న్యూఢిల్లీ: నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్లు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇది ఇంకా తుది నిర్ణయానికి రాలేదట. ఈ విషయమై సోమవారం మీడియాతో చీఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి మాట్లాడుతూ ‘‘అగ్నిపథ్ పథకంలో భాగంగా నేవీ నియామకాల్లో లింగసమానత్వం ఉండేలా చూసుకుంటాం. అందుకే సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలను సెయిలర్లుగా తీసుకోవాలని నిర్ణయించాం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇక అగ్నిపథ్‌లో చేరే అభ్యర్థులు ఎలాంటి నిరసనల్లో పాల్గొననట్లు ధ్రువపత్రం ఇవ్వాలని మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై మిలిటరీలో చేరాలనుకునే యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. మిలిటరీలో చేరే యువతకు జోష్, హోష్ ఉండాలని.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంలో ఇదొక కీలక అంశమని ఆయన అన్నారు. హింసాత్మక నిరసనలు చేసేవారికి అగ్నిపథ్ పథకంలో కేంద్రం రాయితీలు ఇవ్వలేదని అనిల్‌పురి అన్నారు. ఈ సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సాయుధ దళాలు క్రమశిక్షణతో ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థుల దరఖాస్తుదారులు మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. అయితే అగ్నిపథ్‌లపై ఇలాంటి నిరసనలను ఊహించలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి