ఆ త్యాగానికి గుర్తుగా...

ABN , First Publish Date - 2022-07-08T08:35:07+05:30 IST

ఇస్లాం క్యాలెండర్‌లో జిల్‌ హిజ్జా మాసం పదో రోజున ‘ఈదుల్‌-ఉల్‌-జుహ’ (బక్రీద్‌)ను నిర్వహిస్తారు. ఒక మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ పండుగను ముస్లింలు జరుపుకొంటారు.

ఆ త్యాగానికి గుర్తుగా...

ఇస్లాం క్యాలెండర్‌లో జిల్‌ హిజ్జా మాసం పదో రోజున ‘ఈదుల్‌-ఉల్‌-జుహ’ (బక్రీద్‌)ను నిర్వహిస్తారు. ఒక మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ పండుగను ముస్లింలు జరుపుకొంటారు. అదే ఇబ్రహీమ్‌, ఇస్మాయీల్‌ల త్యాగం. దైవాజ్ఞను పొందిన ఇబ్రహీమ్‌ తన ఏకైక సంతానమైన ఇస్మాయీల్‌ను దైవ ప్రసన్నత కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అది ‘దైవాజ్ఞ’ అని తెలుసుకున్న ఇస్మాయీల్‌ కత్తి కింద తన శిరస్సును సంతోషంగా పెడతాడు. ఈ అనుపమానమైన, అమూల్యమైన త్యాగానికి గుర్తుగా... తమ ప్రాణాలను అల్లాహ్‌ మార్గంలో త్యాగం చెయ్యడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఖుర్బానీ ద్వారా ముస్లింలు చాటుతారు.


ఒకసారి ఇబ్రహీమ్‌ తన ప్రియమైన కుమారుణ్ణి జిబహ్‌ (బలి) చేస్తున్నట్టు కలలో చూశారు. వెంటనే... దాన్ని దైవాజ్ఞగా తలచి, తన ముద్దుల కుమారుణ్ణి జిబహ్‌ చెయ్యడానికి తీసుకువెళ్ళారు. నిర్ణీత ప్రదేశంలో, కళ్ళకు వస్త్రం కట్టుకొని జిబహ్‌ చేయడం ప్రారంభించారు. అల్లాహ్‌ ప్రసన్నుడై... ఒక గొర్రె పోతును పంపించారు. ఇస్మాయిల్‌ను ఆ గొర్రెపోతు పక్కకు జరిపి... ఆయన స్థానంలో జిబహ్‌ అయింది. అల్లాహ్‌ దైవదూతలందరినీ హాజరుపరిచి, ‘‘నా ఆజ్ఞను అందుకున్న ఇబ్రహీమ్‌ తన కుమారుణ్ణి జిబహ్‌ చెయ్యడానికి వెనుతియ్యలేద’’ని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రళయదినం వరకూ... ఖుర్బానీని ఇస్లాంలో భాగం చేశాడు. తరువాత, ఇబ్రహీమ్‌ చేతుల మీదుగా తన గృహాన్ని (కాబాను) అల్లాబ్‌ ఈ భూమిపై నిర్మింపజేశాడు. ఆ రోజు నుంచి హజ్‌ యాత్రను విధిగా చేయడం జరిగింది. ఇబ్రహీమ్‌, ఇస్మాయీల్‌ ఇటుకలపై ఇటుకలు పేరుస్తూ కాబా గృహాన్ని నిర్మించారు.


సత్యంపై నిలబడడం, దానికోసం ప్రాణాలను అర్పించడానికైనా వెనుకాడకపోవడం, దైవాజ్ఞ కోసం కుమారుణ్ణి సైతం త్యాగం చెయ్యడానికి సిద్ధపడడం, సత్యం కోసం స్థిరంగా నిలబడడం... ఇలా హజ్రత్‌ ఇబ్రహీమ్‌ జీవితం నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. 


బక్రీద్‌లో అల్లా్‌హకు అత్యంత ప్రీతిపాత్రమైన, ఇష్టమైన ఆరాధన ఖుర్బానీ. ‘‘ఖుర్బానీని సంతోషంగా ఇవ్వాలి’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. ఖుర్జానీ ఇచ్చే వారు జిల్‌ హిజ్జా మాసంలో నెలవంకను చూశార... ఖుర్బానీ ఇచ్చేవరకూ కేశాలను, గోళ్ళను తీయకూడదు. 


ఒకసారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త వద్దకు మహమ్మద్‌ వద్దకు వచ్చి ‘‘ఓ ప్రవక్తా! నాకు ఖుర్బానీ ఇచ్చే స్తోమత లేదు’’ అన్నాడు. ‘‘నువ్వు నీ కేశాలను, గోళ్ళను ఈ మాసం  ఖుర్బానీ రోజు తరువాత తీస్తే... నీకు కూడా ఖుర్బానీ పుణ్యం లభిస్తుంది’’ అని చెప్పారు దైవ ప్రవక్త.                  

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-07-08T08:35:07+05:30 IST