ఏడేళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-09-29T10:41:19+05:30 IST

ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలకు గురువారం తెరలేస్తోంది. గుజరాత్‌లోని ఏడు నగరాలు.. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌,

ఏడేళ్ల తర్వాత..

నేటినుంచి జాతీయ క్రీడలు

గుజరాత్‌లోని ఏడు నగరాల్లో నిర్వహణ


అహ్మదాబాద్‌: ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలకు గురువారం తెరలేస్తోంది. గుజరాత్‌లోని ఏడు నగరాలు.. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌, భావనగర్‌ వేదికల్లో క్రీడలు జరగనున్నాయి. ట్రాక్‌ సైక్లింగ్‌ పోటీలను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండడంతో గుజరాత్‌ భారీ ఏర్పాట్లు చేసింది. వాస్తవంగా 36వ జాతీయ క్రీడలు 2020లో గోవాలో జరగాల్సి ఉన్నాయి. అయితే కొవిడ్‌తో వాయిదా పడ్డాయి. కాగా, తాజా టోర్నీకి సంబంధించి కొన్ని క్రీడల్లో పోటీలు ఇప్పటికే మొదల య్యాయి. కానీ, అధికారికంగా గురువారం టోర్నమెంట్‌ మొదలు కానుంది. ప్రారంభోత్సవ వేడుకలు సాయంత్రం నుంచి జరుగుతాయి. వచ్చేనెల 12న ఈ క్రీడలు ముగుస్తాయి. 


1924లో తొలిసారి..: తొలి జాతీయ క్రీడలను భారత్‌ విడిపోకముందు 1924లో లాహోర్‌లో నిర్వహించారు. 1938 వరకు ఈ క్రీడలను భారత్‌ ఒలింపిక్స్‌గా పిలిచారు. చివరిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. ఆ టోర్నీలో సర్వీసెస్‌ జట్టు 81 పసిడి (మొత్తం 159 పతకాలు) పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. కేరళ, హరియాణా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. కాగా, ఈసారి క్రీడల్లో 36 అంశాల్లో పోటీలు జరగనున్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి  ఒలింపియన్లు, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారు సహా 7వేలమందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఖోఖో, యోగాసన, మల్లఖంబ్‌ అంశాలు ఈమారు అరంగేట్రం చేస్తున్నాయి. ఈనెల 30 నుంచి చైనాలో టేబుల్‌ టెన్నిస్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప జరగనుండంతో.. వాటికి అడ్డులేకుండా జాతీయ క్రీడల్లో టీటీ పోటీలను ముందుగానే నిర్వహించారు. గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఒలింపియన్లు నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్‌ పూనియా క్రీడలకు దూరంగా ఉన్నారు. 


స్టార్‌ అట్రాక్షన్‌: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌, బాక్సర్‌ లవ్లీనా ఈ గేమ్స్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్విమ్మర్‌ శ్రీహరి నటరాజన్‌తోపాటు జాతీయ రికార్డు హోల్డర్లు ద్యూతీచంద్‌ (100 మీ. పరుగు), తెలుగు రన్నర్‌ జ్యోతి యర్రాజీ (100మీ. హర్డిల్‌), హిమాదాస్‌ (400మీ.), మురళీశంకర్‌ (లాంగ్‌జంప్‌), అన్నూరాణి (జావెలిన్‌ త్రో)పై కూడా అందరి దృష్టి నిలిచింది. బ్యాడ్మింటన్‌లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ అలరించనున్నారు.

 

డీడీ స్పోర్ట్స్‌లో..: జాతీయ క్రీడలను డీడీ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ప్రసార భారతి స్పోర్ట్స్‌ యూట్యూబ్‌ చానెల్‌లో లైవ్‌స్ర్టీమింగ్‌, హైలైట్లు ఉంటాయి. 

Updated Date - 2022-09-29T10:41:19+05:30 IST