Oct 20 2021 @ 03:56AM

‘నాట్యం’ గొప్పతనాన్ని చెప్పే సినిమా

కూచిపూడి నృత్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. రేవంత్‌ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రపరిశ్రమ నుండి ఈ సినిమాకు మంచి సపోర్ట్‌ వస్తోంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు ఈ చిత్ర యూనిట్‌కు లభించాయి. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘సాధారణంగా ఈ తరహా చిత్రాలు అనగానే విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘నాట్యం’ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది. మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతున్న ఈ తరంలో ఇటువంటి సినిమా రావడం సంతోషంగా ఉంది. కొత్త దర్శకుడైన రేవంత్‌ ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందనీయం. పెద్ద ఫామిలీ నుండి వచ్చిన సంధ్యారాజు డబ్బు కోసం కాకుండా ఇటువంటి చిత్రం తీయడం తనకున్న ఫ్యాషన్‌ను, కళల పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. నాట్యం గొప్పతనాన్ని కోట్లాదిమందికి చెప్పే సినిమా ఇది. వారి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ‘నాట్యం’ చిత్రాన్ని ఎప్పుడు చూస్తానా అని నాకు కూడా ఆత్రుతగా ఉంది’ అన్నారు.


నటి, నిర్మాత సంధ్యారాజు మాట్లాడుతూ ‘ఎంతో అంకితభావం, కష్టం ఉంటే తప్ప డబ్బుతో వచ్చే కళ కాదు ఇదనీ, నాట్యం వల్ల జనం మనం గౌరవిస్తారని నాకు అర్ధమైంది. అందుకే నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేశాను. ఈ ప్రయాణంలో చిరంజీవిగారిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన గొప్ప డాన్సర్‌. సూర్యుడిలాంటి వ్యక్తి. ఆయన ఆశీర్వాదం మాకు లభించడం ఆనందంగా ఉంది’ అన్నారు. కేవలం నాట్యం గురించే కాకుండా మన సంస్కృతిని కూడా చిత్రంలో చూపించామనీ, తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదనీ దర్శకుడు రేవంత్‌ చెప్పారు.