రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తా : నవజోత్ సింగ్ సిద్ధూ

ABN , First Publish Date - 2022-02-05T21:32:32+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా

రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తా : నవజోత్ సింగ్ సిద్ధూ

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎవరిని ప్రకటించినా తాను స్వాగతిస్తానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శనివారం సిద్ధూ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ నిర్ణయమే అంతిమమని తెలిపారు. 


పరిస్థితులను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని చెప్పారు. పార్టీ అధిష్ఠానం కోరుకున్నదే తనకు ఆజ్ఞ అని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, ప్రకటించకపోయినా, తుది శ్వాస వరకు తాను కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. 




ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ బంధువును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై సిద్ధూ స్పందిస్తూ, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. తన బంధువును ఈడీ అరెస్టు చేస్తే, తాను బాధ్యుడినవుతానా? అని ప్రశ్నించారు. ఎన్నికలు జరగడానికి ముందు ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసే విధంగా చూద్దామన్నారు. 


అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకుంటే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు కనీసం 70 స్థానాలు లభిస్తాయని చెప్పారు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి అభ్యర్థిని రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 


ప్రజాభిప్రాయ సేకరణ

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. 3 ఆప్షన్లు ఇచ్చి అభిప్రాయాన్ని తెలపాలని కోరుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ కావాలనుకుంటే 1 నొక్కాలని, నవజోత్ సింగ్ సిద్ధూ కావాలనుకుంటే 2 నొక్కాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించవలసిన అవసరం లేదనుకుంటే 3 నొక్కాలని టెలిఫోన్ సందేశంలో కోరుతోంది.


117 స్థానాలున్న పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 

Updated Date - 2022-02-05T21:32:32+05:30 IST