Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 22 Dec 2021 19:51:23 IST

సాయిపల్లవి భుజాలపైనే బరువు ఎక్కువగా ఉండబోతోంది: నాని

twitter-iconwatsapp-iconfb-icon
సాయిపల్లవి భుజాలపైనే బరువు ఎక్కువగా ఉండబోతోంది: నాని

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో నాని మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగరాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కథలో దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమాకు అన్నిరకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగరాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం. ఏవో సెట్లు వేసాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. క్యాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ప్రతీ రోజూ రెండొందల మంది ఉండేవారు. వారికి కూడా స్పెషల్ క్యాస్టూమ్స్ డిజైన్ చేశారు. కథ చెప్పిన వెంటనే పాత్రలోకి లీనమయ్యాను. దీనికి గనుక కరెక్ట్ టీమ్ పడితే అదిరిపోతుందని తెలుసు. దాదాపు ఐదు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు పకడ్భందీగా చేశారు. ఇందులో డైరెక్టర్‌గా పని చేశాను. నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ వాసుకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలను మాత్రం ఇందులో చూపించలేదు. ఎంటర్టైనింగ్‌గానే చూపించాం.

సాయిపల్లవి భుజాలపైనే బరువు ఎక్కువగా ఉండబోతోంది: నాని

కమల్ హాసన్ ‘నాయకుడు’ సినిమాకి.. ఈ సినిమాకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ కమల్‌గారి అభిమానిని కావడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు. ఇందులో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని ఎపిసోడ్స్‌లా చూడటం నాకు నచ్చదు. కానీ అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతంగా ఉంటాయి. అవి స్టోరీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. బెంగాలీలో షూట్ చేసిన సమయంలో అక్కడి వ్యక్తే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండేవారు. మాట తీరు, పలికే విధానంలో ఎంతో తేడా ఉంటుంది. శ్యామ్ నాన్న బెంగాలీ, అమ్మ తెలుగు. శ్యామ్ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాడు. అక్కడక్కడా బెంగాలీ లేకపోతే ఆ అతేంటిసిటీ రాదు అని కొన్ని డైలాగ్స్ పెట్టాం.


‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్.. శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్‌ను అలా చూసి షాక్ అయ్యాను. అంతలా ఎప్పుడూ మాట్లాడలేదు. సెటిల్డ్‌గా ఉండే వారంతా కూడా వారి ఎనర్జీని అలా దాచుకుంటారేమో. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారతాడు అనేది సినిమా. శ్యామ్ సింగరాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం. ఇప్పుడు వరుసగా సినిమాలున్నాయి. ఈ సమయంలో కాస్త గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వరకే. ఆ తరువాత సినిమానే చూసుకుంటుంది. అయినా మాకు ఈ సినిమా ఎలా వచ్చిందో తెలుసు. ఎంతో నమ్మకంగా ఉన్నాం. ‘జెర్సీ’ తర్వాత నాకు ఎంతో సంతృప్తినిచ్చింది ‘శ్యామ్ సింగరాయ్’. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అలాంటి ఫీలింగే ఉంది.


నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. సినిమా కోసం పని చేసినవారంతా సంతోషంగా ఉండాలి. రెగ్యులర్‌గా పని చేస్తుండాలి. ఆ పనిని ఆపకూడదు. అది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు. నా కెరీర్‌లో ఏ సినిమా చేసినా.. అప్పటి వరకు అదే హయ్యస్ట్ బడ్జెట్. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్. ఆ తర్వాత దసరా. ఇలా ప్రతీ ఒక్కటి ఆ సమయానికి హయ్యస్ట్ బడ్జెట్ అవుతుంది. గ్రోత్ అలా పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు మార్నింగ్ షోకు నేను అనుకున్న టాక్ వస్తే ఎవ్వరూ ఆపలేరు.

కృతి శెట్టి చాలా కొత్త. కానీ నేర్చుకోవాలనే తపన ఉంది. ప్రతీ విషయాన్ని రాహుల్‌ని, నన్ను అడుగుతూ ఉండేది. అలాంటి క్వాలిటీ ఉండటం చాలా మంచిది. ఎంసీఏకి, ఇప్పటికీ సాయి పల్లవి అలానే ఉంటుంది. అందులో ఓ నాలుగు సీన్లుంటాయి. మా సీన్లు అందరికీ కనెక్ట్ అయ్యాయి. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇంటెన్సిటీ, పర్ఫామెన్స్ వంటివి నమ్మేవాళ్లం. ఇంకోసారి కలిసి సినిమా చేస్తే ఈ ప్రపంచానికి దూరంగా ఉండే పాత్రలు రావాలని అనుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని అనుకున్నాం. అలా శ్యామ్ సింగ‌రాయ్‌తో రాబోతోన్నాం. ఇకపై మా బాధ్యత మరింత పెరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి భుజాల మీద బరువు ఎక్కువగా ఉండబోతోంది.


సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల గారు అన్నట్టుగా రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు. ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన శ్యామ్ సింగరాయ్‌కు రాయడం అనేది వరం. ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది.


ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు టచ్ చేయని కలర్, జానర్‌లో దసరా ఉంటుంది. తెలంగాణ వాళ్లు కూడా పలకలేని స్పష్టమైన యాసలో ఉంటుంది. మరీ పీరియడ్ కాదు కానీ.. ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్తాం..’’ అని తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement