వ్యక్తావ్యక్తాలు

ABN , First Publish Date - 2022-07-22T08:01:30+05:30 IST

‘‘ఆత్మ అవ్యక్తమైనది, అది ఊహాతీతమైనది, మార్చడం సాధ్యం కానిది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించినట్టైతే, భౌతిక శరీరం గురించి విచారించాల్సిన అవసరం ఉండదు’’....

వ్యక్తావ్యక్తాలు

‘‘ఆత్మ అవ్యక్తమైనది, అది ఊహాతీతమైనది, మార్చడం సాధ్యం కానిది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించినట్టైతే, భౌతిక శరీరం గురించి విచారించాల్సిన అవసరం ఉండదు’’ అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించాడు. ‘‘పుట్టడానికి ముందు జీవులన్నీ అవ్యక్తమైనవే. అవి పుట్టుకకూ, మరణానికీ మధ్య వ్యక్తమవుతాయి. మరణించాక, మరోసారి అవ్యక్తమవుతాయి’’ అని కూడా బోధించాడు.


ఈ విషయాన్ని వివరించడం కోసం అనేక సంస్కృతుల్లో సముద్రం, కెరటం ఉపమానాన్ని చెబుతారు. సముద్రం అవ్యక్తాన్నీ, కెరటాలను వ్యక్తాన్నీ సూచిస్తాయి. సముద్రంలో కెరటాలు కొంత సేపు ఎగసిపడతాయి, అవి భిన్నమైన పరిమాణాలతో, ఆకారాలతో, తీవ్రతలతో కనిపిస్తాయి. కెరటాల్లా వ్యక్తమైన లేదా కనిపించే వాటిని మాత్రమే మన ఇంద్రియాలు చూడగలవు. చివరికి కెరటాలు ఏ సముద్రంలో పుట్టాయో దాన్లోనే కలిసిపోతాయి. 


అదే విధంగా, ఒక విత్తనానికి చెట్టుగా మారే సామర్థ్యం ఉంటుంది. ఆ విత్తనంలో, చెట్టు అవ్యక్తమైన రూపంలో ఉంటుంది. చెట్టుగా మారడం మొదలయ్యాక... అది వ్యక్తమవుతుంది. అంతిమంగా, అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసిన తరువాత చనిపోతుంది. ఇంద్రియాలకు గ్రహించగలిగే సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. మన ఇంద్రియాల సామర్థ్యాలను పెంచే శాస్త్రీయమైన పరికరాలు కూడా ఉన్నాయి. మైక్రోస్కోప్‌/ టైలీస్కోప్‌ మన కళ్ళ సామర్థ్యాన్ని పెంచగలవు. ఎక్స్‌రే యంత్రం...  కాంతి తాలూకు భిన్నమైన పౌనఃపున్యాల్లో వస్తువులను చూసేలా చెయ్యగలదు. 


‘‘అవ్యక్తమయినది... అనూహ్యం’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే, మన ఇంద్రియాలు దాన్ని అర్థం చేసుకోడానికి శాస్త్రీయమైన పరికరాలు కూడా తోడ్పడవు. మనస్సనేది ఇంద్రియాల సమ్మేళనం కాబట్టి... మనసుకు కూడా అవ్యక్తమైనదాన్ని ఊహించే సామర్థ్యం లేదు.  మన అందరిలా, అర్జునుడు కూడా మానవ శరీరంతో తననుతాను గుర్తించుకున్నాడు. దానికి అతీతమైన అవగాహన కానీ, అనుభవం కానీ అతడికి లేవు. అవ్యక్తమైనవాటి గురించి జ్ఞానోదయం కలిగించడం ద్వారా అర్జునుడి ఆలోచనల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. అర్జునుడి లాంటి పండితుడికి అది అర్థం అయ్యేలా చెప్పడానికి సాక్షాత్తూ భగవంతుడు అవసరమయ్యాడు. కాబట్టి మనం దానికి మినహాయింపు కాదు.

-కె.శివప్రసాద్‌. ఐఎఎస్‌

Updated Date - 2022-07-22T08:01:30+05:30 IST