చరిత్ర సృష్టించిన నాసా..!

ABN , First Publish Date - 2021-04-21T00:44:15+05:30 IST

అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం(మార్స్)పైకి నాసా పంపించిన అతి చిన్న హెలికాఫ్టర్ ‘ఇన్‌జెన్యుయిటీ’ విజయవంతంగా గాల్లోకి ఎగిరింది.

చరిత్ర సృష్టించిన నాసా..!

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం(మార్స్)పైకి నాసా పంపించిన అతి చిన్న హెలికాఫ్టర్ ‘ఇన్‌జెన్యుయిటీ’ విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. శాటిలైట్ సమాచారం విశ్లేషణ ఆధారంగా నాసా ఈ విషయాన్ని ధృవీకరించింది. నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ ఫిబ్రవరిలో అరుణగ్రహంపైకి చేరిన విషయం తెలిసిందే. ఈ రోవర్ అడుగు భాగంలో నాసా ఇన్‌జెన్యుయిటీ హెలికాఫ్టర్‌ను అమర్చి మార్స్‌పైకి పంపించింది. అయితే.. పలుచనైన వాతావరణం ఉన్న మార్స్‌పై హెలికాఫ్టర్ ఎగరగలదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ నాసా ఈ చిన్న హెలికాఫ్టర్‌ను దిగ్విజయంగా ఎగిరేలా చేసింది. ‘‘మరో గ్రహంపై హెలికాఫ్టర్ ఎగిరేలా మానవాళి చేయగలిగిందని మనం ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు’’ అని ఇన్‌జెన్యుయిటీ ప్రాజెక్ట్ మేనేజర్ మిమీ ఆంగ్ వ్యాఖ్యానించారు. 


మార్స్ ఉపరితలంపై నుంచి మూడు మీటర్ల ఎత్తుకు ఎగిరిన ఇన్‌జెన్యుయిటీ.. కొద్ది క్షణాల పాటూ గాల్లోనే సంచరించి, ఆ తరువాత అటూ ఇటూ వంగి తిరిగి ఉపరితలానికి చేరుకుంది. ఈ మొత్తం విన్యాసం కేవలం 40 సెకెన్లలోనే పూర్తైంది. భవిష్యత్తులో మరిన్ని అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయని నాసా వర్గాలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాయి. ఇన్‌జెన్యుయిటీ గాల్లో ఎగిరే సమయాన్ని క్రమంగా పెంచుతూ ఈ నూతన సాంకేతికత సామర్థ్యాలు, పరిమితులను అంచనా వేసేందుకు నాసా సిద్ధమవుతోంది. కాగా.. ఇన్‌జెన్యుయిటీ విజయానికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. రైట్ సోదరులు తొలిసారిగా విమానాన్ని నడిపిన ఘటనకున్న  ప్రాధాన్యం ‘ఇన్‌జెన్యుయిటీ’ సొంతమైందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-04-21T00:44:15+05:30 IST