నాసిన్‌ చెరువు శుద్ధ్దీకరణ

ABN , First Publish Date - 2022-04-27T04:48:02+05:30 IST

ఒకప్పుడు తాగు, సాగు నీరందించిన చెరువులు వాటి ఉనికిని కోల్పోయాయి. తిరిగి ఆ చెరువులకు పూర్వ స్థితిని తీసుకొచ్చేందుకు అధికారులు, పాలకులు చర్యలు చేపట్టారు.

నాసిన్‌ చెరువు శుద్ధ్దీకరణ
నాసిన్‌ చెరువు నుంచి మురుగు నీటిని తొలగించేందుకు ఏర్పాటు చేసిన కాలువ


  • భారీ పైప్‌లైను ఏర్పాటు
  • రూ.7.10కోట్ల మంజూరు
  • కొనసాగుతున్న పనులు

ఒకప్పుడు తాగు, సాగు నీరందించిన చెరువులు వాటి ఉనికిని కోల్పోయాయి. తిరిగి ఆ చెరువులకు  పూర్వ స్థితిని తీసుకొచ్చేందుకు అధికారులు, పాలకులు  చర్యలు చేపట్టారు. 

కీసర రూరల్‌, ఫిబ్రవరి 26 : చెరువుల శుద్ధ్దీకరణకు పూనుకుంది దమ్మాయిగూడ మున్సిపల్‌ పాలకవర్గం.  మురుగునీటితో నిండిన చెరువులనుస్వచ్ఛంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో నాసిన్‌ చెరువు, కోపులకుంట, కుమ్మరికుంట జలాశయాలున్నాయి. దాదాపు 30ఏళ్ల క్రితం వరకు ఆ చెరువుల చుట్టూ ఆయకట్టును ఆ నీటితోనే సాగు చేశారు. పశువుల దప్పిక తీర్చేందుకు ఆ నీటినే వినియోగించేవారు. ఆ చెరువుల్లో పెంచిన చేపలను విక్రయించి మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కాగా కాల క్రమేణ దమ్మాయిగూడ నగరానికి చేరువలో ఉండటంతో పెద్దఎత్తున జనాలు ఇక్కడికి వలస వచ్చారు. ఈ తరుణంలో చెరువు పరివాహక ప్రాంతంలో అదే స్థాయిలో కాలనీలు వెలిశాయి. ఈ క్రమంలో ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్ధజాలాలు చెరువులోకి  చేరడంతో మురుగుకూపంగా మారింది.  ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. దీనికి తోడు పక్కనే జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దోమల స్వైరవిహారంతో జనాలు తరచూ అంటు వ్యాధులబారిన పడుతున్నారు. ఈ క్రమంలో చెరువును శుద్ధిచేసేందుకు మున్సిపల్‌ పాలక వర్గం చర్యలు చేపట్టింది. స్థానికులు మంత్రి మల్లారెడ్డికి మొర పెటుకోగా ఆయన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పాలకవర్గ దీక్ష, మంత్రి కృషితో ప్రయత్నం ఫలించింది. మురుగునీరు చెరువులో చేరకుండా ప్రత్యేకంగా భారీ పైపులైను వేసేందుకు హెచ్‌ఎండీఏ ముందుకువచ్చింది. అందుకుగాను రూ.రూ.7.10కోట్లను మంజూరు చేసింది. ఫిబ్రవరి24న మంత్రి చేతుల మీదుగా పనులు  ప్రారంభించారు. ముందుగా ఎగువ నున్న దమ్మాయిగూడ చెరువు నుంచి పలు కాలనీల గుండా నాసిన్‌ చెరువు వరకు వేయాలనుకున్న పైప్‌లైన్‌ ప్రజల వినతి మేరకు నాగారం మున్సిపాలిటీకి అనుకుని ఉన్న కుమ్మరికుంట వరకు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  చెరువుల్లో మురుగునీరు చేరకుండా చర్యలతో పాటు మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చి దిద్దేందుకు ప్రాణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి స్వయంగా పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. చెరువు పరిసరాలను సుందరీకరించటతో అహ్లాదవాతావరణం నెలకొంటుందని, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రూ.7.10 కోట్లతో  పనులు:-వసుపతి ప్రణీత, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

గతంలో శుద్ధ జలాలతో కళకళలాడిన చెరువు నేడు మురికి  కూపంగా మారింది. తద్వారా స్థానికులు అనారోగ్యానికి గరౌతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును శుద్ధి చేసి, మంచినీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హెచ్‌ఎండీఏ మంజూరు చేసిన రూ.7.10కోట్లతో ప్రత్యేక భారీ పైప్‌లైన్‌ నిర్మాణాన్ని చేపట్టాం. పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

జూన్‌ మొదటి వారం నాటికి పనులు పూర్తి : - వెంకటేష్‌, ఏఈఈ, హెచ్‌ఎండీఏ 

దమ్మాయిగూడలోని నాసిన్‌ చెరువులో మురుగునీరు మళ్లింపు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం నాటికి (జూన్‌ మొదటి వారం) పైప్‌లైను నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం చెరువులో కేవలం వర్షం నీరు  చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. 


Updated Date - 2022-04-27T04:48:02+05:30 IST