వైభవంగా నటరాజస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-07-06T14:06:15+05:30 IST

కడలూరు జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిదంబరం నటరాజస్వామి ఆలయ రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా

వైభవంగా నటరాజస్వామి రథోత్సవం

                            - చిదంబరంలో పోటెత్తిన భక్తజనం


ప్యారీస్‌(చెన్నై), జూలై 5: కడలూరు జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిదంబరం నటరాజస్వామి ఆలయ రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ నటరాజస్వామి వారు శివగామిసుందరి అమ్మవారి సమేతంగా రథంలో ఊరేగారు. పంచభూత క్షేత్రాల్లో కైలాస స్థలంగా పేరుగాంచిన చిదంబరం నటరాజస్వామి ఆలయంలో జరిగే ఆణి మాస ఉత్సవాలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధానాంశమైన రథోత్సవం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైంది. చిత్ర సభ నుంచి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆనంద నటరాజమూర్తి, శివగామిసుందరి, వినాయకుడు, సుబ్రమణ్యుడు, చండికేశ్వరులను వేర్వేరు రథాల్లో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రద్దీలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బుధవారం జరుగనున్న ఆణి తిరుమంజనం ఉత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు వేయికాళ్ల మండపంలో ఆది దంపతులకు మహా అభిషేకం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పంచమూర్తుల ఊరేగింపు, 2 గంటలకు భక్తులను ఆణి తిరుమంజన దర్శనానికి క్యూలైన్ల ద్వారా అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-06T14:06:15+05:30 IST