వారు ధన్యులు...

ABN , First Publish Date - 2022-07-01T09:59:42+05:30 IST

‘విశ్వాసం’ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనోధైర్యం. దేవుణ్ణి సన్నిహితం చేసే ఒక వాహిక. ఒకసారి సముద్ర తీరంలో... సంధ్యా సమయంలో ఏసు ప్రభువు శిష్యులు ఇసుక తిన్నెలను దాటి వస్తున్నారు. అల్లంత దూరాన మసక చీకట్లలో... ఆ సముద్రం అలల మీద ఏదో శక్తి నడిచి...

వారు ధన్యులు...

‘విశ్వాసం’ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనోధైర్యం. దేవుణ్ణి సన్నిహితం చేసే ఒక వాహిక. 

ఒకసారి సముద్ర తీరంలో... సంధ్యా సమయంలో ఏసు ప్రభువు శిష్యులు ఇసుక తిన్నెలను దాటి వస్తున్నారు. అల్లంత దూరాన మసక చీకట్లలో... ఆ సముద్రం అలల మీద ఏదో శక్తి నడిచి వస్తున్నట్టు గమనించారు. భయపడ్డారు. మరింత నిశితంగా చూసిన తరువాత... ఆ వచ్చేది తమ ప్రభువేనని గుర్తించి, ధైర్యం తెచ్చుకున్నారు. విస్మయం చెందారు. తమ ప్రభువు మాదిరిగానే తాము కూడా సముద్రం మీద నడవాలనే కోరికను వారు ప్రభువుకు విన్నవించారు.

‘‘అలాగే... తప్పకుండా! అది మీకు కూడా సాధ్యమవుతుంది’’ అన్నాడు ప్రభువు.

‘ఆయన మన పక్కన ఉండగా మనకిక భయమేముంది?’ అనుకొన్నారు శిష్యులు. ఆ నమ్మకంతోనే సముద్రం నీటి మీద నడిచారు. 

కొంతదూరం నిర్భయంగా వెళ్ళాక ‘ఏమౌతుందో ఏమో? మనం పడిపోతామేమో?’ అని మనసులో ఆందోళన చెందారు. వారిలో ప్రభువు మీద నమ్మకం సన్నగిల్లిందేమో? ఆ వెనువెంటనే వారు సముద్రంలో మునిగిపోసాగారు.

‘‘మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అనుకున్నది అలా జరిగిపోతుంది. ఈ ప్రకృతి మీకు విధేయంగా ఉంటుంది. మీ మాట వింటుంది’’ అని ప్రభువే చెప్పాడు. విశ్వాసం వెలుతురులా దూసుకుపోతుంటే... అవిశ్వాసం చీకటిలా ముసురుకొస్తుంది.

ఒకసారి ఏసు ప్రభువును ఒక శతాధిపతి కలుసుకున్నాడు. ‘‘నా దాసుడికి నయం చెయ్యండి ప్రభూ! దాని కోసం మీరు మా ఇంటికి రానక్కర్లేదు. నాకు అంతటి భాగ్యం కూడా లేదు. ఇక్కడి నుంచి మీరు ఒక మాట పలికితే చాలు. ఆ వ్యక్తికి తప్పనిసరిగా నయమైపోతుంది’’ అని ప్రాధేయపడ్డాడు. అతని విశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపోయాడు.

మరో సందర్భంలో... విశాలమైన ఇంటి ప్రాంగణంలో... జనం మధ్య ఏసు ప్రభువు కూర్చొని, వారికి మంచి మాటలు చెబుతున్నాడు. ఈలోగా పక్షవాతరోగిని కొందరు మోసుకొచ్చారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేకపోవడంతో... పైకప్పు మీద నుంచి మెల్లగా ఆయన సమక్షంలోకి ఆ రోగిని దింపారు. ప్రభువు చూస్తే చాలు... రోగం నయమైపోతుందన్నది వారి ప్రగాఢ విశ్వాసం. 

అలాగే, గాయాలతో బాధపడుతున్న వ్యక్తి ఒకరు... ఏసు ప్రభువు శిష్యులను తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రభువు గురించి తనకు కాస్త వివరించాలని అడిగాడు. శిష్యులు శుభసందేశం ఇస్తూండగానే... అతని గాయాలు మానిపోయాయి.

ప్రభువు మరణించినప్పుడు... ఆయన కాళ్ళకూ, చేతులకూ గాయాలు ఉన్నాయి. మరణించిన ప్రభువు మూడో రోజున తిరిగి లేచాడు. శిష్యులకు కనిపించాడు. ప్రభువు కనిపించాడని మిగిలినవారు చెప్పినప్పుడు... తోమా మాత్రం నమ్మలేదు. ప్రభువు గాయాల్లో వేలుపెట్టి చూశాకే నమ్ముతానన్నాడు. రెండోసారి శిష్యులకు ప్రభువు కనిపించినప్పుడు, అక్కడ తోమా కూడా ఉన్నాడు. నిర్ధారణ కోసం ప్రభువు గాయాల్లో అతను వేలు పెట్టాడు. ఆ తరువాత సంతోషం పట్టలేక... ‘‘నా ప్రభువే’’ అంటూ బిగ్గరగా అరిచాడు.

అప్పుడు ప్రభువు తోమా... ‘‘నువ్వు చూసిన తరువాతే నమ్మావు కదా! కానీ చూడకుండానే నన్ను నమ్మేవారు ధన్యులు సుమా!’’ అన్నాడు.

ఆ తోమా ద్వారానే క్రైస్తవ సిద్ధాంతం భారతదేశంలో కాలుమోపింది. 

- డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-07-01T09:59:42+05:30 IST