కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ వివాదం రేపిన సిద్ధూ సలహాదారు

ABN , First Publish Date - 2021-08-19T22:10:56+05:30 IST

కశ్మీర్ ప్రత్యేక దేశమని, ఇండియా, పాకిస్థాన్ ఇద్దరూ కశ్మీర్ ఆక్రమణదారులేనని పంజాబ్ కాంగ్రెస్..

కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ వివాదం రేపిన సిద్ధూ సలహాదారు

ఛండీగఢ్: కశ్మీర్ ప్రత్యేక దేశమని, ఇండియా, పాకిస్థాన్ ఇద్దరూ కశ్మీర్ ఆక్రమణదారులేనని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారుల్లో ఒకరైన మల్విందర్ సింగ్ మాలి ట్వీట్ చేశారు. కశ్మీర్ పూర్తిగా కశ్మీరీ ప్రజలేదనంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే కాకుండా వివిధ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


''ఆయనేమో (మాలి) కశ్మీరీల దేశం కశ్మీర్ అంటున్నారు. అంటే కశ్మీర్ ప్రత్యేక దేశమని ఆయన అర్ధం. కశ్మీర్‌ను అక్రమంగా భారత్, పాక్ ఆక్రమించుకున్నట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ మీరేమంటారు? కశ్మీర్‌ను కాపాడుకునేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఇది అవమానించినట్టు కాదా?'' అని శిరోమణి అకాలీదళ్ (సాద్) నేత బిక్రమ్ మజితియా ప్రశ్నించారు. పంజాబ్‌లో శాంతికి పాక్ భంగం కలిగిస్తోందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపిస్తుంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకుంటున్నారంటూ విమర్శించారు.


చర్య తీసుకోండి...

కశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాలిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌ను కాపాడేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు అనేక మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి త్యాగాలకు విలువలేకుండా చేస్తున్నారని బీజేపీ నేత వినీత్ జోషి అన్నారు. సిద్ధూపై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. సిద్ధూ ఏమాత్రం నిలకబడలేని రాజకీయ నేత అని, బీజేపీనే ఆయనకు రాజకీయ గుర్తింపునిచ్చిందని పేర్కొన్నారు. ఆయన భార్యకు ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన తన విధేయులతో కలిసి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుకు నెరవేరని సిద్ధూ రాజకీయ ఆకాంక్షలే కారణమన్నారు. ఇందుకోసం ఎంతదూరమైనా ఆయన వెళ్తారని, అమరవీరుల కుటుంబాలను విమర్శిస్తూ పుండుమీద కారం చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-08-19T22:10:56+05:30 IST