Abn logo
Sep 28 2021 @ 18:12PM

దళితునికి సీఎం పదవి ఇవ్వడాన్ని సిద్ధూ జీర్ణించుకోలేకపోతున్నారు : ఆప్

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఓ దళితుడు చేపట్టడాన్ని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ సహించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకర్లతో మాట్లాడుతూ, సిద్ధూ దళిత వ్యతిరేకి అని ఆరోపించారు. 


పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని సిద్ధూ జూలైలో చేపట్టారు. మంగళవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. తాను పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. పంజాబ్ భవిష్యత్తుపై రాజీపడబోనని తెలిపారు. మరికొద్ది నెలల్లో పంజాబ్ శాసన సభ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ అంతర్గత కలహాలతో ఇబ్బందుల్లో పడింది.


ఈ నేపథ్యంలో ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకర్లతో మాట్లాడుతూ, నవజోత్ సింగ్ సిద్ధూ దళిత వ్యతిరేకి అని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందన్నారు. ఓ నిరుపేద బిడ్డను ముఖ్యమంత్రిని చేశారన్నారు. దీనిని సిద్ధూ సహించలేకపోతున్నారన్నారు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇవి కూడా చదవండిImage Caption