వైకల్యం..కాలేదు అవరోధం !

ABN , First Publish Date - 2020-05-11T09:48:22+05:30 IST

నటాలియా పార్టికా.. పోలెండ్‌కు చెందిన ఈ 30 ఏళ్ల టీటీ క్రీడాకారిణి ఆడుతుంటే కోర్టు చప్పట్లతో మార్మోగుతుంటుంది..చురుకైన ఫుట్‌వర్క్‌..

వైకల్యం..కాలేదు అవరోధం !

నటాలియా పార్టికా.. పోలెండ్‌కు చెందిన ఈ 30 ఏళ్ల టీటీ క్రీడాకారిణి ఆడుతుంటే కోర్టు చప్పట్లతో మార్మోగుతుంటుంది..చురుకైన ఫుట్‌వర్క్‌.. కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్లు.. ప్రత్యర్థినుంచి దూసుకొచ్చే బంతిని క్షణాల్లో ఎదుర్కొనే తీరు అమోఘం.. ఆమె డిఫెన్స్‌ అయితే దుర్భేద్యం..మొత్తంగా ఆమె ఆటతీరు టాప్‌ ప్లేయర్‌కు ఏమాత్రం తీసిపోదు.. అయితే చాలా దగ్గరనుంచి చూస్తే తప్ప తెలీదు నటాలియాకు కుడి ముంజేయి లేదని.. అది తెలుసుకున్న మరుక్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు ఎవరైనా!


ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం నటాలియా

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

వైకల్యం జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదని నటాలియా పార్టికాను చూస్తే అర్థమవుతుంది. కుడి ముంజేయి లేకుండానే పుట్టినా దాని గురించి ఆమె ఎప్పుడూ బాధపడలేదు. పైగా..ఆ వైకల్యాన్ని సవాలుగా తీసుకుంది. తనకు ఇష్టమైన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)ను కెరీర్‌గా ఎంచుకొని ఒలింపిక్స్‌లో తలపడే స్థాయికి ఎదిగింది.  

టీటీలో సర్వీస్‌ ఎంతో ముఖ్యం. అరచేతిలోని బంతిని నైపుణ్యంగా గాలిలోకి ఎగురవేసి బ్యాటుతో దానిని కొట్టాలంటే.. బంతికి, బ్యాటుకు నడుమ ఎంతో సమతూకం అవసరం. అలాంటిది మణికట్టు చివర బంతిని ఒడుపుగా ఉంచడం, అనంతరం దాన్ని గాల్లో ఎగురవేయడం అంటే ఆషామాషీకాదు. కానీ తన మణికట్టు అంచున బంతిని ఉంచడం, దాన్ని నైపుణ్యంగా గాల్లో ఎగురవేయడం.. తర్వాత రాకెట్‌తో కొట్టడంలాంటివి సాధారణ ప్లేయర్స్‌ మాదిరే చేస్తుండడం నటాలియా ప్రత్యేకం. 


‘లండన్‌’లో ఆటకు సలాం..: 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా పార్టికా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అవి ఆమెకు రెండో ఒలింపిక్స్‌. అయితే ఆ విశ్వక్రీడల్లో నటాలియా తన వైకల్యంతోగాక నైపుణ్యంతో ఔరా అనిపించింది. ఒలింపిక్స్‌ టీటీ సింగిల్స్‌లో పోటీపడడం ఆమెకది తొలిసారే. మహిళల సింగిల్స్‌ రౌండ్‌-32లో నెదర్లాండ్స్‌కు చెందిన జీ లిన్‌ చేతిలో ఓడినా..నటాలియా పోరాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వైకల్యం ఉండీ.. సాధారణ ప్లేయర్లతో తలపడడం, వారికి గట్టిపోటీ ఇవ్వడం ఆమె ప్రతిభా పాటవాలకు నిదర్శనం. ‘వైకల్యం నాకు సమస్యే కాదు’ అని అనడం నటాలియా ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతుంది. అప్పట్లో లీ లిన్‌తో ఓటమిపై స్పందిస్తూ.. ‘అందరు క్రీడాకారిణుల మాదిరే నేనూ ఆడుతున్నా. వారు ఎలా సర్వ్‌ చేస్తారో నేనూ అలాగే చేస్తా. వారికెలాంటి లక్ష్యాలుంటాయో నాకూ అలానే ఉంటాయి’ అన్న ఆమె మాటలు.. ‘ఇక జీవితమే లేదు’ అని వివిధ రకాల వైకల్యాలతో బాధపడేవారికి నిస్సందేహంగా స్ఫూర్తినిస్తాయి. ఇక లండన్‌ పారాలింపిక్స్‌ టీటీ మహిళల సింగిల్స్‌లో పార్టికా స్వర్ణ పతకం గెలవడం విశేషం. తనను స్ఫూర్తిగా తీసుకొన్న వారు తనకన్నా అద్భుతమైన ఫలితాలు సాధిస్తే తన జీవితానికి అదే సార్థకత అంటోంది నటాలియా పార్టికా.

Updated Date - 2020-05-11T09:48:22+05:30 IST