లక్ష్మీ సౌభాగ్యవతి బడ్జెట్

ABN , First Publish Date - 2020-02-03T23:55:23+05:30 IST

బడ్జెట్ లక్ష్యం సిరి సంపదల సృష్టి, శ్రేయోసాధన. ఆస్తిపరుల, అన్నార్తుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ వార్షిక ఆర్థిక ప్రక్రియ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం...

లక్ష్మీ సౌభాగ్యవతి బడ్జెట్

బడ్జెట్ లక్ష్యం సిరి సంపదల సృష్టి, శ్రేయోసాధన. ఆస్తిపరుల, అన్నార్తుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ వార్షిక ఆర్థిక ప్రక్రియ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 2020---–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆగమించనున్న వేళ సామాన్యుల శుభ కామనను దేశ భాగ్య విధాత నిర్మలా సీతారామన్‌కు నివేదిస్తున్నాను.

 

బడ్జెట్‌ రూపకల్పన చేసే అవకాశం నాకు లభించగలదని నేనేమీ ఆశించడం లేదు. అయితే అటువంటి మహదవకాశంవస్తే నేను రూపొం దించే బడ్జెట్ ఎలా ఉంటుం దో చెప్పమంటారా? వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని సంస్కరిస్తాను. ముడి పదార్థాల కొనుగోలుపై చిన్నతరహా పారిశ్రామిక సంస్థలు చెల్లించే జీఎస్టీని, వారికి తిరిగి నగదు రూపేణా చెల్లించే ఏర్పాటు చేస్తాను. ఇలా చేయడం వల్ల ఆ సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీ పడగలుగుతాయి. అలాగే జీఎస్టీకి ఒకే రేటు పద్ధతిని కూడా రద్దు చేస్తాను. ఒకే రేటుకు బదులుగా, వస్త్రాలు, అగర్ బత్తి ఇత్యాది శ్రమ సాంద్ర వస్తువులకు తక్కువ రేటు; ఆటోమోబైల్స్ మొదలైన పెట్టుబడి సాంద్ర వస్తువులకు అధిక రేటును నిర్ణయిస్తాను.

 

ఉద్యోగాలను హరించివేసే జెసిబి, ఎక్సాకావేటర్స్, హార్వెస్టర్స్, రోబోలు మొదలైన వస్తువులకు జీఎస్టీ రేట్లను ప్రత్యేకంగా పెంచుతాను. కార్పొరేట్ కంపెనీలకు ‘ఎంప్లాయ్‌మెంట్ ఆడిట్’ను తప్పనిసరి చేస్తాను. అవి ఇప్పుడు ఎనర్జీ ఆడిట్ చేపడుతున్నట్టుగానే ఈ కొత్త ఆడిట్‌నుకూడా చేపట్టవలసివుంటుంది. దీనివల్ల ఉద్యో గాలను హరించేవేసే అధునాతన సాంకేతికతలను ఆ కంపెనీలు ఏ స్థాయిలో ఉపయోగించుకొంటున్నాయన్న సమాచారం వాటాదారులకు, ప్రభుత్వానికి సమకూరుతుంది. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలను హరించివేసే సాంకేతికతలను ఉపయోగించుకుంటున్న పక్షంలో అవి ఆదాయపు పన్నును తప్పనిసరిగా మరింత అధిక స్థాయిలో చెల్లించే విధంగా చర్యలు చేపడతాను.

 

బడ్జెట్ రూపకల్పనలో నేను నిర్దేశించనున్న రెండో మార్పు- ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) నుంచి వైదొలగడం. అసలు భారత్, ఇతర వర్ధమాన దేశాలు ఎందుకు డబ్ల్యుటిఓలో చేరాయి? అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతులకు ముఖ్యంగా వ్యవసాయక ఉత్పత్తులకు సంపన్న దేశాలు తమ మార్కెట్లను తెరుస్తాయనే ఆశాభావమే అందుకు పురిగొల్పింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రారంభమైన పది సంవత్సరాలలోగా తమ మార్కెట్లలోకి వర్ధమాన దేశాల ఉత్పత్తులను నిర్నిబంధంగా అనుమతిస్తామన్న వాగ్దానాన్ని సంపన్న దేశాలు నిలబెట్టుకోలేదు. డబ్ల్యుటిఓ నుంచి వైదొలగడం వల్ల మన ప్రయోజనాలకు విఘాతమేమీ వాటిల్లదు. ఎందుకంటే డబ్ల్యు టి ఓ పరిధి వెలుపల వున్న సేవల ఎగుమతుల పైనే ప్రధానంగా మన భవిష్యత్తు ఆధారపడివున్నది.

 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తాను. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరిస్తాను. రక్షణ, పరిశోధన రంగాలకు సంబంధించిన, ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వరంగ కంపెనీలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండేలా చర్యలు చేపడతాను. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాను. ఇది కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ విలువకు సమానం. ఈ భారీ ఆదాయాన్ని ప్రయోజనకరంగా మదుపు చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థను సృష్టిస్తాను. స్పేస్ టూరిజం, రోబో టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్తతరం ఇంటర్నెట్, పేట్రియాట్ మిస్సైల్స్ , బిగ్ డేటా ఎనాల్సిస్ మొదలైన రంగాలలో అధునాతన సాంకేతికతల అభివృద్ధికి దోహదం జరిగేలా ఈ మదుపులను ప్రధానంగా ఉద్దేశిస్తాను.

 

అభివృద్ధి సాధనకు ద్రవ్యలోటు నియంత్రణ అనే తారక మంత్రాన్ని త్యజిస్తాను. దేశీయ ద్రవ్య మార్కెట్ నుంచి లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి భారీ రుణాలు తీసుకుని సామాన్య మానవులకు అనుకూల మైన మౌలిక సదుపాయాల రంగాన్ని ఇతోధికంగా అభివృద్ధి పరిచేందుకు మదుపు చేస్తాను. ఉదాహరణకు చిన్న పట్టణాలలో వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తాను. విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాను. గ్రామాలలో రహదారులను నిర్మిస్తాను. ఈ మదుపులు సిమెంట్, ఉక్కు, శ్రమ శక్తికి డిమాండ్ ను పెంచుతుంది. అట్టడుగుస్థాయి ఆర్థిక కార్యకలాపాలలో ఒక విశేష కదలికను తీసుకువస్తుంది. ఈ విధానాలు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును పది శాతానికి పైగా పెంచగలవని, యువజనులకు అపారంగా ఉద్యోగాలు సృష్టించగలవని, అధునాతన సాంకేతికతలను అభివృద్ధిపరచడంలో మన దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా రూపొందించగలవనే నమ్మకం నాకు నిండుగా వున్నది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-02-03T23:55:23+05:30 IST