ఆయన నడిచే విశ్వవిద్యాలయం

ABN , First Publish Date - 2022-07-08T08:33:41+05:30 IST

గురు బ్రహ్మః గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః అంటారు పెద్దలు. గురువుకు మన పూర్వీకులు ఇచ్చిన స్థానమిది. అలాంటి నిజమైన గురువు...

ఆయన నడిచే విశ్వవిద్యాలయం

గురు బ్రహ్మః గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః 

అంటారు పెద్దలు. గురువుకు మన పూర్వీకులు ఇచ్చిన స్థానమిది. అలాంటి నిజమైన గురువు దొరికితే అంతకన్నా అదృష్టముండదు. కంచి పీఠాధిపతుల్లో ఒక విశిష్టమైన స్థానమున్న మహాస్వామిని దగ్గరగా చూసి... వారిని అనుసరించే అవకాశం ప్రస్తుత పీఠాధిపతి            శ్రీ విజయేంద్ర సరస్వతికి దక్కింది. ఈ నెల 13న గురుపౌర్ణమి సందర్భంగా మహాస్వామికి   శ్రీ విజయేంద్ర సరస్వతి అర్పిస్తున్న గురువందనం -  నవ్య పాఠకులకు ప్రత్యేకం..


చిన్నప్పుడు- అంటే వేద పాఠశాలలో చేరకముందే పెద్దస్వామి వారి గురించి విన్నా. స్వామి వారి గురించి ఆయన తమ్ముడు సాంబమూర్తిగారు ‘దివ్య చరితం’ అనే ఒక గ్రంఽథాన్ని రాశారు. దానిని కూడా చదివా. 1930లలో స్వామి వారు మద్రాసులో ఒకో రోజు ఒకో పేటలో ఉపన్యాసం చెప్పేవారు. వాటన్నింటినీ ‘ఆచార్య స్వామి ఉపదేశం’ పేరిట ప్రచురించారు. ఆ ఉపన్యాసాలు చదివిన తర్వాత - ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదని అర్థమయింది. ఒకసారి వేదపాఠశాల విద్యార్థులమందరం అరుణాచలం వెళ్లాం. అక్కడ ఒక షాపులో స్వామి వారి ఇంటర్వ్యూ కనబడింది. దానిని చదివా. అది చదివిన తర్వాత ఆయనను ఎలాగైనా కలవాలనే కోరిక బలపడింది. మహారాష్ట్రలో సతారాలో స్వామివారు పర్యటిస్తున్న సమయంలో ఆ కోరిక తీరింది. 


తెలుగు నేర్చుకోమన్నారు...

ఆ ఉదయం మాకు ఇంకా గుర్తుంది. సతారాలో పర్యటనకు స్వామి వారు వచ్చారు. ఆయన వస్తూ- కంచి నుంచి ఒక శివలింగాన్ని చెక్కించి తెచ్చారు. ఆ శివలింగానికి ఒక విశిష్టత ఉంది. సాధారణంగా ఏదైనా విగ్రహాన్ని చెక్కిన తర్వాత ప్రతిష్టించే సమయంలో వేదపారాయణం జరుగుతుంది. కానీ వేదపారాయణతో శిల్పులు ఆ శివలింగాన్ని చెక్కారు (ఇప్పుడు ఆ శివలింగం అలహాబాద్‌లోని త్రివేణీ సంగమం వద్ద ఉన్న కంచిపీఠంలో ఉంది). తొలి రోజు వేదపాఠశాల విద్యార్థులందరం గుడికి వెళ్లాం. పూజాభిషేకాలు జరుగుతున్నాయి. స్వామి ఎక్కడా కనబడలేదు. తర్వాత చూస్తే- గుడి వెనక అతి సామాన్యమైన వ్యక్తిలా కూర్చుని ఉన్నారు. నాలుగైదు రోజులు మేము కూడా అక్కడే ఉన్నాం. కానీ స్వామితో మాట్లాడాలనే కోరిక మాత్రం తీరలేదు.  మరుసటి ఏడాది ఆ కోరిక తీరింది. వేద పరీక్షలు పూర్తిచేసిన వారందరినీ గుల్బర్గాలో సత్కరించారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడే అవకాశం చిక్కింది. మా కుటుంబం గురించి స్వామికి ముందే తెలుసు. వారి యోగక్షేమాలు అడిగారు. నాతో మాట్లాడుతూ- కంచి మఠంలో దీపారాధన సమయంలో పఠించే మంత్రం గురించి అడిగారు. నేను ఆ మంత్రం చెప్పా.  తన వద్దనున్న ఒక పుస్తకం ఇచ్చి ఖాళీ పేజీలో ఆ మంత్రాన్ని రాయమన్నారు. రాసి ఇచ్చా. బహుశా అది నాకు ఒక పరీక్ష కావచ్చు. ఆ సమయంలోనే - సంస్కృతంతో పాటు తెలుగు కూడా నేర్చుకొమ్మని చెప్పారు. స్వామిని దగ్గరగా చూడటం వల్ల ఆయన శక్తి అర్థమయింది. ఆ తర్వాతి సంవత్సరం స్వామి గుజరాత్‌లోని ఉంఝా అనే ఊరికి వచ్చారు. ఆయనను అక్కడ మళ్లీ కలిసే అవకాశం చిక్కింది. దాదాపు పది రోజులు అక్కడే ఉన్నాం. స్వామి ప్రవచనం ముందు వేదం చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అప్పటికే నేను కుమార అధ్యాపక స్కీం కింద గణితం నేర్చుకొన్నా. ఒక రోజు నన్ను పిలిచి- ‘వర్గమూలం’ తెలుసా? అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పా. ఆయన సంతృప్తి చెందారు. ఆ తర్వాత నన్ను పెద్ద స్వామి (జయేంద్ర సరస్వతి) వారి వద్దకు మహబూబ్‌నగర్‌ పంపించారు. 


నిరంతర జ్ఞానాన్వేషి

ఇక నేను కంచి మఠానికి వచ్చిన తర్వాత స్వామిని దగ్గరగా చూసే అవకాశం చిక్కింది. ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకొనే అదృష్టం దక్కింది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే- ఆయన నిరంతర జ్ఞానాన్వేషి. మార్పు సహజమని.. దానిని అందరూ గుర్తించాలనే విషయాన్ని గాఢంగా నమ్మేవారు. ఆధునిక శాస్త్రం మానవ పురోగతికి ఉపకరిస్తుందని భావించేవారు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ మోటార్‌ వాహనాలు ఎక్కలేదు. ఎక్కడికి వెళ్లినా కాలి నడకనే వెళ్లేవారు. అలాంటి స్వామిని ఒక సారి కొందరు భక్తులు విమానం చూడటానికి రమ్మని పిలిచారు. అప్పట్లో విమానాలు చాలా కొత్త. స్వామి ఏ మాత్రం సంకోచించకుండా విమానాన్ని చూడటానికి వెళ్లారు. కొత్త ఆవిష్కరణల పట్ల ఆయనకున్న ఆసక్తికి ఇదే ఉదాహరణ. స్వామిని దర్శించటానికి ప్రతి రోజూ కొన్ని వందల మంది వచ్చేవారు. వారితో మాట్లాడేవారు. వారి వారి ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను అడిగి తెలుసుకొనేవారు. స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లేవారు. కేవలం కాలి నడకన ఆయన దేశమంతా పర్యటించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. స్వామి 1917 నుంచి సమాజాన్ని దగ్గరగా చూస్తూ వచ్చారు. ప్రపంచయుద్ధాలు, టిబెట్‌, సోవియెట్‌ యూనియన్‌ల ఏర్పాటు, అమెరికా-రష్యాల మధ్య కోల్డ్‌వార్‌, మన దేశంలో కరువు కాటకాలు, బ్రిటిష్‌ పాలన- వీటన్నింటి గురించి స్వామికి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రపంచ రాజకీయ సమీకరణాలలో మన దేశ భద్రత కోసం ఏం చేయాలి? అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉండేది. దేశభక్తి విషయంలో ఆయన నిబద్ధత ఆచరణీయం. విలువలతో కూడిన అభివృద్ధి అనేది స్వామివారి మంత్రం. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాషలో మాట్లాడేవారు. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన ఒక నడిచే విశ్వవిద్యాలయం. 94 ఏళ్ల వయస్సులో.. కంటి చూపు మందగించిన తర్వాత కూడా ఆయన పుస్తక పఠనం ఆపలేదంటే స్వామి జిజ్ఞాసను మనం అర్థం చేసుకోవచ్చు. 


ప్రేమగా హెచ్చరించేవారు...

మహాస్వామి అనుభవం, హోదా, జ్ఞానం- ఈ మూడింటిలోను నేను చాలా చిన్నవాడిని. అయినా స్వామి ఎప్పుడూ నా స్థాయికి వచ్చి మాట్లాడేవారు. పీఠం.. దానికున్న చరిత్ర.. భవిష్యత్తు- ఇలా రకరకాల అంశాలపై ఆయన మాట్లాడుతూ ఉండేవారు. మారుతున్న సమాజంలో పీఠం ఆవశ్యకత... చేయాల్సిన మార్గదర్శనం గురించి  విడమర్చి చెబుతూ ఉండేవారు. ‘‘ఇప్పటిదాకా మేమూ.. పెద్ద స్వాములు ఒక రకంగా చేస్తూ వచ్చాం. రాబోయే రోజుల్లో ఇలా ఉండదు. చిన్న..పెద్ద అన్ని పనులు మీరే చేయాల్సి వస్తుంది’’ అని ప్రేమగా హెచ్చరించేవారు. ఆయనతో నేను గడిపిన సమయాన్నీ.. నా అనుభవాలను కొన్ని వందల గంటలు చెప్పినా చాలదు. ప్రతి రోజూ నేను లేచిన దగ్గరినుంచి ఆయనను స్మరించుకుంటూనే ఉంటా. గురువందనం చేసుకుంటూనే ఉంటా!’’


గాంధీజీతో అనుబంధం..

‘‘స్వామిని గాంధీజీ మూడుసార్లు స్వామిని కలిశారు. తాను స్వయంగా నేసిన నూలు వస్త్రాలు బహుకరించారు. స్వామి పీఠం బాధ్యతలు తీసుకున్న సమయానికి చాలా క్లిష్టమైన పరిస్థితులున్నాయి. తరతరాలుగా వేదాన్నే నమ్ముకున్న  కుటుంబాలను కాపాడటం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉండటం, పీఠం అభివృద్ధికి కృషి చేయటం లాంటి పనులను ఆయన చాకచక్యంగా నిర్వహించారు. ఆయన చిన్న స్వామిగా ఉన్న రోజుల్లో... కావేరీ వరదల్లో వేల మంది నిరాశ్రయులైతే.. దగ్గరుండి అన్నదానం ఏర్పాటు చేశారు. దేశం.. సమాజం.. శాస్త్రం... ఈ మూడింటిలోను వారిది చాలా దీర్ఘదృష్టి.  తాను నమ్మిన ధర్మాన్ని కఠోరమైన నిబద్ధతతో పాటించేవారు. 90 ఏళ్లు దాటేక రూడా స్వామి ఉదయాన్నే లేచి పూజ చేసిన తర్వాతే ఏదైనా తీసుకొనేవారు.  ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మేం చెబితే... ‘‘నా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు’’ అని ఒక్క మాటలో తీసేశారు. దానిలోని అంతరార్థం అప్పుడు నాకు అర్థమయింది. 


-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-07-08T08:33:41+05:30 IST