ధర్మోపదేశం

ABN , First Publish Date - 2022-07-08T08:38:21+05:30 IST

ది ఆషాఢ పున్నమి. సూర్యాస్తమయం అవుతోంది. వనంలోని వెదురు పొదల్లోంచీ పున్నమి చంద్రుడు తొంగి చూస్తూ వచ్చేస్తున్నాడు. వనంలోని తటాకంలో సారస పక్షులు చేస్తున్న చప్పుళ్ళూ...

ధర్మోపదేశం

ది ఆషాఢ పున్నమి. సూర్యాస్తమయం అవుతోంది. వనంలోని వెదురు పొదల్లోంచీ పున్నమి చంద్రుడు తొంగి చూస్తూ వచ్చేస్తున్నాడు. వనంలోని తటాకంలో సారస పక్షులు చేస్తున్న చప్పుళ్ళూ వినిపిస్తున్నాయి. ఆ తటాకానికి కొద్ది దూరంలో అయిదుగురు మునులు రాతి బండల మీద కూర్చొని ఏవేవో చర్చలు సాగిస్తున్నారు. వారిలో మాట్లాడుతున్న ఒక ముని కొండణ్ణ. అసలు పేరు కౌండిన్యుడు. అతను ఏదో చెబుతూ, ఒక్కసారిగా మాట్లాడడం ఆపేశాడు. దూరంగా తనవైపే వస్తున్న వ్యక్తికేసి తీక్షణంగా, నొసలు ముడిపెట్టి చూస్తూ ఉండిపోయాడు.


‘‘మిత్రమా కొండణ్ణా! మీ మౌనం ఏమిటి?’’ అని అడిగాడు భద్రీయుడు. కొండణ్ణ మాట్లాడలేదు. ఆ వచ్చే వ్యక్తి వైపే చూస్తున్నాడు.

‘‘ఆ వచ్చేది ఎవరంటావు?’’ అని ప్రశ్నించాడు కశ్యపుడు.

‘‘ఆ నడక ఎక్కడో చూసినట్టు ఉందే?’’ అని అనుమానం వ్యక్తపరిచాడు అశ్వజిత్తు.

‘‘గౌతముడా? ఆ నడక అలాగే ఉంటంది. కానీ... చాలా ఠీవిగా ఉంది. తొట్రుపడకుండా ఉంది. గౌతముడే అంటారా?’’ గొణుగుతూ అన్నాడు మహానాముడు.

‘‘మిత్రమా! మహానామా! నీవు అన్నట్టే... అతను శీల వ్రత భ్రష్టుడైన గౌతముడే’’ అని కచ్చితంగా తేల్చి చెప్పాడు కశ్యపుడు.

‘‘ముఖ కవళికలు కూడా అలాగే ఉన్నాయి’’ అన్నాడు అశ్వజిత్తు. 

‘‘మిత్రులారా! అతనే గౌతముడు. అయితే... మీరు అతనితో మాట్లాడకండి. ప్రశ్నిస్తే జవాబు చెప్పకండి. గౌరవంగా లేచి నిలబడకండి. వంగి నమస్కరించకండి. అతను వ్రత భ్రష్టుడు. కఠోర దీక్షను మధ్యలోనే వదిలిపెట్టిన పిరికివాడు. మనం అతణ్ణి గౌరవించవద్దు’’ అన్నాడు కౌండిన్యుడు.

ఈ లోగా ఆ వ్యక్తి వారి దాపులోకి వచ్చేశాడు. అది అణువణువునా మానవత్వం మూర్తీభవించిన నిండైన రూపం... కాషాయరంగు చీవరం... కదలివచ్చిన కరుణ రసం!

‘‘అదిగో... అతను గౌతముడే’’ అంటూ అప్రయత్నంగా చేతులు జోడించాడు కౌండిన్యుడు.

‘‘ఔను! మన గౌతముడే!’’ అంటూ మిగిలిన నలుగురూ అప్రయత్నంగా లేచి నిలబడ్డారు. శిరస్సులు వంచి నమస్కరించారు. ‘‘మిత్రమా! గౌతమా! స్వాగతం! స్వాగతం’’ అన్నారు.

‘‘మిత్రులారా! నేను మీకోసమే వచ్చాను. నేను గయలో బోధివృక్షం కింద ధ్యానం చేశాను. జ్ఞానోదయం పొందాను. ధర్మాన్ని దర్శించాను. సంబోధిని సాధించాను. నేనిప్పుడు గౌతముణ్ణి కాను. బుద్ధత్వం పొందిన బుద్ధుణ్ణి’’ అన్నాడు.

అప్పటిదాకా ‘మిత్రమా!’ అన్నవాళ్ళు... ‘బుద్ధత్వం పొందడం’ అంటే దుఃఖ నిరోధ మార్గాన్ని సాధించడం కాబట్టి ‘ఇతను ఇప్పుడు బుద్ధుడు, దుఃఖాన్ని భగ్నం చేసిన భగవానుడు’ అనుకున్నారు. 

‘‘భగవాన్‌! మీరు దర్శించుకున్న ధర్మాన్ని ఉపదేశించండి’’ అని చేతులు జోడించి ప్రార్థించారు. ఆ రాత్రి నడిఝాము వరకూ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని వారికి బోధించాడు. ప్రతీత్య సముత్పాదాన్ని (కార్య కారణ వాదాన్ని) సమగ్రంగా తెలిపాడు. అష్టాంగ మార్గాన్ని, చతురార్య సత్యాలనూ వివరించాడు. మధ్యమ మార్గాన్ని ప్రతిపాదించాడు. బుద్ధుని ప్రవచనాల సారాన్ని విన్నంతనే సమగ్రంగా అర్థం చేసుకున్నాడు కౌండిన్యుడు. ఆ తరువాత రెండోసారి కశ్యపునికి, మూడోసారి భద్రియునికి, నాలుగోసారి అశ్వజిత్తుకు, చివరగా మహామునికీ అర్థమయింది. ఆ వెన్నెల రాత్రి వారంతా ధర్మామృత సాగరంలో మునకలేశారు. వారంతా అప్పటికప్పుడే భిక్షువులు అయ్యారు. అందుకే వారిని ‘పంచవర్గీయ భిక్షువులు’ అంటారు.


‘‘భిక్షువులారా! ఈ ధర్మం దుఃఖ నిరోధం. దీన్ని మనం ప్రజలందరికీ అందించాలి. ఒక్కొక్కరూ ఒక్కొక్క దిక్కుకు వెళ్ళండి. ధరణీ తలం నుంచి ఈ ధర్మాన్ని నడిపించండి’ అని బుద్ధుడు చెబుతూ... వారితో భిక్షు సంఘాన్ని నెలకొల్పాడు. ఇదే తొలి ధార్మిక సంఘం. వారు ధర్నాన్ని అన్ని దిక్కులకూ చేరవేయడమే ధర్మచక్ర ప్రవర్తనం. అది బౌద్ధ సంఘం పుట్టిన రోజు. ప్రపంచ బౌద్ధులకు పండగ రోజు.              

- బొర్రా గోవర్ధన్‌

(13న ధర్మచక్ర  ప్రవర్తన దినం)

Updated Date - 2022-07-08T08:38:21+05:30 IST