focus on 2024 Lok Sabha polls: 2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎవరి ధీమా వారిదే!

ABN , First Publish Date - 2022-09-23T23:23:48+05:30 IST

పూర్ణియా: 2024 పార్లమెంట్ ఎన్నికలకు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమౌతున్నాయి.

focus on 2024 Lok Sabha polls: 2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎవరి ధీమా వారిదే!

పూర్ణియా: 2024 పార్లమెంట్ ఎన్నికలకు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) సారధ్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ నేతలు యోచిస్తుంటే ఈసారి ఎలాగైనా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్‌ (National Democratic Alliance) కు చెక్ పెట్టాల్సిందేనని బీజేపీయేతర పార్టీల నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కూటములను బలోపేతం చేసే దిశగా యత్నాలు ముమ్మరం చేశారు. 


బీహార్ ముఖ్యమంత్రి (Chief Minister of Bihar), జేడియూ (Janata Dal United) అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) కూటమికి బైబై చెప్పి రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచీ ఉత్తరాదిన రాజకీయ సమీకరణాలు మారాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాట్నా వెళ్లి నితీశ్‌తో సమావేశమై వచ్చాక మార్పు ప్రస్ఫుటంగా కనపడటం ప్రారంభమైంది. నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్ నేత కుమారస్వామి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజాతో నితీశ్ ఇప్పటికే సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను కలుపుకుని పోవాలనేది నితీశ్, లాలూ యోచన. దీనికి మిగతా బీజేపీయేతర పార్టీల నేతల్లో చాలామంది సానుకూలత తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌ను కలుపుకుపోయే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్‌ను కలుపుకునే విషయంలో ఇబ్బందిలేదని నేతలకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. దక్షిణాదిలో కేసీఆర్, ఉత్తరాదిలో నితీశ్ బీజేపీయేతర కూటమిని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా ముమ్మర యత్నాలు చేస్తున్నారు. 


ఇది ఇలా ఉంటే బీజేపీ అగ్రనాయకత్వం కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నితీశ్ తమను వదిలేసి ఆర్జేడీ-కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పటినుంచీ బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నితీశ్ తమకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాక తొలిసారి బీహార్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) పూర్ణియా బహిరంగసభలో ప్రసంగించారు. ప్రధాని కావాలని కలలు కంటూ నితీశ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచారని షా ఆరోపించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో లాలూ, నితీశ్‌లకు ప్రజలు గుణపాఠం చెబుతారని, చిత్తుగా ఓడించబోతున్నారని షా జోస్యం చెప్పారు. అంతేకాదు 2025లో బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని షా చెప్పారు. తాను పూర్ణియాలో పర్యటిస్తుంటే లాలూ ప్రసాద్‌కు కడుపులో నొప్పివస్తోందని షా ఎద్దేవా చేశారు. జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పడినప్పటినుంచీ రాష్ట్రంలో తిరిగి జంగిల్ రాజ్ వచ్చేసిందన్నారు. బీహార్‌ ప్రభుత్వానికి భయపడవద్దని, కేంద్రంలో ఉన్నది మోదీ సర్కారని షా ప్రజలకు ధైర్యం చెప్పారు. నేడు బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ఒడిలో కూర్చున్న నితీశ్ రేపు లాలూకు కూడా వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ ఒడిలో కూర్చుంటారని షా సెటైర్ వేశారు. నితీశ్ గుడ్‌బై చెప్పడం తమకు మేలు చేయబోతోందని, బీహార్‌లో గతంలో కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కమలనాథులు చెబుతున్నారు.  





నితీశ్ ఎంట్రీతో జాతీయ రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా మారిన బీహార్‌లో జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారుకు 2024 ఎన్నికల్లో చెక్ పెట్టేలా బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. బీహార్‌లో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ మరో బలమైన కూటమి ఏర్పాటు దిశగా యత్నాలు ముమ్మరం చేశారు. ఎవరిది బలమైన కూటమి అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-09-23T23:23:48+05:30 IST