పొరుగు మద్యం ప్రవాహం

ABN , First Publish Date - 2022-08-07T09:46:13+05:30 IST

పొరుగు మద్యం రాష్ట్రంలో ప్రవహిస్తూనే ఉంది. తెలంగాణ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వస్తోన్న మద్యం వరదకు అడ్డుకట్ట పడట్లేదు.

పొరుగు మద్యం ప్రవాహం

  • రాష్ట్రంలో నాటు సారా తయారీ కూడా జోరు
  • అడ్డుకట్ట వేసే సెబ్‌కు సిబ్బంది కొరత
  • రోజుకు 33 కేసులు.. 39 మందికి సంకెళ్లు
  • తప్పుచేస్తే జైలుకే: సెబ్‌ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పొరుగు మద్యం రాష్ట్రంలో ప్రవహిస్తూనే ఉంది. తెలంగాణ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వస్తోన్న మద్యం వరదకు అడ్డుకట్ట పడట్లేదు. దేశంలో ఎవ్వరికీ తెలియని బ్రాండ్లు మాత్రమే జగనన్న ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో లభించడం, ధరలు ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ ఉండటంతో స్మగ్లర్లు అక్రమ దిగుమతి ఆపట్లేదు. మద్యం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసే సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) సిబ్బంది కొరత కూడా పొరుగుమద్యం ప్రవాహానికి కారణమవుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తగ్గిపోవడం, ఎస్‌పీవోలను ఇంటికి పంపడం, ఇద్దరు డీఐజీల్లో ఒకరిని ఏసీబీకి బదిలీ చేయడం, సెబ్‌ కమిషనర్‌ బాధ్యతలు శాంతి భద్రతల ఏడీజీకి అదనంగా అప్పగించడంతో పొరుగు మద్యం జోరుకు అడ్డుకట్ట పడటం లేదు. గత వారం రోజులుగా సెబ్‌ అధికారులు పట్టుకున్న మద్యం, అరెస్టుల జాబితా చూస్తోంటే స్మగ్లింగ్‌ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు మొత్తం 235 కేసులు నమోదవగా, 270 మందిని అరెస్టు చేశారు. సరాసరి రోజుకు 33 కేసులు నమోదవుతుండగా, రోజుకు 39 మంది మద్యం స్మగ్లర్లను జైలుకు పంపుతున్నారు. 


జీతాలు అడిగారని తొలగింపు..

ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి వింత వింత పేర్లతో నాసిరకం మద్యం అమ్ముతుండటంతో తమకు కావాల్సిన బ్రాండ్లు లభించడం లేదంటూ మందు బాబులు పొరుగు రాష్ట్రాల వైపు మళ్లారు. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకోడానికి రూ.20 మద్యం బాటిల్‌ను ఏకంగా రూ.200కు పెంచడంతో స్మగ్లర్లు భారీగా పుట్టుకొచ్చారు. ఆ తీవ్రతను గుర్తించిన పోలీసుశాఖ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో సెబ్‌ రూపుదిద్దుకుంది. ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో జిల్లాల్లో అడిషనల్‌ ఎస్పీల పర్యవేక్షణలో పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బందితోపాటు స్పెషల్‌ పోలీస్‌ పేరుతో మాజీ సైనికులు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను సెబ్‌లో నియమించారు. మొదటి ఏడాది జీతాలు చెల్లించిన ప్రభుత్వం రెండో ఏడాది ఎస్‌పీవోలకు జీతాలు చెల్లించలేదు. జీతాల కోసం గట్టిగా అడగడంతో రోడ్డెక్కుతామని హెచ్చరించడంతో వారందరినీ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసేసింది. ఇదే సమయంలో సెబ్‌ బలాన్ని అన్నివిధాలా తగ్గించడంతో పొరుగు మద్యం స్మగ్లింగ్‌తోపాటు రాష్ట్రంలో నాటుసారా తయారీ కూడా పెరిగింది.


రూ.కోట్ల మద్యం ధ్వంసం చేసినా..

రెండేళ్లుగా రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుబడ్డ కోట్లాది రూపాయల పొరుగు మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేసినా స్మగ్లర్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. విజయవాడలో పోలీసులు ఇటీవల భారీగా మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన దృశ్యాలు టీవీల్లో చూసిన  ప్రజలు దక్షిణాది రాష్ట్రాల నుంచి బ్రాందీ, విస్కీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి అక్రమంగా వస్తోందా? అంటూ ఆశ్చర్యపోయారు. కర్నూలు పోలీసులూ భారీగా స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలపై రోడ్డు రోలర్‌ ఎక్కించారు. గత వారం రోజుల్లోనే సెబ్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16,590 లీటర్ల ఊట నాశనం చేసి 2,110 లీటర్ల నాటుసారా, 610 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


గంజాయి కూడా జోరు..

రాష్ట్రంలో గంజాయి విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. విశాఖపట్నం మన్యంలోనిగంజాయికి దేశవ్యాప్తంగా గిరాకీ ఉండటంతో స్మగ్లర్లు ఇక్కడి గిరిజనులకు గంజాయి విత్తనాలు, నగదు అడ్వాన్స్‌ ఇచ్చి మరీ సాగు చేయిస్తున్నారు. సీజన్‌లో ఎంత ధ్వంసం చేసినా ఏడాదిపొడవునా గంజాయి సరఫరా అవుతూనే ఉందంటే ఏ స్థాయిలో ఇక్కడ సాగు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా గంజాయి తరలిస్తూ, విక్రయిస్తూ 52 మంది పట్టుబడ్డారు. వారిపై 18 కేసులు నమోదు చేసి 11 వాహనాలు సీజ్‌ చేసినట్లు సెబ్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ సరఫరాను నిరోధించేందుకు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నామని, పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. తప్పు చేస్తే జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు.  

Updated Date - 2022-08-07T09:46:13+05:30 IST