అలరించిన నాటిక ప్రదర్శనలు

ABN , First Publish Date - 2021-04-19T05:07:49+05:30 IST

కళారంజని ఆధ్వర్యంలో గునుపూడిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీల్లో ప్రదర్శనలు అలరిస్తున్నాయి.

అలరించిన నాటిక ప్రదర్శనలు
సంకల్పం నాటికలో ఓ సన్నివేశం

భీమవరంలో ముగిసిన జాతీయ స్థాయి పోటీలు



భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 18 : కళారంజని ఆధ్వర్యంలో గునుపూడిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీల్లో ప్రదర్శనలు అలరిస్తున్నాయి. ఆదివారం రాత్రి రెండు నాటిక ప్రదర్శనలతో పోటీలు ముగిశాయి. కొలకలూరుకు చెందిన సాయి ఆర్ట్స్‌ ప్రదర్శించిన ‘మనసుతో ఆలోచిస్తే’ నాటిక ఆలోచింపజేసింది. తల్లి కావాలా, భార్య కావాలా అనే పరిస్థితి ఏర్పడితే ఆ భర్త ఎలా నలిగిపోతాడో వివరించారు. ఆందరూ మనసుతో ఆలోచిస్తే ఏ సమస్యా ఉండదని చూపించారు. విశాఖపట్నంకు చెందిన జాస్మన్‌ ఆర్ట్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌ ‘సంకల్పం’ నాటికలో అప్పుల భారం, పంటకు గిట్టుబాటు ధరలేక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను వివరించారు. అన్నపూర్ణ అనే మహిళ తండ్రి వారసత్వంగా తీసుకుని వ్యవసాయం చేస్తానని చెప్పి ప్రకృతి వ్యవసాయం చేసి ఎకరాకు 70 బస్తాలు పండించి ఆదర్శరైతుగా నిలుస్తుంది. ప్రభుత్వం కూడా ఉత్తమ రైతుగా ఎంపిక చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నాటకాలను కళారంజనీ వ్యవస్థాపక అద్యక్షు డు జవ్వాది దశరథి శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 


23 నుంచి కొంతేరులో నాటిక పోటీలు

యలమంచిలి, ఏప్రిల్‌ 18 : కొంతేరులో ఈ నెల 23 నుంచి కొంతేరు యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్టు యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ తెలిపారు. యూత్‌ క్లబ్‌ కార్యాలయంలో జాతీయ స్థాయి నాటికపోటీల బ్రోచర్‌ను ఆదివారం విడుదల చేశారు. మూడు రోజుల పాటు నాటిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యవర్గ సభ్యు లు గుమ్ములూరి ఉదయభాస్కరరావు, బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం, గంటా ముత్యాలరావు, కొంతేటి సర్వేశ్వరలింగం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T05:07:49+05:30 IST