నవధర్మం మానవధర్మం

ABN , First Publish Date - 2020-06-05T06:07:41+05:30 IST

ఎక్కడ ఒక మహమ్మారి ఎదురులేని రాజ్యాధికారానికి మిష కాకుండా, పౌరునికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ రాజ్య-పౌరసత్వ సంబంధాన్ని పునర్నిర్వచిస్తుందో; ఎక్కడ నియమ నిబంధనలు భయం లేదా ఆజ్ఞతో కాకుండా వివేకం, విజ్ఞానంతో అమలుపరుస్తారో;..

నవధర్మం మానవధర్మం

సుదీర్ఘ లాక్ డౌన్ వేళ సృజనాత్మక ప్రతిభలు పలురీతుల్లో పల్లవిస్తున్నాయి. నేనేమీ కవిని కాను. అయితే, ఈ సంక్షుభిత సందర్భంలో నా మనస్సులోని అలజడి నుంచి వచ్చిన ఆలోచనలను, రవీంద్ర మహాకవి సుప్రసిద్ధ నివేదనా గీతం ‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ‘స్ఫూర్తితో కరోనా కాలంలో ‘నవ’ భారతం ప్రభవించేందుకు తోడ్పడాలని ఆ పురాతన పరాత్పరుడిని ప్రార్థిస్తున్నాను (గురుదేవ్‌కు క్షమాపణలతో ఈ కవితాత్మక స్వేచ్ఛ తీసుకుంటున్నాను). పాత పద్ధతులు, ఆచారాలు అన్నీ ధ్వంసమై ఉదయించే నవీన విలువలు, సంప్రదాయాలు సామాన్య మానవుని శ్రేయస్సుకు పూచీ వహించాలని ఆకాంక్షిస్తున్నాను.


ఎక్కడ ఒక మహమ్మారి ఎదురులేని రాజ్యాధికారానికి మిష కాకుండా, పౌరునికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ రాజ్య-పౌరసత్వ సంబంధాన్ని పునర్నిర్వచిస్తుందో; ఎక్కడ నియమ నిబంధనలు భయం లేదా ఆజ్ఞతో కాకుండా వివేకం, విజ్ఞానంతో అమలుపరుస్తారో; ఎక్కడ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పరస్పర ప్రత్యర్థులుగా కాకుండా కలసికట్టుగా పని చేస్తారో; ఎక్కడ ఎక్కడ నిరంకుశత్వ ధోరణుల స్థానంలో ప్రజాస్వామిక ఏకాభిప్రాయం పునఃస్థాపితమవుతుందో; ఎక్కడ నిత్య భజనపరులకంటే సామర్థ్య రంగ నైపుణ్యాలకు విలువ లభిస్తుందో; 


ఎక్కడ ఒక దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు విస్తృత సంప్రదింపుల ద్వారా ప్రణాళికను రూపొందించి (కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే ప్రకటించడం కాక) అమలుపరుస్తారో; ఎక్కడ ఆరోగ్య అత్యయిక స్థితి విధించడాన్ని ఉపేక్షించి, ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల దోసేందుకు ప్రాధాన్యమివ్వడం సంభవించదో; ఎక్కడ, దేశంలోని ఉత్కృష్ట మేధావులు, ప్రజా హిత ఆలోచనాపరులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందో;


ఎక్కడ, దేశ ఆరోగ్య భద్రతా సదుపాయాలు దశాబ్దాలుగా అభివృద్ధి అవుతూ, తక్షణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అరకొర పరిష్కారం కావో; ఎక్కడ వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలను పెంపొందించుకొనేందుకు కాకుండా, ప్రజారోగ్య రంగం అభివృద్ధికి నిధులను వ్యయపరిచేందుకు ప్రథమ ప్రాధాన్యం లభిస్తుందో; ఎక్కడ పార్లమెంటు భవనాల పునరుద్ధరణ కంటే ప్రభుత్వాసుపత్రులు పునర్నిర్మితమవుతాయో; ఎక్కడ వాహ్యాళి ప్రదేశాలు, కీర్తి శేషుల భారీ విగ్రహాల ఏర్పాటు కంటే నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడానికి ప్రాధాన్యం లభిస్తుందో; ఎక్కడ ఆరాధనా ప్రదేశాలపై హక్కుల కోసం కాకుండా ఒక వివాదాస్పద స్థలాన్ని పాఠశాలకు ఇవ్వాలా లేక ఆస్పత్రి నిర్మాణానికి ఉపయుక్తం చేయాలా అనే విషయమై పోరాటాలు జరుగుతాయో; ఎక్కడ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన అంకెల కంటే ఒక రాష్ట్ర మానవాభివృద్ధి సూచీకి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందో; ఎక్కడ ఒక రాష్ట్ర సిరిసంపదలను వాణిజ్య సదస్సులలో ఎన్ని ఎం ఓ యూలపై సంతకాలు జరిగాయన్న అంశానికి కంటే ఆ రాష్ట్ర మానవ పెట్టుబడి నాణ్యత ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందో; 


ఎక్కడ డాక్టర్లు విశ్వమారి విలయంలో మాత్రమే ‘కరోనా యోధులు’గా గౌరవం పొందడం కాకుండా సాధారణ రోజుల్లోనూ ఉత్తమ వ్యక్తులుగా గౌరవార్హులు అవుతారో; ఎక్కడ గౌరవం ఇవ్వడం అంటే దీపాలు వెలిగించడం ఇత్యాది పనులుకాకుండా ఆరోగ్యభద్రతా సిబ్బందికి మెరుగైన పని పరిస్థితులు, నాణ్యమైన రక్షణ ఉపకరణాలు సమకూర్చడమే నిజమైన గౌరవంగా భావించడం జరుగుతుందో; ఎక్కడ సినిమా నటీనటులు, ఫ్యాషన్ ఐకాన్‌ల కంటే డాక్టర్లు, శాస్త్రవేత్తలకే ఎక్కువ గౌరవాదరాలు లభిస్తాయో; ఎక్కడ ఆర్థిక నష్టాలు, భౌతిక స్థాన భ్రంశానికి లోనైన వారిని అగోచర ‘వలస కార్మికులు’గా పరిగణించకుండా సమాన హక్కులు గల సమాన పౌరులుగా గుర్తించడం జరుగుతుందో; ఎక్కడ, నగరాలలో మనకు గృహాలు, వంతెనలు, హైవేలు నిర్మించిన శ్రామికులు ‘వారిలో ఒకరుగా కంటే, మనలో ‘ఒకరు’గా గుర్తింపు పొంది, సామాజిక, ఆర్థిక భద్రతకు సంపూర్ణంగా అర్హులవుతారో; పేదలు, నిరాశ్రయుల పట్ల సంఘీభావంతో ఆ అభాగ్య గతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్.జి.ఓలను ‘దుర్విధి ప్రవక్త’లని దేశ అత్యున్నత న్యాయాధికారి అభిశంసించకుండా సమాజ అంతరాత్మ సంరక్షకులని కీర్తించడం జరుగుతుందో; ఎక్కడ నిర్వాసితుల దీన పరిస్థితుల గురించి వార్తలు రాస్తున్న పాత్రికేయులను రాబందులు అని నిందించకుండా సత్యాన్ని పాలకులకు ఎలుగెత్తి చెబుతున్నవారుగా గుర్తించడం జరుగుతుందో;


ఎక్కడ, స్వస్థలాలకు తిరిగి వెళుతున్న వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించడమనేది రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీయదో; ఎక్కడ కాలినడకతో అలసిపోయి రైలు పట్టాల మీద నిద్రపోతున్న అమాయక వలసజీవులు దుర్మరణం పాలుకావడం జరగదో; గాయపడిన తండ్రిని ఒక సైకిల్ పై 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలానికి తీసుకువెళ్ళిన ఒక సాహసోపేత బాలికను సంభావ్య ఒలింపిక్ పతక విజేతగా కొనియాడడం కాకుండా కటిక పేదరికమే ఆ చిన్నారికి అటువంటి తెగువను కల్పించాయని గుర్తించడం జరుగుతుందో; ఎక్కడ సంఖ్యానేక వలస కూలీలు కాలినడకను సుదూరాలలోని స్వస్థలాలకు అతి కష్టమ్మీద నడిచిపోయే దుస్థితి ఉండగా, విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి విమానాల ద్వారా తీసుకువచ్చే ప్రయత్నాలను ‘వందే భారత్’ లాంటి ఆకర్షణీయ ఊత పదాలతో ఊదరగొట్టడం జరగదో;


ఎక్కడ ‘సామాజిక దూరం’ అనేది ఉన్నత వర్గాల వారి ప్రత్యేక హక్కు కాకుండా సకల పౌరులకూ అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయమవుతుందో; ఎక్కడ ఒక టాయ్ లెట్ వసతిని యాభై మంది వినియోగించుకోవలసిన దుస్థితి, ఒకే గదిలో డజన్ మంది నిద్ర పోవలసిన శోచనీయ స్థితి ఉండదో; ఎక్కడ మౌలిక పారిశుద్ధ్య వసతులతో కూడిన గృహవసతి స్వల్పాదాయ వర్గాల వారికి కూడా అందుబాటులో ఉంటుందో; ఎక్కడ ధారవిని ఆసియా ఖండ అతి పెద్ద మురికివాడగా గుర్తించడం కాకుండా పట్టణీకరణ వికృతాలకు ప్రతిబింబంగా చూడడం జరుగుతుందో, ఎక్కడ ఆన్ లైన్ విద్యాభ్యాసం ఏవో కొన్ని నగర పాఠశాలల్లో జరగడం కాకుండా, డిజిటల్ అంతరాలను రూపుమాపే సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దోహదం చేస్తుందో;


ఎక్కడ, వైరస్ ప్రబలడానికి కారకులయ్యారనే కళంకాన్ని ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి ఆపాదించడం జరగదో; ఎక్కడ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకోవడం జరగదో; ఎక్కడ మత పరమైన గుర్తింపుతో కూరగాయల విక్రేతలను బాయ్ కాట్ చేయడం జరగదో; ఎక్కడ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కోసం వార్తలను సంచలనాత్మకంగా నివేదించడం జరగదో; ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజంలో భిన్న వర్గాల వారి మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం జరగదో; ఎక్కడ మహమ్మారి అన్ని కులాల, వర్గాల వారికి సోకుతుందో; ఎక్కడ ఒక సహకార సంఘం లేదా ఒక ఒక సామాజిక సంక్షేమ సంఘం ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్తి కాకుండా ఉంటుందో; ఎక్కడ గృహపరిచారికలపై కరోనా వ్యాపకులుగా ముద్రవేసి, వారి జీవనాధారాన్ని దెబ్బ తీయడం జరగదో, ఎక్కడ కరోనా వైరస్ మురికివాడల నుంచి వ్యాపించలేదని, కులీన వర్గాల వారు తమ విమానయానాల ద్వారా దేశంలోకి దిగుమతి చేశారన్న వాస్తవాన్ని గుర్తించడం జరుగుతుందో; ఎక్కడ సంపన్నులు లాక్‌డౌన్ వేళ కూడా నెట్ ఫ్లిక్స్, జూమ్ ద్వారా నిండు వినోదాన్ని పొందుతుండగా పేదలు తమ దినసరి ఆదాయానికి చెమటలు కక్కుతున్నారన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవడం జరుగుతుందో; ఎక్కడ కొంత మంది అదృష్టవంతులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించినప్పటికీ అధిక సంఖ్యాకులు పని ప్రదేశాలకు వెళ్ళేందుకు ప్రజారవాణా వ్యవస్థ ఆవశ్యకత ఉన్నదో;


ఎక్కడ కార్పొరేట్ కంపెనీల అధిపతులు ప్రధాన మంత్రి కేర్ ఫండ్‌కు ఉదారంగా విరాళాలిచ్చినప్పటికీ తమ చట్టుపక్కల వున్నవారి యోగ క్షేమాలను విస్మరించడం జరిగిందో; ఎక్కడ ప్రభుత్వ నిధులన్నీ మరింతగా ప్రజా పరిశీలన కిందకు వస్తాయో; ఎక్కడ వాణిజ్య అవసరాల కంటే సిబ్బంది జీవన భద్రతకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందో; ఎక్కడ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపనలు సమకూరుస్తాయో, మరీ ముఖ్యంగా నిరుపేదలకు నేరుగా నగదును బదిలీ చేయడం జరుగుతుందో; ఎక్కడ ఈ సంక్షోభం సంస్కరణలకు ఒక సదవకాశమే అయినప్పటికీ ఆ సంస్కరణల ఉత్సాహం మరొకసారి ఆశ్రిత పక్షపాతంగా దిగజారిపోవడాన్ని అనుమతించని చోట; ఎక్కడ పారిశ్రామికాభివృద్ధికి మాత్రమేకాకుండా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో సంస్కరణలను రూపొందించిన చోట; ఎక్కడ ‘స్వావలంబన’ భారత్ అనేది ఒక నినాదంగా మిగిలిపోకుండా ఒక సజీవ వాస్తవంగా రూపుదాల్చుతుందో; ఎక్కడ శాసన నిర్మాతలు తమ జీవనశైలిలో అంతర్భాగంగా ఉన్న విదేశీ వస్తువుల- బ్రాండెడ్ వాచీలు, డిజైనర్ కళ్ళజోళ్లు, లగ్జరీ కార్లు-ను త్యజిస్తారో...

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు, నా తండ్రీ


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-06-05T06:07:41+05:30 IST