రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు

ABN , First Publish Date - 2022-07-22T08:04:28+05:30 IST

సమాజాన్ని ధారణం చేసేదే ధర్మం. అందరూ సుఖంగా ఉండాలనేదే దాని లక్ష్యం. ‘ధారణాది ధర్మ ఉద్యతే’ అని మన పూర్వీకులు చెప్పారు.

రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు

సనాతన ధర్మానికి సరైన నిర్వచనం ఏమిటి?


సమాజాన్ని ధారణం చేసేదే ధర్మం. అందరూ సుఖంగా ఉండాలనేదే దాని లక్ష్యం. ‘ధారణాది ధర్మ ఉద్యతే’ అని మన పూర్వీకులు చెప్పారు. సమాజాన్ని ఏది ధారణం చేస్తుందో అదే ధర్మం. దీన్ని పాటించటానికి మనందరం ప్రయత్నం చేయాలి. అయితే మనం సుఖంగా ఉండటం కోసం పొరుగువారికి నష్టం చేయకూడదు. అలాంటి నియమంతో నడిచేదే ధర్మ మార్గం. దీనికి విరుద్ధంగా ప్రవర్తించటమే అధర్మం. ఉదాహరణకు... ఒకరు అధర్మంగా ప్రవర్తించారనుకుందాం. అప్పుడు ఇతరులకు నష్టం కలుగుతుంది. వారు తమకు నష్టం కలిగిందని ఇతరులకు నష్టం చేయటానికి ప్రయత్నించవచ్చు. దీని వల్ల అశాంతి పెరిగిపోతుంది. ఇలా కాకుండా అందరూ ధర్మాన్ని పాటించినప్పుడే ఈ సమాజం ధర్మమార్గంలో ప్రయాణిస్తుంది. ధర్మరాజ్యాన్ని ఏర్పాటుచేయటానికి వీలవుతుంది. ధర్మమార్గం జీవనవిధానం కావడమే... సనాతన ధర్మం. 


ఆధునిక జీవనంలో దీన్ని అనుసరించటం ఎలా?

వాస్తవానికి ఇది చాలా సులభం. ‘ప్రయత్నపూర్వకంగా ఎవరినీ కష్టపెట్టకూడదు.. హింసించకూడదు’- అనే విధానాన్ని అనుసరిస్తే చాలు. అదే సనాతన ధర్మం. దాన్ని అనుసరించకపోవటం వల్లే మనకు ఇన్ని రకాల సమస్యలు వస్తాయి.  శ్రీమద్‌భాగవతంలో శ్రీకృష్ణుడు- ‘‘నేను కేవలం గుడి లోపల మాత్రమే లేను, అన్ని జీవుల లోపల ఉన్నాను’’  అని చెప్పాడు. అంటే అందరిలోను దేవుడు ఉన్నట్లే కదా! మనం దేవుడికి ద్రోహం చేస్తామా? కష్టం కలిగిస్తామా? అంటే సాటి మనిషికి ద్రోహం చేయవద్దని సాక్షాత్తు భగవంతుడే చెబుతున్నాడు. ఈ ధర్మాన్ని పాటించడమే దేవుడికి మనం చేసే నిజమైన పూజ! అందరినీ కష్టపెడుతూ.. ద్రోహం చేస్తూ.. గుడికి వెళ్లి పూజలు చేస్తే - అది నిజమైన పూజ కాదు. 


ఎన్నో ఒత్తిడులకు గురవుతున్న ఆధునిక సమాజంలో భగవద్గీతకు స్థానం ఎలాంటిది?

‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు. దీనిలోని అంతరార్థాన్ని వివరించేదే భగవద్గీత. మనకు భిన్న తత్త్వాలు, జీవన విధానాలు ఉన్నాయి. మనం అందరం సమాజ హితం కోసం ఎలాంటి మార్గాన్ని పాటించాలనేదే భగవద్గీత అంతఃసూత్రం. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని అరకొరగా అర్థం చేసుకొని వ్యాఖ్యానాలు రాస్తున్నారు. తమకు నచ్చిన రీతిలో అన్వయించుకుంటున్నారు. 


భక్తి... జ్ఞానం... ఈ మార్గాల్లో ఏది ఉత్తమం?

ఈ రెండూ ఉత్తమమైనవే! అయితే రెండిటినీ జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. భక్తి అంటే బయటకు చేసే ప్రదర్శన కాదు. భగవంతుడిపై ఉన్న నిజమైన ప్రేమే భక్తిమార్గం. దండాలు పెట్టడం.. ప్రదక్షిణలు చేయటం.. హారతులు ఇవ్వటం - మనకున్న ప్రేమను ప్రదర్శించే మార్గాలు. కానీ కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమే ఉండి.. మనసులో భగవంతుడిపై ప్రేమ లేకపోతే ప్రయోజనం ఉండదు. జ్ఞానమార్గం కూడా ప్రేమతో కూడినదే! దీనిలో భగవంతుణ్ణి అర్ధం చేసుకోవటం ముఖ్యం. ఈ మార్గంలో భక్తికన్నా గౌరవం ఎక్కువ పాళ్లు ఉంటుంది. విమర్శ కూడా ఉంటుంది. కానీ అది సద్విమర్శ అయిఉండాలి. 


మతం.. ఆధ్యాత్మికత- ఈ రెండింటి మధ్య ఎలాంటి విభజన ఉంది...

మతం మనం అనుసరించాల్సిన విధివిధానాలు చెబుతుంది. ‘సమాజహితం కోసం ఏమి చేయాలి? ఏమి చేయకూడద’నే విషయాలను వివరిస్తుంది. మతానికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు... ఇవన్నీ ప్రమాణాలు. ఇక ‘మనిషి జీవితానికి ఉన్న అత్యుత్తమ లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా చేరుకోవాలి? దానికున్న మార్గాలేమిటి?’ అనే విషయాన్ని చెప్పేది ఆధ్యాత్మికత. ఈ రెండింటి మధ్య స్పష్టమైన విభజన ఉంది. ఆధ్యాత్మికకు మతం కొన్ని మార్గాలు చూపిస్తుంది. కానీ మతమే ఆధ్యాత్మికత కాదు. దీన్ని సులభంగా చెప్పుకుందాం. ఒక కంపెనీ ఉందనుకుందాం. అందులో పనిచేసేవారందరూ కొన్ని నియమాలు, విధివిధానాలు పాటించాలి. ఇదే మతం. అయితే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తమకున్న నైపుణ్యాల ఆధారంగా చేసే కృషే ఆధ్యాత్మికత. 


హిందూ మతంలో సంస్కరణలు లేవనే విమర్శలు ఉన్నాయి కదా.. మీ అభిప్రాయమేమిటి?

ఇవి కేవలం విమర్శలు మాత్రమే! కాలం అనేక మార్పులు తెస్తుంది. సనాతన ధర్మానికి హాని కలగకుండా మార్పులు చేసుకోవటంలో తప్పేమీ లేదు. వాస్తవానికి హిందూ మతంలో ఉన్నంత స్వేచ్ఛ మరే మతంలోనూ లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే- హిందూ మతంలో వచ్చినన్ని సంస్కరణలు మరే మతంలోనూ  రాలేదు. హిందూ మతంలో అనేక ఆరాధనా మార్గాలు ఉన్నాయి. తమకు నచ్చిన మార్గాలను అనుసరించే స్వేచ్ఛ ఉంది. ఇతర మతాల్లో అలాంటి అవకాశమే లేదు. 


మీరు రామజన్మభూమి ట్రస్ట్‌ సభ్యులు కదా.. ఆలయ నిర్మాణ పురోగతి ఎలా ఉంది?

రామాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తవుతుంది. అయితే రామాలయం అనేది ఒక కట్టడం మాత్రమే కాకూడదు. రామరాజ్య స్థాపనకు ఆలంబన కావాలి. ఆలయ నిర్మాణంతో మాత్రమే పని  పూర్తికాదు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత చేయాల్సిన పనులకు సంబంధించి- మేము కొన్ని ప్రణాళికలు తయారుచేశాం. వీటిని ట్రస్టు ముందు ఉంచాం. వీటిని ట్రస్ట్‌ ఆమోదిస్తుందనే విశ్వాసం మాకు ఉంది. మేము రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా... గ్రామాన్ని ఒక యూనిట్‌గా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ప్రతి వ్యక్తి తమ శక్తికి తగినట్లుగా ఒక మంచి పనిచేసి రాముడికి అర్పించాలి. అది ఎలాంటి సాయమైనా కావచ్చు. ఉదాహరణకు నలుగురైదుగురు కలిసి ఐదు లక్షలతో ఒక ఇంటిని కట్టించి ఇచ్చారనుకోండి... కొందరు పేద విద్యార్థులకు సాయం చేశారనుకోండి... అంతకన్నా రాముడికి మనం చేసే పూజ ఏముంటుంది? అందరూ ఇలా తమ శక్తి మేరకు సాయం చేయటం మొదలుపెడితే రామరాజ్యం రావటం పెద్ద కష్టం కాదు. 


పూర్వకాలం ప్రతి గ్రామంలో ‘గోచర భూమి’ అని ఉండేది. గ్రామంలో ఉన్న గోవులకు గడ్డి ఈ భూమినుంచే వచ్చేది. మళ్లీ అలాంటి వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ ఏర్పడితే గోవులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతే కాదు... గోవులను రక్షించటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో... పట్టణంలో... నగరంలో... కూరగాయల మార్కెట్లు ఉంటాయి. వాటిలో మిగిలిపోయిన వాటిని చెత్తలో పడేస్తారు. అలాంటి వాటిని ఆవులకు పెట్టవచ్చు కదా... ఇదే విధంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో రకరకాల ఆహార పదార్థాలు వృథా అవుతూ ఉంటాయి. వాటిని కూడా గోవులకు పెట్టవచ్చు. ఇలా గోవులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. 


ప్రతి వ్యక్తి తమ ధర్మాన్ని పాటించాలనీ... 

ధర్మపాలనలో ఎక్కడైనా ఆటంకం ఏర్పడితే- దానికి కారణమైన వారిని రాజు శిక్షించాలని హిందూ ధర్మం చెబుతుంది. మనది 

ప్రజాస్వామ్యదేశం. రాజులు ఉండరు. 

రాజ్యాంగమే మనకు సర్వోత్తమం. మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. ఎవరైనా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే- వారిని చట్టాలు శిక్షిస్తాయి. నా ఉద్దేశంలో హిందూ మతానికి చెందినవారు ఎప్పుడూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరు. ఇతరులు అలా ప్రవర్తిస్తే వారిని శిక్షించాల్సిన బాధ్యత 

పాలకులపై ఉంది. 

Updated Date - 2022-07-22T08:04:28+05:30 IST