నేషన్‌ వాంట్స్ టు నో...

ABN , First Publish Date - 2020-04-24T05:55:41+05:30 IST

రిపబ్లిక్‌ టీవీ సారథి, ప్రసిద్ధ న్యూస్‌రీడర్‌, యాంకర్‌ అర్నబ్‌ గోస్వామి మీద ముంబైలో బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సమర్థనీయం కాదు. విధులు ముగించుకుని, భార్యతో సహా...

నేషన్‌ వాంట్స్ టు నో...

రిపబ్లిక్‌ టీవీ సారథి, ప్రసిద్ధ న్యూస్‌రీడర్‌, యాంకర్‌ అర్నబ్‌ గోస్వామి మీద ముంబైలో బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సమర్థనీయం కాదు. విధులు ముగించుకుని, భార్యతో సహా ఇంటికి కారులో వెడుతున్నప్పుడు, మోటర్‌సైకిల్‌ మీద అనుసరించిన ఇద్దరు తమను అటకాయించడానికి ప్రయత్నించారని, కారు కిటికీలు బద్దలు కొట్టాలని చూశారని, ఏదో ద్రవాన్ని వెదజల్లారని గోస్వామి చెబుతున్నారు. దాడికి పాల్పడినవారు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలని, పైవారి ఆదేశాలతో వారు ఆ చర్యకు తెగబడినట్టు తన భద్రతాసిబ్బంది చెబుతున్నారని కూడా గోస్వామి చెప్పారు. గర్హనీయమైన ఈ చర్యలో గోస్వామి దంపతులకు ఎటువంటి గాయాలు తగలకపోవడం, ఈ దాడిలో కేవలం కారుపై ఇంకు వంటి పదార్థం పడడం తప్ప మరే వస్తునష్టం జరగకపోవడం సంతోషించవలసిన విషయం. అర్నబ్‌ గోస్వామి, ఈ సంఘటనకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బాధ్యురాలని ఆరోపించారు. ఆమెను నేరుగా సంబోధిస్తూ, తనకు ప్రజల మద్దతున్నదని, తన సత్యనిష్ఠను కొనసాగిస్తానని ఆయన ఒక ప్రకటన చేశారు. 


గోస్వామి కానీ, ఆయన రిపబ్లిక్‌ టీవీ కానీ సంచలన వార్తాప్రసారాలకు, ప్రశ్నార్హమైన పద్ధతులకు పెట్టింది పేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, ఆ పార్టీకి అనుబంధమైనవని భావించే సంఘాలకు, భావాలకు కూడా గోస్వామి అనుకూలంగా వ్యహహరిస్తారు. రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం కూడా బిజెపికి చెందినవారిదే. పార్టీ అభిమానాల సంగతి ఎట్లా ఉన్నా, తీవ్ర జాతీయవాదానికి, మతతత్వం జోడించిన జాతీయ ఆలోచనా ధోరణికి వేదికగా భావించే ఆ టీవీ ఛానెల్‌లో జరిగే చర్చా కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తాయి. తటస్థంగా ఉండవలసిన చర్చా నిర్వాహకుడు, స్వయంగా ఒక వైఖరి తీసుకుని, ఇతరులను బలవంతంగా నోరుమూయించడం తరచు అక్కడ చూస్తాము. కొన్ని కొన్ని సందర్భాలలో ఆ చర్చలు ప్రేక్షకులను ఆవేశపరుస్తాయి. వివిధ వర్గాల మధ్య అటువంటి ఆవేశాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. అయినప్పటికీ, మీడియా స్వేచ్ఛను గౌరవించవలసిందే. అభిప్రాయాలను అభిప్రాయాలతో ఓడించవలసిందే. దాడుల ద్వారా, అవి ఇంకు దాడులు అయినా, అంతకు మించిన భౌతికదాడులు అయినా, వాటి ద్వారా సాధించగలిగేది ఏమీ లేదు.


దాడికి పాల్పడినవారు అరెస్టయ్యారు కాబట్టి, ఈ సంఘటన వెనుక ఎవరున్నారన్నది త్వరలోనే తెలియవచ్చు. పరిస్థితులు, పరిణామాల ఆధారంగా, ఒక నేపథ్యాన్ని ఊహించవచ్చు కూడా. మహారాష్ట్రలోని పాల్‌ఘడ్‌లో వారం రోజుల కిందట జరిగిన ఒక సంఘటనలో స్థానికులు ఇద్దరు సాధువులను, వారి వాహనం డ్రైవర్‌ను కొట్టి చంపారు. పిల్లలను ఎత్తుకుపోయే దొంగలన్న అనుమానంతో జరిగినమూకదాడి సంఘటన అది. ఆ ఘటన విడియో బయటకు వచ్చి, వాట్సప్‌లో కొందరు పనిగట్టుకుని చేసిన ప్రచారం వల్ల, ఆ దాడి మతపరమైనదన్న వదంతి మొదలయింది. ఆ వదంతిని, ద్వేషసంఘాలు చేసిన ప్రచారాన్ని నమ్మి అర్నబ్‌ గోస్వామి, తన టీవీ వార్తాప్రసారంలో ఆ సంఘటన మతప్రాతిపదికపై జరిగిందని చెప్పడమే కాకుండా, దేశంలోని లౌకికవాద మేధావులను, ఉదారవాదులను నిందించారు. సాధువులపై దాడిని ఖండించరెందుకని మీడియాపై కూడా విమర్శలను కురిపించారు. నిరసనగా తాను ఎడిటర్స్‌ గిల్డ్‌కు రాజీనామా చేస్తున్నట్టు టీవీ ముఖంగానే ప్రకటించారు. అయితే, అర్నబ్‌ గోస్వామి భావించినట్టు, పాల్‌ఘడ్‌ ఘటన మతఘటన కాదు. బాధితులు దుండగులు ఇద్దరూ ఒకే మతవర్గానికి చెందినవారు, ఇద్దరూ వేర్వేరు తెగల గిరిజనులు అని తెలిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆమేరకు ప్రకటన చేశారు. నిజనిర్ధారణ బృందాలూ అవే తేల్చాయి. కానీ, గోస్వామి తన తప్పును సవరించుకోలేదు. పాల్‌ఘఢ్‌ మతఘటన అని వాదించే క్రమంలో గోస్వామి కాంగ్రెస్‌ పార్టీపైనా, సోనియాగాంధీపైనా కూడా అనేక ఘాటువిమర్శలు చేశారు.   అసలు ఘటననే టీవీ ఛానెల్‌ వక్రీకరించిందని తేలడంతో, తమ నాయకురాలిని నిందించినందుకు గాను, మతద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు కాను, వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఇతరులు అర్నబ్‌ గోస్వామిపై పోలీసుకేసులు పెట్టారు. ఇంతలో బుధవారం రాత్రి ఈ ఘటన.


ఎంత చిన్నదైనా దాడి ఆమోదనీయం కాదు. మీడియాస్వేచ్ఛ మీద ఎటువంటి అప్రజాస్వామిక చర్య అయినా సమాజానికి చేటు చేస్తుంది. ఎట్లాగూ, గోస్వామి, భావప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు కాబట్టి, సత్యం కోసం పోరాడతానన్నారు కాబట్టి, ఈ సందర్భంలో మరి కొన్ని సంఘటనలను చెప్పుకోవాలి. అవి ఇంకుదాడుల వంటి సున్నితమైనవీ, చిన్నవీ కావు. అవి ఏ ప్రతిపక్ష పార్టీలో, దుర్బల ప్రజాసంఘాలో చేసిన అఘాయిత్యాలు కావు. అధికారం చేతిలో ఉన్న శక్తులు దాటిన లక్ష్మణరేఖలు. 


‘ది వైర్‌’ – సాహసం, దృక్పథం కలగలసిన వెబ్‌ న్యూస్‌పేపర్‌. గత ఐదారేళ్లుగా, అది విమర్శనాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ, ప్రమాణబద్ధమైన పత్రికారచనకు, సత్యశోధనకు ప్రతీకగా నిలబడింది. సహజంగానే దాని మీద పాలకులకు, వారి అనుయాయులకు కోపం ఉంటుంది. ఆ పత్రికపై అనేక వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. కరోనా కట్టడి కాలంలో కూడా పాలకులు ఈ పత్రిక సంపాదకుల మీద ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. మర్కజ్‌ సమావేశాల కారణంగా కరోనా వ్యాప్తి గురించి చర్చ జరుగుతున్న సమయంలో,  మార్చి 31 నాడు ‘ది వైర్‌’లో సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌ ఒక పొరపాటు చేశారు. తబ్లిగి మర్కజ్‌ జరుగుతున్న సమయంలోనే యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2 వరకు అయోధ్యలో శ్రీరామనవమి జాతర జరపాలని, కరోనా వైరస్‌ నుంచి భక్తులను శ్రీరాముడే రక్షిస్తాడని ఆయన అన్నాడని వరదరాజన్‌ ఒక కథనంలో రాశారు. ట్విట్టర్‌లో కూడా ఆ కథనం లింక్‌ పెట్టారు. యుపి ముఖ్యమంత్రి కార్యదర్శి నుంచి అభ్యంతరం రాగానే, సిద్ధార్థ వరదరాజన్‌ తన వ్యాఖ్యను కథనంలోను, ట్విట్టర్‌లోను కూడా  సవరించుకున్నారు. అయినప్పటికీ, యుపి ప్రభుత్వం ‘ది వైర్‌’ సంపాదకుడిని వేధిస్తున్నది. ఢిల్లీలో ఉన్న సంపాదకుని ఇంటికి పోలీసులను పంపించి, విచారణకు హాజరు కమ్మని నోటీసులు అందజేసింది. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవల కింద ఆ పోలీసులు అంత దూరం ప్రయాణించి, ఆ పనిచేశారు. ఈ కేసు ఏమవుతుందో తెలియదు. ఇక కశ్మీర్‌లో సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెట్టడం పెరిగిపోయింది. బిబిసి, డైలీఓ వంటి సంస్థలకు వార్తలు అందించే అంతర్జాతీయ పాత్రికేయుడు, స్వతంత్ర జర్నలిస్టు జోహర్‌ గిలానీపై చట్టవ్యతిరేక కార్యక్రమాల వ్యతిరేక చట్టం ‘ఊపా’ కింద బుధవారం నాడు కేసు నమోదు చేశారు. కశ్మీరీ మహిళా ఫోటో జర్నలిస్టు మస్రత్‌ జహ్రాపై అదే చట్టం కింద కేసు నమోదు చేశారు. వాషింగ్టన్‌ పోస్ట్‌, అల్‌ జజీరా వంటి వేదికలపై ఫోటోలు ప్రచురించిన జహ్రా, లాక్‌డౌన్‌ కాలంలో వ్యాపకం కోసం తను తీసిన పాత ఫోటోలను తిరిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయసాగారు. ట్విట్టర్‌లో అక్షర పరిమితి కారణంగా, ఒక మిలిటెంట్‌ అంత్యక్రియల ఫోటో కింద వ్యాఖ్యలో ‘అమరుడు’ అన్న సంబోధనకు ఉటంకింపు గుర్తులు (కోట్స్‌) పెట్టకపోవడం జహ్రా విషయంలో పెద్ద నేరమైపోయింది. ఆమె వృత్తి ప్రమాణాలను పాటించే స్వతంత్ర ఫోటో జర్నలిస్టు మాత్రమే. 


యుపిలోను, కశ్మీర్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా, ఇంతటి ప్రత్యేక సందర్భంలోనూ భావప్రకటనా స్వేచ్ఛపైనా, పాత్రికేయుల వృత్తినిర్వహణ పైనా అనేక నిఘామేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ప్రభుత్వాల ప్రాధాన్యాలు ఏమిటో ఈ సంఘటనలు చెబుతున్నాయి. గోస్వామిపై ఇంకుదాడిని ఖండిస్తూనే, మొత్తంగా అలముకుని ఉన్న వాతావరణం గురించి దేశం తెలుసుకోవాలి, స్పందించాలి. 

Updated Date - 2020-04-24T05:55:41+05:30 IST