నక్కలోళ్ల కోటకు ప్రకృతే రక్షణ

ABN , First Publish Date - 2021-06-19T05:57:37+05:30 IST

కరోనా భయంతో చుట్టుపక్కల గ్రామాల జనం జడుసుకుంటుంటే దానికి భిన్నంగా ఆ ఊరికి ప్రకృతే రక్షణ దుర్గమై నిలిచింది. కరోనాను ఆమడ దూరంలో వుంచుతోంది. అదే పెద్దమండ్యం మండలం గుర్రంవాండ్లపల్లె పంచాయతీ పరిధిలో నక్కలోళ్ళ కోటగా పిలువబడే నక్కలవారిపల్లె.

నక్కలోళ్ల కోటకు ప్రకృతే రక్షణ
నక్కలవారిపల్లె


కరోనాసోకని పల్లె... నక్కలవారిపల్లె


కరోనా భయంతో చుట్టుపక్కల గ్రామాల జనం జడుసుకుంటుంటే దానికి భిన్నంగా ఆ ఊరికి ప్రకృతే రక్షణ దుర్గమై నిలిచింది. కరోనాను ఆమడ దూరంలో వుంచుతోంది. అదే పెద్దమండ్యం మండలం గుర్రంవాండ్లపల్లె పంచాయతీ పరిధిలో నక్కలోళ్ళ కోటగా పిలువబడే నక్కలవారిపల్లె.

పెద్దమండ్యం: పచ్చటి, చిక్కటి అటవీ ప్రాంతంలో ప్రకృతి సహజసిద్ధ వాతావరణం నడుమ ఉన్న నక్కలవారిపల్లెలో వాల్మీకి (బోయ) సామాజికవర్గానికి చెందిన 50 కుటుంబాలు నివాసముంటున్నాయి. సుమారు 2 వందల జనాభా వున్న ఈ పల్లెలో ప్రత్యేకించి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. గ్రామస్తులు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే అటవీ ఉత్పత్తులే వుంటున్నాయి. దాదాపు ఏడాది పొడవునా రకరకాల సీజనల్‌ పళ్ళు ఇక్కడ లభిస్తాయి.  ఈత, సీతాఫలం, బిక్కి, ఉల్లింజ, నేరేడు, రేగి, పరికి వంటివి వీరు బాగా తింటారు. తేనె వాడకం కూడా ఎక్కువే. రాగి, సద్దలతో చేసే సంగటి, వేరుశెనగ గింజలతో చేసే చట్నీ, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటున్నారు. కూరల్లో కారం వినియోగం సైతం ఎక్కువే. మిగిలిన జనావాసాలకు దూరంగా వుండే జీవనశైలి, కష్టించే తత్వం, ఆహారపుటలవాట్లు వంటివే నక్కలోళ్ళకోట వాసులను కరోనాకు దూరంగా వుంచుతున్నాయి. కరోనా తొలి, మలి వేవ్‌లు రెండింటిలోనూ గ్రామంలో ఒక్కరికి కూడా వైరస్‌ సోకలేదు.




కరోనా గురించి తెలీదు


రాగులు, సద్దలతో సంగటి తినేది మా పెద్దల కాలం నుంచీ వుంది. అట్లా తిండి తినబట్టే ఊళ్ళో నూరేండ్లు దాటినా ఇంకా చాలామంది గట్టిగా వుండారు. ఇప్పటికీ ఇండ్లలో పనులు చేసుకుంటావుండారు. కరోనా గురించి వాళ్ళూ వీళ్ళూ చెప్పేది వింటావుండా... కానీ మా ఊళ్ళో అయితే ఎవరికీ రాలేదు.

-మల్లయ్య

Updated Date - 2021-06-19T05:57:37+05:30 IST