అందరికీ విద్యావకాశాలు కల్పించడమే ‘విలీన విద్య’.. TET ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-05-13T22:03:40+05:30 IST

మన దేశంలో సమ్మిళిత విద్య అనే భావనను 1986 జాతీయ విద్య విధానం(National education policy)లో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాల(School)లో సమ్మిళిత విద్య అందించాలని నిర్ణయించారు.

అందరికీ విద్యావకాశాలు కల్పించడమే ‘విలీన విద్య’.. TET ప్రత్యేకం!

మన దేశంలో సమ్మిళిత విద్య అనే భావనను 1986 జాతీయ విద్య విధానం(National education policy)లో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాల(School)లో సమ్మిళిత విద్య అందించాలని నిర్ణయించారు.


ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య 

సాధారణ విద్యార్థులు సహా సగటు విద్యార్థుల నుంచి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపరచి బోధించే విద్యను ‘ప్రత్యేక విద్య’ అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారు. వీరి అభిరుచులు, శక్తి సామర్థ్యాలు, లక్షణాలు భిన్నంగా ఉంటాయి. వీరికి విద్య సంబంధిత అవసరాలు తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి, సాంఘికీకరణకు తోడ్పడి పునరావాసం కల్పించేందుకు దోహదం చేసే విద్యను ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య’ అంటారు. దీని అధ్యయనంలో భాగంగా కొన్ని ప్రత్యేక పదాల గురించి తెలుసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1976లో ఈ పదాలను నిర్వచించింది.


సహిత విద్య నిర్వచనాలు - భావనలు

  • ప్రతి పిల్లవానిని ఒక అభ్యాసకునిగా గుర్తించి  జాతి, కుల, వర్ణ, మత, వర్గ, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా వారి శారీరక జ్ఞానాత్మక, సాంఘిక, ఉద్వేగ, భాషాపరమైన భేదాలను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ పాఠశాలలో విద్యను అందించడమే ‘విలీన విద్య’. 
  • పిల్లల వ్యక్తిగత అడ్డంకులు, వైకల్యాలతో సంబంధం లేకుండా  అందరికీ విద్యావకాశాలు కల్పించడమే ‘విలీన విద్య’.
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, లింగ వివక్షతకు గురైన బాలికలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు సాధారణ పాఠశాలలోనే వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించి కనీస అవసరాలు తీర్చుకొనే విధంగా విద్యను అందించడమే విలీన విద్య. 
  • సమ్మిళిత విద్య విధానాలు, వాటి ప్రక్రియలను త్వరితగతిన కొనసాగించేందుకు గాను 1994లో ప్రపంచ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు నివేదికలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సహా పిల్లలందరికీ అనువుగా ఉండేలా సాధారణ పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు. 
  • యునెస్కో అభిప్రాయం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో భాగస్వాములను చేసేందుకు వారి విభిన్న అవసరాలను తీర్చేందుకు సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య. ఒకే వయసున్న పిల్లలందరి భావనలకు అనుగుణంగా సాధారణ పాఠశాలల్లో విద్యనందించేలా బోధన పద్ధతులు, విధానాలు మార్చాల్సి ఉంటుంది. 
  • మన దేశంలో సమ్మిళిత విద్య అనే భావనను 1986 జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్య అందించాలని నిర్ణయించారు 
  • సీఎస్‌ఐఈ ప్రకారం ‘సమ్మిళిత విద్య’ అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యంతో అభ్యసనాన్ని ప్రోత్సహించేది’.


సహిత విద్య ప్రయోజనాలు

  • విద్యార్థులకు తాము కూడా అందరితో సమానమనే భావన కల్గిస్తుంది. పాఠశాలలో మిగిలిన పిల్లలతో, ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహంగా ఉండటం నేర్పిస్తుంది. తోటి పిల్లలతో కలసి చదువుకోవడంతోపాటు తమ అభిప్రాయాలు తెలిపే ధైర్యాన్నిస్తుంది.
  • ఉపాధ్యాయులకు మానవ కుటుంబ వైవిధ్యాలను, ప్రత్యక్ష బోధన ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. విద్యార్థుల్లో ఉన్న విభిన్న శక్తియుక్తుల్ని గుర్తించేలా చేస్తుంది. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడం, జట్టు నైపుణ్యాలను పెంపొందించడం నేర్పిస్తుంది.
  • సమాజానికి పౌర హక్కుల విలువలు, సమానత్వ భావనల గురించి తెలియజేస్తుంది. సాంఘికీకరణ, జట్టుగా పనిచేసే నేర్పు, పరస్పర సహకారం వంటివి అలవాటు చేస్తుంది. సామాజిక శాంతికి తోడ్పడుతుంది. పిల్లలకు ప్రజాస్వామ్య ప్రక్రియపై చిన్నపాటి నమూనాను ఆవిష్కరిస్తుంది.


సమ్మిళిత విద్య - ప్రాముఖ్యం

  • ప్రతి విద్యార్థికీ చదువుకొనే హక్కు ఉంటుంది. చదవాల్సిన అవసరం కూడా ఉంది. సాధారణ పిల్లలతోపాటు వైవిద్య సామర్థ్యాలున్న వారిని ఒకే రకమైన పాఠశాలలకు ఆహ్వానించి రేపటి సమాజానికి ప్రతీకలుగా తయారు చేయాల్సి ఉంటుంది. 
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకంగా విద్యను అందించినపుడు వారి అవసరాలకు తగినట్లుగా బోధనభ్యసన ప్రక్రియలు చేపట్టినప్పటికీ భవిష్యత్‌ సమాజంలో మిగిలినవారితో కలసి జీవించడంలో సమస్యలు ఎదురు కావచ్చు. కానీ సమ్మిళిత విద్య కార్యక్రమాల్లో అందరూ కలసి ఉండటం వల్ల భవిష్యత్‌లో సర్దుబాటుకు దోహదం చేస్తుంది. 
  • సమ్మిళిత పాఠశాలలో కేవలం సాధారణ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకే కాకుండా సాంఘికంగా వెనకబడిన వర్గాల పిల్లలు, భాషా సమస్యలు గల పిల్లలు, లింగ వివక్షతకు గురవుతున్న పిల్లలు, అల్ప సంఖ్యాక వర్గాలు - అణచివేతకు గురవుతున్న పిల్లలందరికీ ఒకే విధమైన వనరులతో విద్య అందించాల్సి ఉంటుంది. దీనితో కొంతమంది వారి స్థాయిలో తృప్తి చెందక పాఠశాల నుంచి  నిష్క్రమించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి అభ్యాసకుడు విలక్షణమైనవాడిగా భావిస్తూ ఒత్తిడి లేకుండా స్వేచ్చగా అభ్యసనాన్ని కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత సమ్మిళిత పాఠశాలలపై ఉంది. స్నేహపూర్వక, విలీన అభ్యసన వాతావరణాన్ని ఏర్పరుస్తూ  పిల్లల వైవిద్య అవసరాలు తీర్చేలా బహుళ వనరులను కల్పించాలి. 


సహిత విద్య పరిధి

సమాజంలోని అన్ని రకాల సమూహాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం, వారి విద్యావసరాలను తీర్చడం అనేవి సహిత విద్య పరిధి కిందికి వస్తాయి. 


సమ్మిళిత విద్య లక్ష్యాలు

  • సమ్మిళిత విద్య అనేది ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే సమాజానికి చెందినవారిగా పరిగణిస్తారు.
  • ఎటువంటి వివక్ష ఉండదు. ఎవరినీ విద్యాపరిధి నుంచి దాటనివ్వరు. పిల్లలందరికీ ఒకేలా విద్యనందించేలా పాఠశాల సముదాయం పనిచేస్తుంది. 
  • పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది.
  • ఇది శిశు కేంద్రీకృత విద్య. పిల్లలు తమ అవసరాలను అనుసరించి పాఠ్యప్రణాళికను ఎన్నుకోవచ్చు. 
  • సమ్మిళిత విద్య.. కేవలం విద్యనే కాక భవిష్యత్తులో స్వతంత్రంగా జీవించే సామర్థ్యాలను అందిస్తుంది. 

సమ్మిళిత విద్య నమూనా

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మన దేశంలో పలు నమూనాల ద్వారా విద్య అందిస్తున్నారు. 

రిసోర్స్‌ నమూనా: సాధారణ పాఠశాలలోని ఎనిమిది నుంచి పది మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేకంగా పిల్లల విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించి విద్యని అందిస్తారు. ఈ నమూనాలో సాధారణ ఉపాధ్యాయునితోపాటు రిసోర్స్‌ టీచర్‌ ఉంటారు. 

ద్వంద్వ బోధన (డ్యూయల్‌ టీచింగ్‌ నమూనా): సాధారణ పాఠశాలలో పనిచేసే సాధారణ ఉపాధ్యాయుడికి నిర్ణీత కాలంలో ప్రత్యేక అవసరాల విద్య మీద శిక్షణ ఇచ్చి అతని చేతనే సాధారణ విద్యతోపాటు ప్రత్యేక అవసరాల విద్యని కూడా అందిస్తారు. ఈ నమూనాలో సాధారణ టీచర్‌, సాధారణ విద్యతోపాటు ప్రత్యేక విద్యను బోధిస్తారు. 

హోం  బేసిక్‌ ఎడ్యుకేషన్‌: తీవ్ర వైకల్యంతో పాఠశాలకు వచ్చే పరిస్థితిలో లేని పిల్లలకు ఉపాఽధ్యాయులే విద్యార్థి గృహానికి వెళ్లి విద్యని అందించడం ఈ నమూనా ఉద్దేశం

సంచార ఉపాధ్యాయుడు: ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని నియమించి అతని ద్వారానే ఆ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అందించడం 

ప్రత్యేక పాఠశాలలు: ఒకే రకమైన వైకల్యం ఉన్న పిల్లలని గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి విద్య అందించడం ఈ నమూనా ప్రత్యేకత. ఉదా: బధిరుల పాఠశాల, అంధుల పాఠశాల

ఆల్టర్నేటివ్‌ స్కూల్‌ మోడల్‌ (ప్రత్యామ్నాయ పాఠశాలలు): ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం

దూరవిద్య నమూనా: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూర విద్య కార్యక్రమాలు రూపొందించి విద్య అందించడం దీని ప్రత్యేకత. మన దేశంలో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో), మధ్యప్రదేశ్‌లోని భోజ్‌ విశ్వవిద్యాలయం ఈ నమూనా కిందికి వస్తాయి. ఇవి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందించి దూరవిద్య విధానాన్ని అనుసరిస్తున్నాయి. 


-తీగల జాన్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ

Read more