అనంతపురంలో 500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం

ABN , First Publish Date - 2020-06-05T05:00:30+05:30 IST

అమెరికాలో తెలుగు వారికి అండగా ఉంటున్న నాట్స్.. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సహాయం చేస్తూనే ఉంది

అనంతపురంలో 500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం

అమరావతి: అమెరికాలో తెలుగు వారికి అండగా ఉంటున్న నాట్స్.. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సహాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అనంతపురంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలను నాట్స్ ఆదుకుంది. నగరంలోని కంకర క్వారీలోని కార్మికులు ఉపాధి కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చేశారు. దీంతో స్థానిక నాయకులు నాట్స్ సంస్థ ఆధ్వర్యంలో 500 కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కాగా.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికుల ఇబ్బందులు తెలుసుకుని వారికి సహాయం అందించడానికి ముందుకు వచ్చిన నాట్స్ సంస్థకు, నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరికి స్థానిక నేతలు మణి, సరస్వతి, శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదల ఇబ్బందుల గురించి తమ దృష్టికి వస్తే తగిన సహాయం చేస్తున్నామని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. 


Updated Date - 2020-06-05T05:00:30+05:30 IST