పాలనా నియమం

ABN , First Publish Date - 2022-07-15T09:30:02+05:30 IST

చాలా కాలం క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజుకు మంచి పాలకుడిగా పేరుంది.

పాలనా నియమం

చాలా కాలం క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజుకు మంచి పాలకుడిగా పేరుంది. ఆయన పాలనలో రాజ్యం పచ్చదనంతో కళకళలాడేది. అలాంటి రాజ్యంలో ఒకసారి పంటలన్నీ ఎండిపోయాయి. చెరువులు, కుంటల్లో నీటి చుక్కయినా లేదు. పశువులకు గడ్డి దొరకడం కష్టమైపోయింది. చాలామంది తమ పశువులను చౌక ధరలకే అమ్మడం ప్రారంభించారు. తినడానికి తిండి గింజలు కరువైపోయాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ శ్రీమంతులు తమ దగ్గర ఉన్న ఆహారాన్నీ, డబ్బునూ, ధాన్యాన్నీ బైటికి తియ్యడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. 


ఈ పరిస్థితుల్లో... రాజు తన ధాన్యాగారాన్ని తెరిపించాడు. ప్రజలకు ధాన్యం పంచడం మొదలెట్టాడు. ధాన్యాగారం ఖాళీ అయింది. చివరకు వేరే రాజ్యాల నుంచి ధాన్యం అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా వేరే రాజ్యాల మీద ఎంతకాలం ఆధారపడాలనే బెంగ రాజుకు పట్టుకుంది. చివరకు అతనికి ఒక ఆలోచన కలిగింది.. వెంటనే పొరుగు రాజ్యానికి వెళ్ళి... అక్కడి రాజును కలవాలనుకున్నాడు. ఎందుకంటే... పక్క రాజ్యం పచ్చగా ఉంది. జనమంతా సుఖసంతోషాలతో బతుకుతున్నారు. ఆ రాజ్యానికి తాను వస్తున్నట్టు సేవకులతో సందేశం పంపాడు. ‘‘మిత్రులకు సాదర నమస్సులు. మా రాజ్యంలో కరువు మూలంగా ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పశువులకు గడ్డి, నీరు లేక మరణిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మీ నుంచి సలహా తీసుకోవడానికీ, మీ పాలనా నియమాల గురింతి తెలుసుకోవడానికీ... నేను, మా మంత్రి మండలి రావాలనుకుంటున్నాం. మా ఈ విన్నపాన్ని మీరు మన్నిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ లేఖ రాశాడు.


పొరుగు రాజు ఆహ్వానం మేరకు వెళ్ళిన ఈ రాజ్యం వారికి... అక్కడ గొప్ప స్వాగతం లభించింది. ఆ రాజ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. నలువైపులా జలాశయాలు నిండి ఉన్నాయి. నదుల్లో అంచువరకూ నీరుంది. కాలువలు ప్రవహిస్తున్నాయి. చల్లని గాలులు పులకింపజేస్తున్నాయి. పొలాలనిండా పచ్చదనం... తోటల నిండా పండ్లు, పూలు... 


ఇవన్నీ చూసి, పొరుగురాజుతో ‘‘మిత్రమా! మీ రాజ్యం స్వర్గంలా ఉంది. నాకు తెలియని ఏవో పాలనా నియమాలను మీరు అమలుచేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అందుకే మీ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. నేను కూడా నా ప్రజల సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. కాబట్టి, దయచేసి నాకు సుపరిపాలన గురించి హితోపదేశం చేయండి’’ అని కోరాడు, అతిథిగా వచ్చిన రాజు.


దానికి పొరుగురాజు జవాబిస్తూ ‘‘నేను అల్లాహ్‌ చూపిన దారినీ, అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ చూపిన మార్గాన్నీ అనుసరించి పరిపాలన సాగిస్తున్నాను. అందుకే అల్లాహ్‌ అన్నివిధాలుగా నాకు సహాయపడుతున్నాడు. ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే సరిదిద్దుకొని, నీతివంతమైన పాలన అందిస్తున్నాను. అల్లా్‌హను ప్రతిరోజూ క్షమాపణ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని ప్రార్థన చేస్తాను’’ అన్నాడు.

రాజుకు అన్ని విషయాలూ అర్థమయ్యాయి. ‘నేను నా జీవితంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాను. దేవుని ఆదేశాలను వదిలి, నా ఇష్టానుసారం పాలన సాగిస్తున్నాను. అందుకే నా రాజ్యంవైపు నుంచి అల్లాహ్‌ ముఖం తిప్పుకున్నాడు’ అనుకున్నాడు. 


తన రాజ్యానికి వెళ్ళాక... అల్లా్‌హను క్షమాపణ కోరుకుంటూ, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థనలు చేయసాగాడు. అతని వైఖరిలో వచ్చిన మార్పును చూసి... అల్లాహ్‌ అతని తప్పులను క్షమించాడు. కొద్దిరోజుల్లోనే అతని రాజ్యం సుభిక్షమయింది. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-07-15T09:30:02+05:30 IST