వైద్యరంగాన్ని జాతీయం చేయాలి

ABN , First Publish Date - 2020-04-11T06:13:45+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించడానికి ప్రధాన కారణం ప్రపంచీకరణే. ప్రపంచీకరణలో భాగంగా హద్దులు లేని వ్యాపారాలు, వ్యవహారాలు కొనసాగుతున్నాయి, ప్రకృతి విధ్వంసాలూ జరుగుతున్నాయి.

వైద్యరంగాన్ని జాతీయం చేయాలి

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించడానికి ప్రధాన కారణం ప్రపంచీకరణే. ప్రపంచీకరణలో భాగంగా హద్దులు లేని వ్యాపారాలు, వ్యవహారాలు కొనసాగుతున్నాయి, ప్రకృతి విధ్వంసాలూ జరుగుతున్నాయి. ప్రస్తుత వైరస్ వ్యాప్తి వీటిలో భాగమే. దానికి తోడు వైద్య రంగం కార్పొరేటీకరణ చెంది ప్రజారోగ్యం ప్రశ్నార్థకమైనందునే అగ్రరాజ్యాలు సైతం విపత్తును ఎదుర్కోలేకపోతున్నాయి. చైనా, రష్యా, క్యూబా, దక్షిణ కొరియా దేశాల్లో వైద్యం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్నందున అక్కడ కోవిడ్ 19ను నియంత్రించగలుగుతున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్లలో వైద్యం ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది. కొన్ని దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్నా, ప్రైవేటు, కార్పొరేట్లదే అధిపత్యం. 


మన దేశంలో మెజారిటీ వైద్యరంగం ప్రైవేటు చేతిలో ఉన్నది. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను నిర్లక్ష్యం చేసి, సరైన నిధులు, నియామకాలు, వసతులు కల్పించకుండా పరోక్షంగా ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించాం. ఆపత్కాలంలో అది మనలను ఆదుకోలేకపోతున్నది.

క్యూబాలో సగటున 25 మందికి ఒక డాక్టర్ ఉండగా, యూరోప్, అమెరికా, తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సగటున 50 మందికి ఒక డాక్టర్ దాదాపు అదే నిష్పత్తిలో హాస్పిటల్స్, బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రధాన ఎజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రజలకు వైద్య సదుపాయం కూడా వెంటనే లభిస్తే ప్రాణనష్టం లేకుండా చేయగలం. అందుకని, దేశంలో ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు, వైద్య కళాశాలలను జాతీయం చేస్తే సత్వర వైద్యం అందించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించగలం. కనీసం, ప్రస్తుత ఉపద్రవం నుండి దేశం విముక్తి పొందే వరకైనా ప్రైవేట్ రంగంలోని అన్ని రకాలైన వైద్య వ్యవస్థలను జాతీయం చేయడం ఉత్తమ చర్య. గతంలో ఇందిరా గాంధీ సాహసోపేతంగా వ్యవహరించి బ్యాంకులను జాతీయం చేసి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా వైద్య, విద్యా రంగాలు ప్రభుత్వాధీనంలో ఉండాలని ప్రతిపాదించారు. అందుకని, వైద్య రంగాన్ని జాతీయం చేస్తే ప్రస్తుత సంక్షోభాన్నే కాదు, భావి ఆరోగ్య విపత్తులనూ ఎదుర్కోగలం.


– పి. రమేష్ చందర్, వరంగల్‌

Updated Date - 2020-04-11T06:13:45+05:30 IST