జాతీయవాది మోదీ.. 30 ఏళ్లు ఆయనే ప్రధాని

ABN , First Publish Date - 2022-05-09T08:41:55+05:30 IST

జాతీయ నేత అనే మాటకు అసలైన ప్రతీక మోదీ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

జాతీయవాది మోదీ.. 30 ఏళ్లు ఆయనే ప్రధాని

మోదీపై బీజేపీ పుస్తకంలో అమిత్‌షా వ్యాఖ్యలు 


న్యూఢిల్లీ, మే 8: జాతీయ నేత అనే మాటకు అసలైన ప్రతీక మోదీ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ‘‘రెండు, మూడు సీట్లు తమ పార్టీకి సంపాదించడం తప్ప అదనంగా వేరే ప్రతిభ లేని వారికీ ఈ పదబంధం గతంలో వినియోగించారు. జాతీయోద్యమంలో పాల్గొని అన్ని ప్రాం తాల్లో పేరు ప్రముఖంగా వినిపించిన నాయకులనూ స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో జాతీయ నాయకులుగా గుర్తించారు. అయితే.. అనంతరకాలంలో, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయాల యుగంలో ఈ మాట ఎక్కువగా దుర్వినియోగమైంది. ఢిల్లీ మీడియా తన మిత్రులు, శ్రేయోభిలాషులకు జాతీయ నాయకుల హోదాను ఉదారంగా ప్రదానం చేసింది’’ అని వ్యాఖ్యానించారు. ‘మోదీ ఎట్‌ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ పేరిట బీజేపీ వెలువరిస్తు న్న పుస్తకంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. 3 దశాబ్దాల తర్వాత తొలిసారి ఒక పార్టీ పూర్తి మెజారిటీ సాధించిందని, అది మోదీ వల్లే సాధ్యపడిందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మోదీ 3 దశాబ్దాలపాటు ప్రధానిగా కొనసాగుతారన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ‘రూపా’ ముద్రించిన ఈ పుస్తకం ఈ నెల 11వ తేదీన మార్కెట్‌లోకి రానుంది.

Read more