నాట్స్ వెబినార్ ద్వారా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-06-01T09:18:44+05:30 IST

తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత నందమూరి తారక రాముడి జయంతి ఉత్సవాలను

నాట్స్ వెబినార్ ద్వారా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

  • తెలుగుజాతి స్పూర్తి దాతకు ఘన నివాళులు

ఫిలడెల్ఫియా: తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత నందమూరి తారక రాముడి జయంతి ఉత్సవాలను ఈ సారి నాట్స్ వినూత్నంగా నిర్వహించింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉండటంతో ఈసారి వెబినార్ ద్వారా ఈ వేడుకలను నిర్వహించింది. ఎన్టీఆర్ పాటలు, మాటలను, ఆయనతో తమకున్న అనుభవాలను గుర్తు చేస్తూ అనేక మంది సినీ కళాకారులు, గాయకులను వెబినార్ ద్వారా కనెక్ట్ చేసింది. వారి అనుభవాలను, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఈ వెబినార్ ద్వారా చాటి చెప్పే ప్రయత్నం చేసింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ శ్రీథర్ అప్పసాని నేతృత్వంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నాట్స్ ఈ సారి ఇలా వినూత్నంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంది. అనేక మంది ఫేస్‌బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ జయంతి వేడుకలను వీక్షించారు. ప్రముఖ సినీ నటులు సాయకుమార్, దర్శకులు వై.వి.ఎస్ చౌదరి, సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, గాయకులు మనో, ప్రవీణ్, గాయకురాలు కౌసల్య, స్వాతి తదితరులు ఈ జయంతి వేడుకలకు వెబినార్ ద్వారా పాల్గొని ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని మరోసారి అందరికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. 


ఎన్టీఆర్ నటుడిగా ఆయన ఎంతటి గొప్పవాడు.. ఆయనకు నటన మీద ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఎలాంటిదనే దానిపై సాయికుమార్ తనకున్న అనుభవాలను వివరించారు. వృత్తి పట్ల అంకితభావం ఎలా ఉండాలనేది ఎన్టీఆర్‌ను చూసి తాము నేర్చుకున్నామని తెలిపారు. అలాగే తనకు ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం.. ఆయన తన పాత్రల్లో ఎలా జీవించేవారు అనేది దర్శకులు వై.వి.ఎస్ చౌదరి వివరించారు. నాట్స్ ఇలాంటి కార్యక్రమం పెట్టి ఆ మహానీయుడిని స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోని పాటలను మనో, ప్రవీణ్, కౌసల్య, స్వాతిలు పాడి ఆనాటి రోజులను గుర్తు చేశారు. ఎన్టీఆర్ అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారని నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ అన్నారు. ఒక వ్యక్తి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు వేసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని.. అలాగే రాజకీయాల్లో కూడా తానేంటో నిరూపించి తెలుగుజాతి ఆరాధ్యదైవంగా నిలిచారన్నారు.


ఎన్టీఆర్ తెలుగుజాతికి స్ఫూర్తి అని నాట్స్ బోర్డు చైర్మన్ శ్రీథర్ అప్పసాని తెలిపారు. ఆయనను స్మరించుకోవడం తెలుగుజాతి బాధ్యత అని.. అందుకే నాట్స్ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సారి పరిస్థితులు అనుకూలించపోవడంతో వెబినార్ ద్వారా నిర్వహించి ఆ లోటును తీర్చే ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్టీఆర్‌ అంచెలంచెలుగా ఎదిగిన తీరు.. ఆయన కష్టపడిన వైనం జీవితంలో ఎదగాలనుకునే వారికి స్ఫూర్తిని నింపుతుందని.. ఇదే విషయాన్ని చాటిచెప్పేందుకు తాము ఎన్టీఆర్ జయంతి వేడుకను నిర్వహిస్తున్నామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. కాగా.. ఎంతో మంది ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జెమిని సురేష్ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. సినీ కళాకారులంతా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాట్స్‌ను పలువురు అభినందించారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ కిశోర్ కంచర్ల కళాకారులందరిని సమన్వయ పరిచి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ మహామనిషని, ఆయన ఎందరో యువతకు ఆదర్శం అని కిషోర్ కంచర్ల తెలిపారు. ఈ సందర్భంగా  నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి ఒక సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ.. నాట్స్ భాషే రమ్యం అంటూ త్వరలో మరిన్ని భాషా పరమైన కార్యక్రమాలు వెబినార్స్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా.. నాట్స్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నే, ఎన్.ఆర్.ఐ. స్ట్రీమ్స్ ఈ వెబినార్‌కు తెర వెనుక సహాయ సహకారాలు అందించారు.

Updated Date - 2020-06-01T09:18:44+05:30 IST