బాధ్యులం మనమే!

ABN , First Publish Date - 2022-07-15T09:31:40+05:30 IST

భగవంతుడు మన జీవితాల్లో సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఇచ్చాడు. దుఃఖాన్ని మనం ప్రత్యేకంగా సృష్టించుకోనక్కర్లేదు. సుఖంగా లేనప్పుడు...

బాధ్యులం మనమే!

భగవంతుడు మన జీవితాల్లో సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఇచ్చాడు. దుఃఖాన్ని మనం ప్రత్యేకంగా సృష్టించుకోనక్కర్లేదు. సుఖంగా లేనప్పుడు... ఉండేదంతా దుఃఖమే. చీకటిని భగవంతుడు సృష్టించాడని కొందరు అనుకుంటారు కానీ, ఆయన సృష్టించినది వెలుగును. వెలుగులేని చోట ఉండేదంతా చీకటే. అలాగే అజ్ఞానం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. జ్ఞానం లోపిస్తే ఉండేదే అజ్ఞానం. మన జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోందా? దుఃఖం తాండవిస్తోందా? అనేది మనమే స్వయంగా గమనించుకోవాలి. అలాగే మరో విషయం కూడా అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో కలిగే సుఖదుఃఖాలన్నిటికీ బాధ్యులం మనమే తప్ప భగవంతుడు కాదని. 


ఇదంతా ‘కర్మఫలం’ అని కొందరి అభిప్రాయం. అదే నిజమైతే అందరూ త్వరత్వరగా మంచి పనులు చేసెయ్యవచ్చు కదా! ఇంతకూ మంచి కర్మ అంటే ఏమిటి? కొందరు ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతున్నప్పుడు ‘‘ఓ భగవంతుడా! నీకు శతకోటి ధన్యవాదాలు’’ అంటూ ప్రశాంతంగా ప్రాణాలు విడుస్తారు. మరి కొందరు ‘‘అయ్యో! అది మిగిలిపోయింది. అది కూడా చేయాల్సింది’’ అనే ఆవేదనతో మరణిస్తారు. ఎవరైతే అన్నీ మరచిపోయి... గుడ్డిగా అజ్ఞానాన్ని ఆశ్రయిస్తారో... వారికి మిగిలేదంతా దుఃఖమే. అది ఎప్పుడో కాదు... ఇప్పుడూ మనం అనుభవిస్తున్నాం. మనిషి తాను సుఖంగా ఉన్న భ్రమలో ఉంటూనే దుఃఖంతో విలపిస్తూ ఉంటాడు. మీకు కూడా అలా ఎన్నోసార్లు అనిపించి ఉండవచ్చు. సుఖంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ లోలోపల ఏదో బాధగా ఉంటుంది. 


మనలో సాగే శ్వాస గొప్పతనాన్ని మనం గుర్తించడం లేదు. శ్వాస వల్లే మనం ఈనాడు జీవించి ఉన్నాం. మనం పుట్టిన తరువాత శ్వాస ఆడుతోంది కాబట్టే మనకు అప్పట్లో నామకరణం చేశారు. ఇప్పటివరకూ మన జీవితాల్లో ఏం చేసినా... దానంతటికీ కారణం మనలో శ్వాస నడుస్తూ ఉండడమే. ఈ శ్వాస ఇలా ఆడుతున్నంతకాలం మన జీవితాల్లో ఏదైనా చేసే అవకాశం మన ముందు ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం తరచూ వార్తల్లో చదివే అత్యాచారాలకూ, హత్యలకూ, హింసకూ కారణం... దురాశ, అతి లోభం. వాటి గురించి ఎవరూ పెద్దగా చర్చించడం కానీ, పరిష్కారాలు కనుక్కోవడం కానీ జరగడం లేదు. కానీ అన్నిటికీ కారణం అదే. అన్నిటినీ మరచిపోయి, అజ్ఞానం వెంట పరుగులు తీస్తున్నవారు... చివరి గమ్యానికి చేరుకొని... విజేతగా నిలవాలని అనుకుంటున్నారు. కానీ అది జరగడం ముమ్మాటికీ అసాధ్యం. కాబట్టి మీలో ఉన్న అనంత శక్తిని గుర్తించండి. దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఉపయోగించి... మీ జీవితాలను సార్థకం చేసుకోవడం ప్రధానమని గుర్తించండి. అప్పుడు దుఃఖం, చీకటి, అజ్ఞానం... స్థానంలో సుఖం, వెలుగు, జ్ఞానం నిండుతాయి. జీవితం పరిపూర్ణమవుతుంది.


-ప్రేమ్‌ రావత్‌

 9246275220 

Updated Date - 2022-07-15T09:31:40+05:30 IST