ఇంటింటా జాతీయ జెండా

ABN , First Publish Date - 2022-08-12T05:42:47+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా గురువారం పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పండుగ నిర్వహించారు.

ఇంటింటా జాతీయ జెండా
గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న బుద్ధా వెంకన్న, గౌతు శిరీష, టీడీపీ నాయకులు

దేశభక్తి నినాదంతో కదలిన తెలుగుదండు
పలాస-కాశీబుగ్గలో భారీ ర్యాలీ
పలాస, ఆగస్టు 11:
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా గురువారం పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పండుగ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జాతీయ పతాకాలు పట్టుకొని కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మాగాంధీ, సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాలతో పాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని, నాటి త్యాగధనులు పోరాట ఫలితంగా ఏర్పడిన దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సర్దార్‌ గౌతు లచ్చన్న త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిన్నతనంలోనే బ్రిటీష్‌ వారికి ఎదురొడ్డి జైలు పాలయ్యారని, అనంతరం వందలాది మంది ప్రజలతో మద్రాసు వరకు పాదయాత్ర చేసి చరిత్రకెక్కిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గౌతు శిరీష మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులను గుర్తుచేసుకోవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, డీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, పార్లమెం టరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్‌గుప్తా, జోగ మల్లేశ్వరరావు, డొక్కర శంకర్‌, దడియాల నర్సింహులు, లక్ష్మణ్‌, జీకే నాయుడు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-12T05:42:47+05:30 IST