NASA: విశ్వంలోనే అత్యంత అద్భుతమైన చిత్రం..!

ABN , First Publish Date - 2022-07-13T13:09:36+05:30 IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు, మునుపెన్నడూ చూడని విశ్వాన్ని తాజాగా ఆవిష్కరించింది.

NASA: విశ్వంలోనే అత్యంత అద్భుతమైన చిత్రం..!

ఈ ఫొటో1380 కోట్ల ఏళ్ల నాటి విశ్వానిది!

తొలిసారి బంధించిన నాసా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు, మునుపెన్నడూ చూడని విశ్వాన్ని తాజాగా ఆవిష్కరించింది. ఈ కొత్త టెలిస్కోపు పంపించిన తొలి ఫొటోలో 1380 కోట్ల ఏళ్ల నాటి విశ్వం దర్శనమిచ్చింది. ఇంత దూరంలోని విశ్వాన్ని, ఇంత స్పష్టతతో ఓ టెలిస్కోపు బంధించడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫొటోను నాసా విడుదల చేసింది. విశ్వం మొదలైనప్పుడు సంభవించిన మహా విస్ఫోటనానికి(బిగ్‌బ్యాంగ్‌) చాలా దగ్గరగా ఉన్న ఈ విశ్వం తాజా ఫొటోలో చిక్కిందని పరిశోధకులు వివరించారు. ఫోటోపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా.. ఫొటోలో కనిపిస్తున్న నక్షత్రసమూహాలన్నీ కలిపి విశ్వంలో కేవలం ఒక చిన్న ఇసుక రేణువు మాత్రమేనని ఈ సందర్భంగా నాసా చీఫ్‌ బిల్‌ నెల్సన్‌ వ్యాఖ్యానించారు. సుమారు రూ. 79వేల కోట్ల విలువైన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌, గత ఏడాది డిసెంబరులో దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానా నుంచి బయలుదేరిన రాకెట్‌ ద్వారా రోదసిలోకి చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్ల దూరంలో అది చేరాల్సిన ప్రదేశానికి చేరుకుంది. అప్పటి నుంచీ పూర్తిస్థాయిలో విచ్చుకుని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎట్టకేలకు తాజాగా సుదూర విశ్వం తాలూకు ఫొటోను పంపించింది. ఫొటోలోని గెలాక్సీల వయసు ఎంత అన్నదానిపై మున్ముందు రోజుల్లో అధ్యయనం చేస్తామని పరిశోధకులు వెల్లడించారు. అయితే.. ఈ రికార్డు ఎక్కువకాలం నిలబడదని, మున్ముందు వెబ్‌ టెలిస్కోప్‌ విశ్వంలో మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-13T13:09:36+05:30 IST