సీఎస్ సోమేశ్ కుమార్ తో నేషనల్ డిఫెన్స్ కాలజీ ప్రతినిధుల భేటీ

ABN , First Publish Date - 2022-03-21T23:50:06+05:30 IST

జాతీయ భద్రత, వ్యూహాత్మక అంశాల్లో చేస్తున్న అధ్యయనంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన న్యూ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి (ఎన్డీసీ) చెందిన ఎవీఎం తేజ్బీర్ సింగ్ నేతృత్వంలోని 15 మంది ఫ్యాకల్టీ, కోర్సు సభ్యుల బృందం సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ ను కిలిసింది.

సీఎస్ సోమేశ్ కుమార్ తో నేషనల్ డిఫెన్స్ కాలజీ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: జాతీయ భద్రత, వ్యూహాత్మక అంశాల్లో చేస్తున్న అధ్యయనంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన న్యూ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి (ఎన్డీసీ) చెందిన ఎవీఎం తేజ్బీర్ సింగ్ నేతృత్వంలోని 15 మంది ఫ్యాకల్టీ, కోర్సు సభ్యుల బృందం సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ తో భేటీ అయ్యింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించింది.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సీఎస్ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన అత్యంత చిన్నరాష్ట్ర మైనప్పటికి ప్రజల ఆశలు, అవసరాలకు అనుగుణంగా అనేక వినూత్న పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014-15లో జీఎస్‌డీపీ రూ.4.16 లక్షల కోట్లు కాగా, 2021-22 నాటికి 130 శాతం వృద్ధితో జీఎస్డిపి రూ.11.55 లక్షల కోట్లకు పెరిగినట్లు సీఎస్ తెలిపారు. అదేవిధంగా 2014-15లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలుకాగా, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇది 2021-22లో రూ.2.78 లక్షలు అంటే 124.7 శాతంమునకు పెరిగింది. 


ఇదే కాలంలో జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం రూ.86000 నుంచి రూ.1.49 లక్షలు మాత్రమే పెరిగింది. 2014-15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం, 2021-22 నాటికి అద్భుతంగా 3వ స్థానానికి చేరుకుందని చెప్పారు.సొంత వనరులతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. బహుళార్ధసాధక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కాకతీయ రాజుల హయాంలో నిర్మించిన 45 వేల చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరణ, అభివృద్ధిచేయుటతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఈ ప్రయత్నాల వల్ల సాగు విస్తీర్ణం 1.22 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా మరియు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.టీఎస్-బీపాస్, ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ , టీకేహెచ్‌హెచ్‌ఎస్, టీఎస్‌ఐఐసీ, ధరణి వంటి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల గురించి సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్‌డీసీ బృందానికి వివరించారు.ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పీసీసీఎఫ్ డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-21T23:50:06+05:30 IST