Jul 27 2021 @ 10:00AM

Nava Rasa: ‘నవరస’ ట్రైలర్ విడుదల

తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా ప్ర‌ముఖ డిజిట‌ల్ మాధ్య‌మం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుద‌ల‌వుతున్నఅంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఈ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను మంగళవారం (జూలై 27) నెట్‌ఫ్లిక్స్  విడుద‌ల చేసింది. భార‌తీయ సినిమాలో లెజెండ్రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం, సీనియ‌ర్ ఫిల్మ్ మేక‌ర్ జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్ ఈ అంథాల‌జీని రూపొందించారు. మాన‌వ జీవితంలోని తొమ్మిది ర‌సాలు(భావోద్వేగాలు).. ప్రేమ‌, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భ‌యం, జుగుప్స‌, ఆశ్చ‌ర్య‌పోవ‌డం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుత‌మైన‌ క్రియేటివ్ పర్సన్స్ అందరూ  ఇండియ‌న్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాల‌జీని రూపొందించారు. వాటిన్నంటినీ ట్రైలర్‌లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. హీరో సూర్య‌, విజ‌య్ సేతుప‌తి, సిద్ధార్థ్‌, అర‌వింద‌స్వామి, ప్ర‌కాశ్‌రాజ్‌, రేవ‌తి, అంజ‌లి, అధ‌ర్వ‌ముర‌ళి. ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టించిన ఈ అంథాల‌జీ ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని కోవిడ్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికుల‌కు అంద‌జేయ‌డానికి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ నిర్ణ‌యించుకుంది. 

దీని గురించి మ‌ణిర‌త్నం, జ‌యేంద్ర మాట్లాడుతూ ‘‘భావోద్వేగాలు క్ష‌ణిక‌మైన‌వే కావ‌చ్చు. అయితే అవి మ‌న జీవితాంతం గుర్తుండిపోతాయి. భావోద్వేగాలు మ‌న జీవితంలో ఓ భాగం. కొన్ని భావోద్వేగాలు అయితే మ‌న గ‌మ‌నాన్నే మార్చేస్తాయి. ఇలాంటి భావోద్వేగాల‌తో రూపొందిన `న‌వ‌ర‌స‌` మ‌న‌లో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సాధార‌ణంగా మ‌న జీవితంలో ఎన్నో భావోద్వేగాలున్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా ఓ ఎమోషన్ మ‌న మ‌న‌స్సు, ఆత్మ‌ను స్వాధీనంలోకి తెచ్చుకుని మ‌న చ‌ర్య‌ల ద్వారా బ‌హిర్గ‌త‌మవుతుంటాయి. అలాంటి తొమ్మిది భావోద్వేగాల నుంచి పుట్టిన తొమ్మిది క‌థ‌ల క‌ల‌యికే `న‌వ‌ర‌స‌`. ఈ తొమ్మిది ర‌సాలు(భావోద్వేగాలు) నుంచి తొమ్మిది క‌థ‌ల‌ను ఎంగేజింగ్‌గా రూపొందించ‌డానికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీలోని మా స‌హ‌చ‌రులు, ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, సాంకేతిక‌నిపుణులతో భాగ‌మైనందుకు ఆనందంగా, గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ తొమ్మిది ర‌సాల సంగ‌మాన్ని చూసి ఆనందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.