'నాట్స్' అధ్యక్షుడిగా అనితర సాధ్యమైన సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-08-08T16:30:30+05:30 IST

సేవాకార్యక్రమాల్లో ఏ తెలుగు సంఘం చేయనన్ని కార్యక్రమాలు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఈ రెండేళ్లలో చేసి చూపించారు. నాట్స్ అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మంచికలపూడి.. తాను ఓ సేవా శ్రామికుడిగా నిరంతరం నాట్స్ గురించి ఆలోచిస్తూ నాట్స్ ఉన్నతిని పెంచేందుకు కృషి చేశారు.

'నాట్స్' అధ్యక్షుడిగా అనితర సాధ్యమైన సేవా కార్యక్రమాలు

రెండేళ్లలో శ్రీనివాస మంచికలపూడి సరికొత్త రికార్డులు

సేవాకార్యక్రమాల్లో ఏ తెలుగు సంఘం చేయనన్ని కార్యక్రమాలు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఈ రెండేళ్లలో చేసి చూపించారు. నాట్స్ అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మంచికలపూడి.. తాను ఓ సేవా శ్రామికుడిగా నిరంతరం నాట్స్ గురించి ఆలోచిస్తూ నాట్స్ ఉన్నతిని పెంచేందుకు కృషి చేశారు. ఈ రెండేళ్లలో అనేక సేవా కార్యక్రమాలతో అనితర సాధ్యమైన విజయాలు సాధించి నాట్స్ ఖ్యాతిని పెంచారు. గత 15 సంవత్సరాలుగా సెయింట్ లూయిస్ లో ఉంటూ స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సెయింట్ లూయిస్ నుండి డా. సుధీర్ అట్లూరి గారి ద్వారా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించటంలో మంచికలపూడి ఎంతో చొరవ చూపించారు.



2012లో సెయింట్ లూయిస్ నాట్స్ విభాగం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్ మంచికలపూడి అక్కడ నుంచి అంచెలంచెలుగా  నాట్స్‌లో అధ్యక్ష స్థాయికి ఎదిగారు. తొలినాళ్లలో నాట్స్ నాయకులు రవీంద్ర మాదాల, మోహనకృష్ణ మన్నవల తోడ్పాటు, ప్రోత్సాహంతో సెయింట్ లూయిస్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా అనేక కార్యక్రమాలను శ్రీనివాస్ మంచికలపూడి చేపట్టడంతో అనతి కాలంలోనే ఆయనకు నాట్స్.. కార్య నిర్వాకహ కమిటీలో స్థానం కల్పించింది. నాట్స్ జాయింట్ ట్రెజరర్‌గా సేవలు అందించిన ఆయన తనకు నాట్స్ ఏ బాధ్యతలు అప్పగించిన వాటిని దిగ్విజయంగా పూర్తి చేసేవారు. దీంతో రెండేళ్ల క్రితం నాట్స్ ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అధ్యక్ష పదవి అంటే అలంకారం కాదు అది బాధ్యత అని భావించిన శ్రీనివాస్ మంచికలపూడి ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు అహర్నిశలు ఈ రెండేళ్లు చేసిన కృషి నాట్స్ ఉన్నతిని రెట్టింపు చేసింది. 




గతంలో ఏనాడు ఏ తెలుగు సంఘం చేపట్టనన్నీ కార్యక్రమాలు ఈ రెండేళ్లలో జరిగాయి. నాట్స్ ఫుడ్ డ్రైవ్‌ను భారీ ఎత్తున చేపట్టి అమెరికాలో  ప్రతి నాట్స్ చాప్టర్‌ను ఉత్తేజపరిచారు. అందరిని సమన్వయ పరుచుకుంటూ ఫుడ్ డ్రైవ్ ద్వారా వేలాదిమంది పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా శరవేగంగా స్పందించి వారికి సాయం అందించడంలో ముందున్నారు. అటు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అది కూడా సరికొత్తగా చేపట్టడంతో నాట్స్ ప్రతిష్ఠ మరింత ఇనుమడించింది. గుంటూరు స్వచ్ఛ ఆరోగ్య ర్యాలీలతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహాన కల్పించారు. తీత్లీ తుఫాన్ బాధితులకుఅండగా నిలిచేందుకు తుఫాన్ వేగంతో స్పందించారు. వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించేందుకు కృషి చేశారు. 




తెలుగు విద్యార్ధుల విద్యా పునాదులు బలంగా ఉండాలని నమ్మే శ్రీనివాస్ మంచికలపూడి తెలుగునాట  ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నాట్స్ ద్వారా ఆయన చేసిన కృషి మరువలేనిది. కొన్ని ప్రభుత్వ బడుల దత్తతతో పాటు.. విద్యార్ధుల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచేందుకు రోబోజ్ఞాన్  పేరుతో రోబోటెక్‌పై అవగాహాన కల్పించారు. విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సాహించేందుకు ప్రభుత్వ బడుల్లో క్రీడా సామాగ్రిని అందించారు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్లెల్లో వారి దాహార్తిని తీర్చేందుకు నాట్స్ ద్వారా తాగునీటి పథకాలకు సాయం చేశారు. ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితనీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలి... అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని నమ్మే శ్రీనివాస్ మంచికలపూడి పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లపై శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందించారు. జన్మభూమి లాంటి తన సొంత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చించారు.




ఇక కీలకమైన కరోనా సమయంలో నాట్స్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ మంచికలపూడి స్పందించిన తీరు అమోఘమనే చెప్పాలి. నాట్స్ చాఫ్టర్‌ను కరోనా పట్ల అప్రమత్తం చేసి... వెబినార్స్ ద్వారా కరోనాపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. యోగా, ప్రాణాయమంపై అవగాహన,  ప్రముఖ వైద్యులచే కరోనా పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై దిశా నిర్థేశం చేయించడంలో కూడా శ్రీనివాస్ మంచికలపూడి ప్రముఖ పాత్ర పోషించారు. ఇక తెలుగునాట కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు శరవేగంగా స్పందించారు. ఎక్కడ ఎవరు తమకు సాయంకావాలని అడిగినా.. వారికి నేరుగా సాయం అందేలా పక్కా ప్రణాళికతో నిత్యావసరాలు అందించారు. కొన్ని చోట్ల వండిన ఆహారాన్ని కూడా నేరుగా పంచిపెట్టి.. కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. అర్చకుల నుంచి వలస కూలీల వరకు  అందరి ఆకలి తీర్చేందుకు శ్రీనివాస్ మంచికలపూడి నాట్స్ అధ్యక్షుడిగా.. ఓ మానవతావాదిగా స్పందించి తన వంతు కృషి చేశారు.తానొక్కడే కాకుండా మిగతా నాట్స్ విభాగాలను కూడా ఉత్సాహపరిచి  కరోనా ప్రభావ బాధితులను ఆదుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 




అటు అమెరికాలో కూడా కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు తనవంతు కృషి చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరూ పస్తులతో పడుకోకూడదనే లక్ష్యంతో శ్రీనివాస్ మంచికలపూడి పనిచేశారు. ఇదే నాట్స్ ప్రతిష్టను మరింత పెంచేలాచేసింది. వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నారు గురజాడ అలానే  శ్రీనివాస్ మంచికలపూడి కూడా మాటలు కంటేచేతల్లోనే ఆయన తన సేవాభావాన్ని, నాయకత్వ పటిమనుచూపించారు. తన పదవి కాలం చివరి రోజు  వరకు ఆయన ఏదో ఒక సేవా కార్యక్రమంతో నాట్స్ ఉన్నతిని పెంచేందుకు కృషి చేస్తూనే వచ్చారు. ఇదే ఇప్పుడు నాట్స్‌లో కొత్త నాయకులకు కూడా స్ఫూర్తినిస్తోంది.

Updated Date - 2020-08-08T16:30:30+05:30 IST