరి నీవు ఎవరి పేరూ చెప్పలేదేం?’’ అని అడిగాడు రాజు.


‘‘రాజా! బుద్ధుని బోధ మాత్రమే ఈ వెన్నెల కన్నా, ఈ మలయమారుతం కన్నా మీకు హాయిని ఇవ్వగలదు. స్వస్థత పరచగలదు’’ అన్నాడు జీవకుడు.

‘‘సరే! మాకూ అదే సమ్మతం.’’

‘‘రాజా! వారు ఇప్పుడు నా మామిడి తోటలోనే ఉన్నారు.’’

‘‘సరే! అందరూ అక్కడికే పదండి’’ అన్నాడు అజాతశత్రు.

వెంటనే రథాలు సిద్ధమయ్యాయి. జీవకుడి మామిడి తోటవైపు బయలుదేరాయి. వారందరూ తోట బయట రథాలు దిగి, నడక ప్రారంభించారు.

ఎక్కడా చీమ చిటుక్కుమన్న శబ్దమైనా లేదు. మనుషుల అలికిడే లేదు. ‘ఎందరో ఉంటే ఈ పాటికి కొద్దిపాటి మాటలైనా వినిపించకుండా ఉంటాయా? ఇందులో ఏదైనా మంత్రాంగం ఉందా? ఏదైనా పన్నాగం ఉందా?’ అనుకుంటూనే... కత్తి పిడి మీద చెయ్యి వేసి, ముందుకు నడిచాడు అజాతశత్రు.


అంతలో... కొద్ది దూరం నుంచి మృదుమధురమైన స్వరం ఒకటి వినిపించింది. అజాతశత్రు నెమ్మదిగా కత్తి పిడి మీద నుంచి చెయ్యి తీశాడు. రెండు చేతులూ గౌరవసూచకంగా కట్టుకున్నాడు. 


తోట మధ్యభాగంలోని విశాలమైన ప్రదేశంలో... ఒక చిన్న వేదిక మీద బుద్ధుడు కూర్చొని, ధర్మోపదేశం చేస్తున్నాడు. భిక్షువులు, ఉపాసకులు కిక్కిరిసి పోయి కూర్చొని ఉన్నారు. శ్రద్ధగా, ఏకాగ్రతతో వింటున్నారు. 


ఆ నిశ్శబ్దాన్ని పాడు చెయ్యాలని అజాతశత్రు కూడా అనుకోలేదు. ఆ ధర్మామృతధారలో తనుకూడా తడిసిపోవాలనుకున్నాడు. శబ్దం చెయ్యకుండా, ఒక చెట్టు నీడ చాటుకు పోయి, సభికుల వెనుకనే కూర్చున్నాడు. మిగిలినవారూ రాజు వెనుకే ఆసీనులయ్యారు. 

‘‘ఉపాసకులారా! మనలో కోరికలు చెలరేగినప్పుడు... మనస్సు అల్లకల్లోలమవుతుంది. అది బురదనీటి గుంటలా మారిపోతుంది. బురద నీటి చెరువు దగ్గరకు వెళ్ళి, దానిలోకి చూస్తే మనకు ఏం కనిపిస్తుంది? దానిలో మొసళ్ళు ఉన్నాయా, కత్తి చేపలు ఉన్నాయా, లోతైన గోతులు ఉన్నాయా, ముళ్ళు, తీగెలు అల్లుకుపోయి ఉన్నాయా? అనేది తెలుస్తుందా? అదే నిశ్చలమైన, నిర్మలమైన నీటిలో అన్నీ కనిపిస్తాయి. మనం జాగ్రత్త పడతాం. ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. అల్లకల్లోలమైన చిత్తం మనల్ని సత్యాన్ని దర్శించకుండా చేస్తుంది. మనలోకి మనం చూసుకోకుండా, మనల్ని మనం సంస్కరించుకోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి దోషాలు, అకుశల భావనలు లేకుండా మన చిత్తాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. అదే మనకు ఎంతో శాంతిని ఇస్తుంది’’ అంటూ బుద్ధుడు తన ధర్మ ప్రబోధాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు. 

బుద్ధుని గంభీరమైన, మృదుమధురమైన వాక్కులు అజాతశత్రు హృదయాన్ని తాకాయి. మనస్సులోంచి ఒక్కొక్క చెడు భావాన్నీ బయటకు నెట్టేశాయి. ఆ వెన్నెల రేయిలో... అతడు ఎంతో హాయిని పొందాడు. మనోభారం దిగిపోయి, తేలికపడ్డాడు. ధర్మతన్మయత్వంలో తేలిపోయాడు. అలా ఆ రాత్రి... చల్లని వెన్నెలలో సద్ధమ్మవిహారం చేశాడు.


-బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-07-22T08:13:52+05:30 IST