మహా ఆయుధం

ABN , First Publish Date - 2022-07-15T09:33:50+05:30 IST

క్రైస్తవుడిగా నిజమైన జీవితానుభూతిని పొందాలంటే... ఇతరులపట్ల ప్రేమగా వ్యవహరించాలనీ, చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది, వాటిని మళ్ళీ చేయకుండా ప్రవర్తనను సవరించుకోవాలనీ,....

మహా ఆయుధం

క్రైస్తవుడిగా నిజమైన జీవితానుభూతిని పొందాలంటే... ఇతరులపట్ల ప్రేమగా వ్యవహరించాలనీ, చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది, వాటిని మళ్ళీ చేయకుండా ప్రవర్తనను సవరించుకోవాలనీ, అలాగే ఇతరుల తప్పిదాలను మన్నించాలనీ, త్యాగపూరితమైన జీవితం గడపాలనీ, దేవుని పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంచాలనీ ఏసు ప్రభువు బోధించాడు. ఆయన నేర్పించిన అంశాలలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. అది పదిమందితో కూర్చొని చేసే ఆరాధనా కార్యక్రమాలకు భిన్నమైనది. 


భాషాపరంగా చూస్తే... ‘ప్ర+ అర్థన’ అంటే శ్రద్ధగా అడగడం. సాక్షాత్తూ దేవుని ఎదుట మోకరిల్లి, మనసు విప్పి, సమస్యలు చెప్పుకోవడం. సాయపడాలని వేడుకోవడం. ఒక రకంగా ఇది దాపరికం లేని హృదయ భాషణం. దీనికోసం పెద్దపెద్దగా అరవాల్సిన పని లేదు. మౌన భాషను కూడా ప్రభువు బాగా ఆలకిస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి ముఖం మంచు కడిగిన ముత్యంలా ప్రకాశించాలి. ప్రభువు ప్రజలకు ఇచ్చిన ఆధ్యాత్మిక మహా ఆయుధం... ప్రార్థన. 


ప్రార్థన ఎలా చేయాలో ఏసు ప్రభువు నేర్పించడమే కాదు, ఏకాంతంగా కొండల మీదనో, వనాల్లోనో, మోకరిల్లి... దేవునితో మాట్లాడేవాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు. దైవ శక్తి నిరూపణ కోసం ఎన్ని అద్భుతాలు చేసినా... మానవుని శ్రమలు ఆయనకు కూడా వర్తిస్తాయి. అందుకే మరణ ఘడియల్లోనూ ప్రార్థించాడు. ‘అడగనిదీ అమ్మైనా పెట్టద’ని సామెత. ‘‘మీరు అడగండి. మీకు లభిస్తుంది’’ అని ప్రభువే చెప్పాడు. అడిగిన దాన్ని ఎప్పుడు, ఎలా ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ఆయన మన అంతరంగాలను గుర్తించలేనివాడు కాదు. ‘అడిగే విధానంలోనే ఇస్తాడనే ఆశ కూడా చిగురిస్తుంది’ అనే రహస్యం మనకు తెలిస్తే చాలు. 


నిజానికి ప్రార్థన చేయడానికి మహా గ్రంథాలేవీ చదనవసరం లేదు. తన అంతరంగాన్ని ఆవిష్కరించి, నివేదించుకోగలిగే స్వచ్ఛమైన హృదయం ఉంటే చాలు. నిరక్షరాస్యులు సైతం... తమ సమస్యలు దేవుడు పరిష్కరించగలడనే విశ్వాసంతో... నిర్మలమైన మనసుతో ప్రార్థించడం మనం చూస్తూనే ఉంటాం. ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయడం అత్యుత్తమమైన కార్యం. ఏ పనినైనా ప్రార్థనతో మొదలుపెడితే దైవ కృప మన వెంటే ఉంటుంది. 


-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024  

Updated Date - 2022-07-15T09:33:50+05:30 IST