సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

ABN , First Publish Date - 2021-12-15T18:07:55+05:30 IST

ఇంత కాలం అసాధ్యమని భావించినదానిని నేషనల్ ఏరోనాటిక్స్

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

వాషింగ్టన్ : ఇంత కాలం అసాధ్యమని భావించినదానిని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సుసాధ్యం చేసి, చరిత్ర సృష్టించింది. దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి కరోనాను నాసా పంపించిన రోదసీ నౌక తాకింది. ఇటువంటి విజయం సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో నాసా చరిత్రలో ఓ గొప్ప మైలురాయి నమోదైంది. అంతేకాకుండా మానవాళికి, సౌర శాస్త్ర విజ్ఞానంలో గొప్ప ముందడుగు పడింది. 


నాసా మంగళవారం రాత్రి ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘మా పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని తాకింది! ఓ రోదసీ నౌక చరిత్రలో తొలిసారి సూర్యుడి వాతావరణం కరోనా గుండా  ప్రయాణించింది’’ అని తెలిపింది. 


పార్కర్ సోలార్ ప్రోబ్ అనే రాకెట్‌షిప్‌ను నాసా ప్రయోగించింది. ఇది ఏప్రిల్ 28న సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలో ప్రవేశించింది. అక్కడ పర్యటించి ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది. హార్వర్డ్ అండ్ స్మిత్‌సోనియన్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ సహా అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సహకారంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ నౌకలోని సోలార్ ప్రోబ్ కప్‌ను వీరు నిర్మించి, పర్యవేక్షించారు. సోలార్ ప్రోబ్ కప్‌ ఈ పరిశోధనలో అత్యంత కీలకమైనది. సూర్యుని వాతావరణంలోని ధూళి కణాలను సేకరించడంలో ఈ కప్ ప్రధాన పాత్ర పోషించింది. కరోనాలోకి ఈ రోదసీ నౌక వెళ్ళినట్లు శాస్త్రవేత్తలు రుజువు చేయడానికి దోహదపడింది. ఈ కప్ సేకరించిన సమాచారం ప్రకారం, ఈ రోదసీ నౌక ఏప్రిల్ 28న కరోనాలో మూడుసార్లు ప్రవేశించింది. 

ఈ చారిత్రాత్మక విజయాన్ని వివరిస్తూ ఓ సైంటిఫిక్ పేపర్ ‘ఫిజికల్ రివ్యూ లెటర్స్’లో ప్రచురితమైంది. ఈ సోలార్ ప్రోబ్ కప్ ఓ ఇంజనీరింగ్ అద్భుతమని ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆంథోనీ తెలిపారు. 


నాసా తెలిపిన వివరాల ప్రకారం, పార్కర్ సోలార్ ప్రోబ్ విజయవంతమవడం సాంకేతిక పరిజ్ఞానంలో నవకల్పన మాత్రమే కాదు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు సూర్యుడు అంతుచిక్కకుండా మిగిలిపోయాడు. ఈ విజయం వల్ల ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ రెడ్ హాట్ స్టార్ గురించి చాలా కాలం నుంచి రహస్యంగా ఉన్న విషయాలు ఇప్పుడు బయటపడతాయి. ఉదాహరణకు, సూర్యుడి ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల ఫారన్‌హీట్ కాగా సూర్యుని బయటి వాతావరణం ఉష్ణోగ్రత 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుంది. దీనికి కారణం ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. ఇటువంటి అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ఆశలు తాజాగా చిగురిస్తున్నాయి. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సౌర గాలులు వంటివాటి గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 


Updated Date - 2021-12-15T18:07:55+05:30 IST