జై దుర్గమ్మా!

ABN , First Publish Date - 2021-10-08T04:54:57+05:30 IST

ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం.. పాలకొండ కోటదుర్గమ్మ నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. దసరా పండగను పురస్కరించుకుని గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కోటదుర్గమ్మ భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తరించారు.

జై దుర్గమ్మా!
కోటబొమ్మాళి : కలశాలతో భక్తుల ఊరేగింపు

- కోటదుర్గమ్మ నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు 

- కొవిడ్‌ నిబంధనల నడుమ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

(పాలకొండ)

ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం.. పాలకొండ కోటదుర్గమ్మ నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. దసరా పండగను పురస్కరించుకుని గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కోటదుర్గమ్మ భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తరించారు. జిల్లాతో పాటు విజయనగరం జిల్లా, ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. అమ్మవారిని దర్శించుకున్నారు. కొవిడ్‌ నిబంధనల నడుమ ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సంబరాలు, ముర్రాటల చెల్లింపునకు నిరాకరించారు. దీంతో భక్తులు కేవలం అమ్మ వారి దర్శనానికే పరిమితమయ్యారు. కోటదుర్గమ్మను స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ తదితరులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ ప్రసాదశర్మ, ఈవో వాసుదేవరావులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి.. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఉత్సవాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ సి.హెచ్‌. ప్రసాద్‌లు డివిజన్‌లోని పోలీస్‌ సిబ్బందితో కలిసి క్యూలైన్ల వద్ద భక్తుల రద్దీని నియంత్రించారు. పాలకొండలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా  చర్యలు చేపట్టారు. అలాగే ఆలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖాధికారులు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో.. డీఎస్పీ శ్రావణి స్పందించి తాగునీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, పాలకొండకు చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు తన తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, రాము జ్ఞాపకార్థం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అద్దాల మండపాన్ని ప్రారంభించారు. 


ముగిసిన కొత్తమ్మతల్లి జాతర 

కోటబొమ్మాళి : కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనల నడుమ ఉత్సవాలు సాగాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల తాకిడి కాస్త తగ్గింది. గురువారం వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక రెడ్డికవీధిలోని చిన్నప్పలనాయుడు ఇంటి నుంచి అమ్మవారి జంగిడిని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తీసుకువచ్చారు. పరిమిత సంఖ్యలో మహిళలు పసుపు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. ఉత్సవాలు నిర్వహించేలా పోలీసు సిబ్బందికి, ఆలయ కమిటీ సభ్యులకు సూచనలు చేశారు. 

Updated Date - 2021-10-08T04:54:57+05:30 IST