విశ్వాన్ని నడిపేది...

ABN , First Publish Date - 2022-07-08T08:44:01+05:30 IST

ర్వజగత్తునూ నడిపే సూత్రం ఒక్కటే... అదే ప్రేమ. పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించడం మొదటిదైతే, పొరుగువారిని ప్రేమించడం రెండవది. పది ఆజ్ఞల్లో (టెన్‌ కమాండ్‌మెంట్స్‌) ఇమిడి ఉన్న సారం ఇదేనని ప్రభువు చెప్పాడు.

విశ్వాన్ని నడిపేది...

ర్వజగత్తునూ నడిపే సూత్రం ఒక్కటే... అదే ప్రేమ. పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించడం మొదటిదైతే, పొరుగువారిని ప్రేమించడం రెండవది. పది ఆజ్ఞల్లో (టెన్‌ కమాండ్‌మెంట్స్‌) ఇమిడి ఉన్న సారం ఇదేనని ప్రభువు చెప్పాడు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే... ప్రేమించేవారినే కాదు, ద్వేషించేవారిని ప్రేమించడంలోనే ఔన్నత్యం ఉందనీ, అది పాటించాలనీ కూడా బోధించాడు. ‘దేవుణ్ణి ప్రేమించే హృదయంతోనే... తోటి మానవుణ్ణి కూడా ప్రేమించాలి’ అనే సిద్ధాంతం... పది ఆజ్ఞల్లోని రెండిటి ద్వారా స్పష్టమవుతుంది. 


ఇంతకూ ప్రేమించడంలో విశేషం ఏమిటి? ప్రేమలోనే సేవించడం కూడా ఉంది. పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఉంది. చేతనైనంత సాయం చెయ్యడం కూడా ఉంది. ఒకటేమిటి ప్రేమలో అన్నీ దాగి ఉన్నాయి. చెడును దూరం చేసుకొని, మంచిని ప్రేమించమని బైబిల్‌ చెబుతుంది. అలా చేయడానికి ప్రేమే ప్రాతిపదిక. ‘‘మనుషుల భాషల్లో మాట్లాడినా, దేవదూతల భాషల్లో మాట్లాడినా... నాలో కనుక ప్రేమ లేకపోతే.... కేవలం గణగణ మోగే కంచులా మిగిలిపోతానేమో?’’ అని ఒక లేఖలో పౌలు భక్తుడు అంటాడు. నిజంగా దేవుణ్ణీ, మానవుణ్ణీ ప్రేమించేవాడు... అబద్ధం ఆడాలనుకోడు. సోమరిగా ఉండాలనుకోడు. హింసకు దూరంగా ఉంటాడు. ప్రతి పని చిత్తశుద్ధితో చేయాలనీ, సత్కార్యాలు చేసి చూపించి... దేవుణ్ణి మెప్పించాలనీ అనుకుంటాడు. 


‘‘దేవుడు ఈ లోకాన్ని ప్రగాఢంగా ప్రేమించాడు కాబట్టి... తన ఏకైక కుమారుడైన ఏసు క్రీస్తును ఇక్కడకు పంపించాడ’’ని బైబిల్‌ చెబుతోంది. ఆ దైవ కుమారుడు వచ్చి... భ్రష్టమైపోతున్న ఈ లోకానికి ఇష్టంగానే (ప్రేమతోనే) సదాచారం నేర్పించాడు. నీ, నా, తన, మన, పండిత, పామరులనే భేదం లేకుండా, రాత్రనకా, పగలనకా, చెట్టనకా, చేమనకా, కొండనకా, కోననకా... ప్రజల చెంతకు వెళ్ళాడు. వారిని సమావేశపరిచాడు. వారి అజ్ఞానం తొలగించాడు. మానవ జన్మ సార్థక్యం కోసం అనేక విషయాలను... కథల ద్వారా చిన్న పిల్లలకు నేర్పించినట్టు... బోధించాడు. లోతైన సూత్రాలను కూడా తేలికైన భాషలో అందించాడు. అంతేకాదు, ఈ లోకం కోసం అనేక నిందలు, విమర్శలు, హింస భరించాడు. మరణ శిక్షను కూడా సంప్రీతిగా స్వీకరించాడు. ప్రేమకు, ప్రేమ సూత్రానికి నిలువెత్తు నిర్వచనంగా,  ప్రజల కోసం ప్రాణార్పణం చేసిన రక్షకునిగా, మనో క్లేశ విమోచకునిగా నిలిచాడు


-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-07-08T08:44:01+05:30 IST