మహోన్నత మార్గదర్శి

ABN , First Publish Date - 2022-05-06T05:08:31+05:30 IST

భారత దేశం ప్రపంచానికి అందించిన విశిష్టమైన ఆధ్యాత్మికవేత్తల్లో స్వామి శ్రీయుక్తేశ్వర్‌ గిరి ఒకరు. సార్వకాలికమైన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథంగా పేరుపొందిన

మహోన్నత మార్గదర్శి

  • 10న శ్రీ యుక్తేశ్వర్‌ గిరి జయంతి 


భారత దేశం ప్రపంచానికి అందించిన విశిష్టమైన ఆధ్యాత్మికవేత్తల్లో స్వామి శ్రీయుక్తేశ్వర్‌ గిరి ఒకరు. సార్వకాలికమైన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథంగా పేరుపొందిన ‘ది హోలీసైన్స్‌’ రచయితగా ఆయన విఖ్యాతులు. ప్రశస్తి పొందిన ఆధ్యాత్మిక గ్రంథం ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత శ్రీ పరమహంస యోగానందకు గురువుగా ఆయన ప్రసిద్ధులు.


మానవ పరిణామాన్ని వేగవంతం చేసే ఉపకరణంగా క్రియాయోగాన్ని శ్రీయుక్తేశ్వర్‌ గిరి అభివర్ణించారు. ‘‘మానవుల శరీరం, మనసు, ఆత్మ... ఈ మూడూ పరిశుద్ధతను సాధించడానికి సాయపడుతూ, శ్రద్ధకలిగిన సాధకుడు ఆ భగవంతుడితో ఏకత్వాన్ని కనుగొనే సామర్థ్యాన్ని ప్రసాదించే కచ్చితమైన విజ్ఞానం క్రియాయోగం’’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకానికి క్రియాయోగాన్ని దగ్గర చేయడానికి శ్రీ పరమహంస యోగానంద చేసిన కృషికి ఆలంబనగా నిలిచి, తన శిష్యుడు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి శ్రీయుక్తేశ్వర్‌ ఎనలేని దోహదం చేశారు.


శ్రీయుక్తేశ్వర్‌ 1855 మే 10వ తేదీన బెంగాల్‌లో జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు ప్రియనాథ్‌ కరార్‌. సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి... ‘శ్రీయుక్తేశ్వర్‌ గిరి’ అనే దీక్షానామాన్ని పొందారు. తన గురువైన శ్రీమహావతార్‌ బాబాజీ ఆదేశానుసారం ‘ది హోలీ సైన్స్‌’ అనే అపూర్వమైన గ్రంథాన్ని రాశారు. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను సంగ్రహంగానూ, స్పష్టంగానూ అందులో పొందుపరిచారు. మహోన్నతుడైన మార్గదర్శిగా నిలిచారు.


తన ప్రధాన శిష్యుడైన యోగానందకు శ్రీయుక్తేశ్వర్‌ ఇచ్చిన శిక్షణ తీవ్రమైనదీ, అన్నిరకాలుగా పరిపూర్ణమైనదీ కూడా. ఆయన నిర్దేశాన్ని అనుసరించి... పశ్చిమదేశాలకు క్రియాయోగాన్ని యోగానంద పరిచయం చేశారు. అలాగే... క్రియాయోగానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రామాణికంగా వ్యాప్తి చేయడం కోసం ‘సెల్ఫ్‌ రియలైజేషన్‌ ఫెలోషిప్‌’, ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా’లను స్థాపించాల్సిందిగా యోగానందకు శ్రీయుక్తేశ్వర్‌ సూచించారు. మానవజాతికి క్రియాయోగాన్ని నేర్పించే ప్రయత్నంలో యోగానంద వేసిన తొలి అడుగులకు యుక్తేశ్వర్‌ మార్గదర్శకత్వమే మూలాధారం అయింది. దీనితో యోగానంద ప్రతిష్ట ఖండాంతరాలకు వ్యాపించింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మేరు శిఖరంగా నిలబెట్టింది. 


వారిద్దరి తొలి పరిచయం ఎంతో నాటకీయంగా జరిగింది. యోగానందకు కాశీలోని ఒక చిన్న వీధి మొదట్లో నిలబడి ఉన్న పొడుగ్గా, గంభీరంగా ఉన్న సాధువు కనిపించారు. ఆ వ్యక్తిపట్ల తను ఆకర్షితుడవుతున్నట్టు యువకుడైన యోగానంద గ్రహించారు. ఆ సాధువు ఎన్నో జన్మలుగా తన గురువని గుర్తించారు. యోగానందను చూడగానే ‘‘నా తండ్రీ! వచ్చేశావా!’’ అంటూ పలకరించారు ఆ సాధువు. ఆయనే శ్రీయుక్తేశ్వర్‌ గిరి. కాలాతీతమైన ఈ గురు శిష్య అనుబంధం గురించి ‘ఒక యోగి ఆత్మకథ’లో యోగానంద రాసుకున్నారు. 


ఆ తరువాత కఠోర సాధనతో యోగానంద వ్యక్తిత్వానికి శ్రీయుక్తేశ్వర్‌ సానపట్టారు.  ఆదర్శవంతమైన జీవనానికి శ్రీయుక్తేశ్వర్‌ జీవితం ఒక మంచి ఉదాహరణ. తరతరాలకూ నిలిచే గ్రంథాన్ని రచించినప్పటికీ, ఆయన తన జీవితంలోని ఎక్కువ భాగాన్ని శిష్యులకు క్షుణ్ణమైన ప్రాథమిక శిక్షణ అందించడంలో గడిపారు. యోగానంద లాంటి మహోన్నతులను లోకానికి అందించి, ప్రపంచంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మార్గాన్ని సుగమం చేశారు.                                                                                                                                       


మరింత సమాచారం కొరకు http://yssofindia.org చూడగలరు..


                                            ఆరేపాటి వెంకట నారాయణ రావ్

                                              9666665328




Read more