మోదీయిజానికి హైదరాబాద్‌ బాట!

ABN , First Publish Date - 2022-07-01T09:27:04+05:30 IST

నాడు వైశ్రాయ్‌ హోటల్‌! నేడు నోవాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌! 18 ఏళ్ల కిందట (2004) ఇదే హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్లో బీజేపీలో చోటుచేసుకున్న...

మోదీయిజానికి హైదరాబాద్‌ బాట!

2004లో ఇక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ తర్వాత వరుస ఓటములతో పట్టు కోల్పోయిన ఆడ్వాణీ

గుజరాత్‌ నమూనాతో జాతీయ తెరపైకి మోదీ

18 ఏళ్లలో ఉత్థాన పతనాలూ.. కలల సాకారాలూ


న్యూఢిల్లీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నాడు వైశ్రాయ్‌ హోటల్‌! నేడు నోవాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌! 18 ఏళ్ల కిందట (2004) ఇదే హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్లో బీజేపీలో చోటుచేసుకున్న అత్యంత ఉత్సాహభరిత సన్నివేశాలు ఇప్పుడు నోవాటెల్‌లో పునరావిష్కృతం కానున్నాయి! అప్పట్లోనూ కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడూ ఆ పార్టీదే అధికారం! అప్పట్లో ప్రధానిగా వాజపేయి ఉంటే.. అప్పట్లో ముఖ్యమంత్రిగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో హాజరవుతున్నారు! అప్పట్లో ఆరు నెలల ముందే  ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 2004 జనవరిలో జరిగిన కార్యవర్గ సమావేశాలు ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. అప్పట్లో ‘భారత్‌ వెలిగిపోతోంది’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించింది. దేశంలో అంతా బాగుందని పార్టీ భావించింది. ఇప్పుడు ‘ముందస్తు’ సన్నివేశమేమీ లేదు. కానీ, ఇప్పుడు కూడా తమకు తిరుగులేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకున్న రీత్యా 2004 సమావేశాలు చరిత్రాత్మకంగా మిగిలిపోయాయి. అంతకు ముందు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించలేదు. ఇక, ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో కేవలం తెలంగాణలో విస్తరించాలన్న ఎజెండా తప్ప మరొకటి లేదు. అప్పట్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ఎన్డీయే ప్రభుత్వ విజయాల గురించి, ఇస్లామాబాద్‌లో సార్క్‌ సదస్సుకు వాజపేయి హాజరు కావడంపైనా తీర్మానాలు చేశారు. ఇప్పుడు కూడా రాజకీయ, ఆర్థిక తీర్మానాలతో పాటు మోదీ విజయాలపై తీర్మానం చేసే అవకాశాలున్నాయి. అప్పట్లో జనవరి 11, 12 తేదీల్లో జరిగిన సమావేశాల్లో వాజపేయి ప్రధానిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ప్రధానిగా అది ఆయన చివరి పర్యటన.


మోదీ మార్కు మొదలు

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని హైదరాబాద్‌లో 18 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయమే ఆడ్వాణీకి నష్టం చేకూర్చిందా? అదే మోదీ ఆవిర్భావానికి, బీజేపీలో మోదీయిజం ప్రాబల్యానికి కారణమైందా? రాజకీయ పరిశీలకులు ఈ ప్రశ్నలకు ‘ఔను’ అన్న జవాబునే ఇస్తారు. ‘భారత్‌ వెలిగిపోతోందం’టూ ఎన్నికలకు వెళ్లినా.. అంచనాలకు భిన్నంగా 2004 ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. సోనియా ప్రధాని కాకపోయినా.. బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏను ఏర్పాటు చేయడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత పదేళ్లూ యూపీఏ కొనసాగింది. బీజేపీ బలహీనపడింది. అదే సమయంలో.. 2001లో గుజరాత్‌ సీఎం అయిన మోదీ 2002లో మాత్రమే కాకుండా 2007లోనూ, 2012లోనూ గుజరాత్‌లో విజయం సాధించారు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లూ ఆడ్వాణీ జాతీయ స్థాయిలో తన పట్టు కోల్పోతుంటే, మోదీ రాష్ట్రంలో పట్టు బిగించి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ‘గుజరాత్‌ నమూనా’కు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం కల్పించారు. ఇంకా చెప్పాలంటే, 2004 సమావేశాలు జరిగినప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నా.. మోదీ అంతగా ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్‌ అల్లర్ల నీడలు ఆయనపై పరచుకున్నాయి. ఇప్పుడు న్యాయపరంగా ఆ నీడలు తొలగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, హైదరాబాద్‌ సమావేశాల తర్వాత ఎన్నికల్లో రెండుసార్లు సారథ్యం వహించేందుకు ఆడ్వాణీకి అవకాశం లభించినా.. ఆయన తన సత్తా నిరూపించుకోలేకపోవడంతో మోదీపై పార్టీ, సంఘ్‌ పరివార్‌ దృష్టి పడింది. యూపీఏ పదేళ్ల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు, ఆరోపణలు, జనాందోళనలు మోదీకి అనుకూలంగా మారాయి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ.. ఇప్పుడు బీజేపీని దేశమంతటా విస్తరించాలన్న ఊపులో ఉన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి తిరుగులేని వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో విజయపతాకం ఎగుర వేయాలన్న లక్ష్యంతో ఈసారి హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 18 ఏళ్లలో బీజేపీ ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది. అలాగే, బీజేపీ రాజకీయాలూ ఎంతో మారాయి. అప్పట్లో అయోధ్య, కాశీ, మధుర, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు ఎజెండాగా ఉన్నాయి. కానీ, సంకీర్ణ సర్కారు కావడంతో వాజపేయి హయాంలో వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ, అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని మోదీ సాకారం చేశారు. కశ్మీర్‌లో అధికరణ 370ని రద్దు చేశారు. కాశీ, మధురలకు ప్రాధాన్యం లభించింది.


యువమోర్చాలో తరుణ్‌ ఛుగ్‌

ఇప్పుడు మోదీ టీమ్‌లో ఉన్న పలువురు నాడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనలేదు కూడా! ఇప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా 2004లో యువమోర్చా అధ్యక్షుడుగా పనిచేసిన తర్వాత హిమాచల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అమిత్‌ షా కూడా నాడు గుజరాత్‌ రాజకీయాలకే పరిమితమై ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న పీయూష్‌ గోయెల్‌ నాడు ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌గా ఉన్నారు. నితిన్‌ గడ్కరీ నాడు మహారాష్ట్రలో శాసనమండలి సభ్యుడే. తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మరో ప్రధాన కార్యదర్శి  తరుణ్‌ ఛుగ్‌ నాడు పంజాబ్‌లో విద్యార్థి పరిషత్తు, యువ మోర్చాలో పని చేస్తున్నారు. నాడు వాజపేయి ప్రసంగించిన పరేడ్‌ గ్రౌండ్‌లోనే ఇప్పుడు మోదీ ప్రసంగించనున్నారు. కానీ, అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. నాడు వాజపేయి ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నేత అయితే.. ఇప్పుడు మోదీ పార్టీని రెండుసార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి తెచ్చిన నేత. నాడు నాలుగైదు రాష్లాల్లోనే బీజేపీ అధికారంలో ఉండేది. ఇప్పుడు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు 18 మంది ముఖ్యమంత్రులు సమావేశాలకు హాజరవుతున్నారు. 18 ఏళ్ల కిందట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పెద్ద ప్రాధాన్యం లేదు. ఇప్పుడు ఆయన ప్రత్యేక ఆకర్షణ. బీజేపీలోకి కొత్త రక్తం, కొత్త తరం వచ్చిందనడానికి ఈ మార్పులే ఉదాహరణ.


అప్పట్లో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు!?

నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు. ఇక, ఆ సమావేశాల తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో వెంకయ్య మంతనాలు జరిపారు. అంతకు ముందు వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జయలలిత వెంకయ్య ప్రయత్నాల మూలంగా ఎన్డీయే శిబిరంలో చేరితే డీఎంకే కాంగ్రె్‌సతో చేతులు కలిపింది. తమిళనాట ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నా.. తమకు ఏ మిత్రపక్షం అవసరం లేదనే ధీమా ఇప్పుడు బీజేపీలో నెలకొంది. నాడు జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ఉంటే ఈసారి తెలంగాణలో ఏడాది ముందే ఆ వాతావరణం ఏర్పడింది. ఒకప్పుడు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో కీలకంగా మారింది. అప్పట్లో బీజేపీ నేతలు హైదరాబాద్‌ వచ్చినా భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించేవారు కాదు. ఇప్పుడు ఆ ఆలయం తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మారింది.

Updated Date - 2022-07-01T09:27:04+05:30 IST