కర్మయోగం

ABN , First Publish Date - 2022-07-15T09:25:38+05:30 IST

చిన్న చిన్న ప్రయత్నాలే కర్మయోగంలో మంచి ఫలితాలను ఇస్తాయనీ, గొప్ప భయాల నుంచి ఈ ధర్మం మనల్ని కాపాడుతుందనీ శ్రీకృష్ణుడు వివరించాడు.

కర్మయోగం

చిన్న చిన్న ప్రయత్నాలే కర్మయోగంలో మంచి ఫలితాలను ఇస్తాయనీ, గొప్ప భయాల నుంచి ఈ ధర్మం మనల్ని కాపాడుతుందనీ శ్రీకృష్ణుడు వివరించాడు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అప్పుడే ప్రారంభించినవారికీ, ప్రయత్నించేటప్పుడు నిరుత్సాహం చెందే వారికీ శ్రీకృష్ణుడు ఇచ్చిన కచ్చితమైన హామీ ఇది. మన కష్టాన్ని భగవానుడు అర్థం చేసుకున్నాడు, చిన్న ప్రయత్నం సైతం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని మనకు తెలియజెప్పాడు. నిష్కామ కర్మ, సమత్వం అనే మార్గాలను అనుసరించేలా మనలకు ఆయన ప్రేరణ కలిగించాడు.  ‘సాంఖ్య యోగం’ అనేది స్వచ్ఛమైన జ్ఞానం కాగా, ‘కర్మయోగం’లో ప్రయత్నం కూడా ఉంటుంది. తను బోధించిన కర్మ యోగాన్ని శ్రద్ధగా పాటించడం మొదలు పెట్టాలన్నది శ్రీకృష్ణుడి సూచన. కాలక్రమేణా, ‘కర్మ యోగం’ అనే కళ్ళద్దాలలోంచి మన అనుభవాలను దర్శించడాన్ని సాధన చేస్తున్నప్పుడు... మనకు లభించే జ్ఞానం మరింత గాఢం అవుతుంది. మన భయాలను అర్థం చేసుకొని, వాటిని తొలగించుకోవడానికి కర్మయోగాన్ని ఎలా సాధన చేయాలనేది ఒక ప్రత్యామ్నాయ దృక్పథం. భయానికి మూలం... మన అంతర్గతమైన అంచనాలు, వాస్తవిక ప్రపంచం మధ్య ఉండే అసమతుల్యత.. నిష్కామ కర్మ గురించి కర్మ యోగం మనకు బోధిస్తుంది. మనం చేసే పనుల నుంచి ఫలితాలను కోరుకొనే స్వభావాన్ని మార్చుకోవడానికి అది దోహదపడుతుంది. దీనివల్ల మనలో భయం తగ్గుతుంది. 


కదులుతున్న ఓడ... దాని దిశను మార్చుకోవడానికి నీటికి ఉండే ప్రవాహశీలత అనే లక్షణం తోడ్పడుతుంది. అదే విధంగా, సరైన దిశలో ప్రయాణించడానికి చేసే చిన్న ప్రయత్నం సైతం... ఈ విశ్వానికి ఉన్న మార్పు అనే లక్షణం కారణంగా పెద్ద వ్యత్యాసాన్ని తీసుకువస్తుంది. అది మనకోసం ‘కర్మ మార్గం’ అనే దారిని చూపిస్తుంది. మనం శిశువులుగా ఉన్నప్పుడు... నడవడానికీ, పరుగెత్తడానికీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అవి పూర్తిగా వచ్చే వరకూ వదిలిపెట్టలేదు. అయితే అది అంత సులువైన విషయం కాదు. అదే విధంగా, కర్మ యోగంలో నిష్ణాతులు కావడం కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మనం వేసే అడుగులు చిన్నవే అయినప్పటికీ, కచ్చితమైన విజయాల పరంపరను మనం అనుభవంలోకి తెచ్చుకోగలం.


-కె.శివప్రసాద్‌. ఐఎఎస్‌

Updated Date - 2022-07-15T09:25:38+05:30 IST